logo

షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

వరంగల్‌ పోచమ్మమైదాన్‌లోని జెకోటియా షాపింగ్‌ మాల్‌లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Updated : 29 Mar 2024 06:30 IST

భవనంపై ఎగసిపడుత్ను మంటలు

పోచమ్మమైదాన్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ పోచమ్మమైదాన్‌లోని జెకోటియా షాపింగ్‌ మాల్‌లో గురువారం సాయంత్రం 6.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండో అంతస్తులో ప్రారంభమైన మంటలు మూడో అంతస్తులోకి వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో షాపింగ్‌మాల్‌లో పనిచేసే సిబ్బంది, వినియోగదారులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. వెంటనే విద్యుత్తు సిబ్బంది కరెంటు సరఫరాను నిలిపివేశారు. వరంగల్‌, హనుమకొండ, పరకాల, వర్ధన్నపేటల నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు రాత్రి వరకు శ్రమిస్తున్నారు. నీరు అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ట్యాంకర్లను వినియోగించారు. ట్యాంకర్లలోని నీరు సరిపోకపోవడంతో అగ్నిమాపక వాహనాలు నీటి కోసం భద్రకాళి చెరువుకు వెళ్లి రావడం ఇబ్బందిగా మారింది. ఈ ఘటనతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. సంఘటన స్థలం  సమీపంలో ఉన్న జనాలను పోలీసులు చెదరగొట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, భారీగా ఆస్తినష్టం జరిగే అవకాశం ఉందని అగ్నిమాపకశాఖ అధికారి జయపాల్‌రెడ్డి తెలిపారు. రాత్రి 11.30 గంటల వరకు మంటలు అదుపులోకి రాకపోవడంతో ఆస్తి నష్టాన్ని అంచనా వేయలేదు. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య, మున్సిపల్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ, ఇతర ఉన్నతాధికారుల అగ్నిప్రమాదానికి గురైన భవనాన్ని పరిశీలించారు.

సిబ్బందికి గాయాలు

మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో వరంగల్‌ అగ్నిమాపకశాఖకు చెందిన హోంగార్డు గిరికి గాయాలయ్యాయి. మట్టెవాడ సీఐ గోపి అస్వస్థతకు గురయ్యారు. వారిని మంత్రి కొండా సురేఖ అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

సంఘటన స్థలంలో కలెక్టర్‌ ప్రావీణ్య, మున్సిపల్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని