logo

కాంగ్రెస్‌ కంచుకోట.. మానుకోట!

మహబూబాబాద్‌ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్‌ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది.

Published : 20 Apr 2024 02:10 IST

జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
భారాస, భాజపా లక్ష్యంగా విమర్శలు

హబూబాబాద్‌ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్‌ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్‌ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్‌ మైదానంలో మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళీనాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. పదేళ్లు రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న భారాస, భాజపాలు ప్రజలకు చేసిన అన్యాయాలను, అమలు చేయని హామీల గురించి వివరిస్తూ కేసీఆర్‌, మోదీలపై విమర్శల వర్షం కురిపించారు.  

ఈనాడు, మహబూబాబాద్‌


ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎడమవైపు మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళీనాయక్‌, కుడివైపు అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌. వేదికపై ఆసీనులైనవారిలో ఎడమ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యసలహాదారు వేం నరేందర్‌రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌, ప్రభుత్వ విప్‌ రామచంద్రునాయక్‌, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, మాజీ ఎమ్మెల్యే జగన్నాయక్‌, ఇల్లందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య, కాంగ్రెస్‌ నాయకులు నూకల నరేష్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి తదితరులు

ముఖ్యమంత్రి పర్యటన సాగిందిలా

మధ్యాహ్నం 3:45కు హెలికాప్టర్‌ ద్వారా రాక
సాయంత్రం 5:16కు సభావేదికపైకి వచ్చారు
5:52 నుంచి 6:17 వరకు ప్రసంగించారు
6:24కు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయల్దేరారు

25 నిమిషాల పాటు ప్రసంగం

సీఎం రేవంత్‌రెడ్డి సాయంత్రం 5.52 గంటలకు ప్రసంగం ప్రారంభించి 6.17కి ముగించారు. 25 నిమిషాల పాటు మాట్లాడారు. మానుకోట కాంగ్రెస్‌ కంచుకోట అని గుర్తుచేశారు. ఆగస్టులో రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తామని, వడ్లకు రూ.500 బోనస్‌ సైతం ఇస్తామనడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.

రేవంత్‌ రెడ్డికి నాగలి బహూకరిస్తున్న నేతలు

బస్సులో విశ్రాంతి

షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం 4 గంటలకు సభ నిర్వహించాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 3.45కే హెలికాప్టర్‌ ద్వారా మహబూబాబాద్‌కు చేరుకున్నారు. అప్పటికీ సభ ప్రాంగణానికి పార్టీ శ్రేణులు, అభిమానులు రాకపోవడంతో సీఎం బస్సులోనే గంటన్నర పాటు విశ్రాంతి తీసుకున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు వచ్చిన తర్వాత 5.16కి సభా వేదికపైకి చేరుకున్నారు.

రెండో సారి ఎంపీని చేద్దాం

బలరాం నాయక్‌ను పరిచయం చేస్తూ..

అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవిత తండ్రి రెడ్యానాయక్‌ను డోర్నకల్‌లో ఓడించి ఇంటికి పంపించాం.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కుమార్తె కవితను కూడా ఇంటికి పంపిద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.. 2009లో బలరాంనాయక్‌ను తొలిసారిగా ఎంపీగా గెలిపిస్తే... సోనియాగాంధీ ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు రెండోసారి ఎంపీగా గెలిపించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని అందులో అత్యధిక మెజారిటీ ఖమ్మం, మహబూబాబాద్‌ సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

సభకు హాజరైన జనం


పేదల అభ్యున్నతే లక్ష్యంగా

డాక్టర్‌ రాంచంద్రునాయక్‌, ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే

రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. కేంద్రంలోనూ కాంగ్రెస్‌ ఉండాలి. అప్పుడే బలహీనవర్గాల అభివృద్ధి సాధ్యం.


భాజపా చేసిందేమీ లేదు

యశస్వినిరెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. రాముడి పేరుతో ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని