logo

సమన్వయంతో పనిచేస్తేనే విజయవంతం

లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు నోడల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య సూచించారు.

Published : 18 Apr 2024 05:54 IST

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు నోడల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య సూచించారు. వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన సహాయ రిటర్నింగ్‌ అధికారులు, ఏఈఆర్వోలు, జిల్లాల నోడల్‌ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థుల వాహన అనుమతులకు సువిధ యాప్‌ ద్వారా రిటర్నింగ్‌ అధికారి పరిధిలో మంజూరు చేయాలన్నారు. సభలు, సమావేశాలకు సంబంధిత సహాయ రిటర్నింగ్‌ అధికారులు లేదా జిల్లా ఎన్నికల అధికారుల స్థాయిలో అనుమతులు మంజూరు చేయొచ్చని సూచించారు. ఎస్‌ఎస్‌టీ బృందాలు గురువారం ఉదయం నుంచి విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా అంశాలపై నిర్ణీత నమూనాలో రోజువారీ నివేదికలు సమర్పించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో తక్షణమే కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని, బీఎల్‌ఓల వివరాలు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. అత్యవసర సేవలు, 12డి ఫారం స్వీకరణ, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇంటి వద్దే ఓటింగ్‌కు సంబంధించిన ప్రక్రియను ఈ నెల 25లోగా పూర్తి చేయాలన్నారు. గత శాసనసభ ఎన్నికల ఆధారంగా పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్‌ఛైర్లు, వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్వోలు శ్రీనివాస్‌, వై.వి.గణేశ్‌ నోడల్‌ అధికారులు, ఎన్నికల పర్యవేక్షకులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

పారదర్శకంగా నామినేషన్ల స్వీకరణ

భూపాలపల్లి కలెక్టరేట్‌ : పారదర్శకంగా నామినేష్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. నామినేషన్ల స్వీకరణ, ఓటరు నమోదు దరఖాస్తుల పరిష్కారం, తుది ఓటరు జాబితా రూపకల్పన తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో బుధవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటరు స్లిప్పులు ప్రతి ఓటరుకు చేరేలా చర్యలు తీసుకోవాలని, స్లిప్పుల పంపిణీ షెడ్యూల్‌ను పోటీ చేస్తున్న అభ్యర్థులకు, రాజకీయ పార్టీల నాయకులు తెలియజేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ, పూర్తిస్థాయిలో ఫొటో, వీడియో తీయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మంగిలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని