logo

వెలుగల ప్రస్థానంలో చీకట్లు!

రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్‌. అలాంటిది ఉమ్మడి వరంగల్‌లో సింగరేణి తప్ప పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు అంతంతమాత్రమే లభిస్తున్నాయి.

Published : 28 Mar 2024 04:24 IST

నిర్మాణ దశలోనే పరిశ్రమలు
ఈనాడు, వరంగల్‌

రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్‌. అలాంటిది ఉమ్మడి వరంగల్‌లో సింగరేణి తప్ప పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు అంతంతమాత్రమే లభిస్తున్నాయి. ఇక్క పేరుకు అనేక యూనిట్లు కనిపిస్తున్నా అవి పూర్తి  కావడంలో తీవ్ర జాప్యం వల్ల పారిశ్రామిక వెలుగులు సాకారం కావడం లేదు.

  • భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 150 ఎకరాల చొప్పున ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు.’
  • జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో తోళ్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఎప్పటి నుంచో డిమాండు ఉంది.  
  • వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థతోపాటు నగరం చుట్టు ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నందున అంకుర సంస్థలు ఏర్పాటుచేసుకునేందుకు ఐటీ నిపుణులకు తగిన సదుపాయాలు కల్పించాలి.

‘ఎస్పీవీ’ ఏర్పాటైతేనే మిత్రలాభం

రంగల్‌ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల్లో నిర్మాణంలో ఉన్న కాకతీయ మెగా జౌళి పార్కులో అన్ని వస్త్ర పరిశ్రమలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా పదివేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుపై యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికి మూడు భారీ పరిశ్రమలు మాత్రమే ఇందులో తమ యూనిట్లను నెలకొల్పుతున్నాయి. గణేశా ఎకోపెట్‌, కైటెక్స్‌తోపాటు దక్షిణ కొరియా వారు నిర్మిస్తున్న యంగ్‌వన్‌లు వచ్చాయి. కేంద్ర ప్రభుతం  ‘పీఎం మిత్ర’ పథకం కింద రూ. 200 కోట్లు మంజూరు చేసింది. జౌళి పార్కును గ్రీన్‌ ఫీల్డ్‌ (కొత్తగా నిర్మించే పరిశ్రమ) కింద గుర్తించి రూ.500 కోట్లు కేటాయించాలనే డిమాండు ఉంది. మొదట మంజూరు చేసిన నిధులు రావాలంటే ప్రభుత్వం ఒక ఏజెన్సీ ద్వారా ప్రత్యేక ప్రయోజన వాహకం (స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ - ఎస్పీవీ) ఏర్పాటుచేసి కేంద్ర ప్రభుత్వానికి వివరాలు వెల్లడిస్తే నిధులను బదిలీ చేస్తుంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది కూడా వేగంగా పూర్తి చేస్తే త్వరలో ఓరుగల్లులో వస్త్ర పరిశ్రమలు కళకళలాడుతాయి.


రెండేళ్లుగా వంగర ఆహారశుద్ధి కేంద్రం పనులు

నుమకొండ జిల్లా వంగరలో గత ప్రభుత్వం 200 ఎకరాల భూసేకరణ చేపట్టి, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వేగంగా పనులు పూర్తి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక రైతులు తమ భూములను పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చారు. రెండేళ్లుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో స్థానిక రైతుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) పనులు చేపడుతోంది. రహదారుల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయి. సేకరించిన భూమిలో 100 ఎకరాల వరకు గుట్టలు ఉండడంతో చదునుగా ఉన్న 124 ఎకరాల భూమిని ఇందుకు వినియోగిస్తున్నారు. రైస్‌మిల్లులు, మిర్చి ఇతర సుగంధ ద్రవ్యాల యూనిట్లు, నూనె మిల్లులు స్థాపించేందుకు అనువైన ప్రాంతం కావడంతో ఆయా రంగాల పరిశ్రమలకు కేటాయించేందుకు 60 భారీ యూనిట్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 8 మంది పారిశ్రామిక వేత్తలకు భూములను కేటాయించారు.

ఇవీ సమస్యలు: విద్యుత్తు స్తంభాలు వేసి ఉపకేంద్రం నిర్మించాల్సి ఉంది. నీటి సరఫరా జరగాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసే ఎంఎస్‌ఎంఈ యూనిట్లు కూడా 40 వరకు నెలకొల్పేందుకు వసతులు కల్పిస్తున్నారు. ఈ పనుల్లో వేగం పెంచి జూన్‌కల్లా పూర్తి చేస్తే వంగర ఆహార శుద్ధి పరిశ్రమలకు నిలయంగా మారుతుంది.

ప్రధాన మంత్రిగా  ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన పీవీ నరసింహారావు స్వస్థలం వంగర. దేశంలో ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ఆయన ఎంతో కృషి చేశారు. ఇక్కడ ఆహార శుద్ధి పరిశ్రమను అందుబాటులోకి తెస్తే ఆయన సేవలకు తగిన గౌరవం ఇచ్చినట్లు అవుతుంది.


పనులు కొనసాగుతున్నాయి

-సంతోష్‌, జోనల్‌ మేనేజర్‌, టీఎస్‌ఐఐసీ, వరంగల్‌

వంగరలో ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు రహదారి నిర్మాణం పనులు నడుస్తున్నాయి.  మెగా జౌళి పార్కులో ఎస్పీవీ ఏర్పాటుకు జౌళి శాఖ ఉన్నతాధికారులు కేంద్రం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికల తర్వాత ప్రారంభోత్సవాలకు అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని