logo

రాత్రిపూటా నిప్పుల కుంపటే!

ములుగు జిల్లా భానుడి ప్రతాపానికి అట్టుడికిపోతోంది. రాత్రిపూట సాధారణంగా 25-30 డిగ్రీల మధ్య ఉండాల్సిన ఉష్ణోగ్రత 33.7-36.8 డిగ్రీలు నమోదవుతోంది

Updated : 30 Apr 2024 06:04 IST

కనిష్ఠమే 33.7- 36.8 డిగ్రీలు

 వెంకటాపురం, న్యూస్‌టుడే:ములుగు జిల్లా భానుడి ప్రతాపానికి అట్టుడికిపోతోంది. రాత్రిపూట సాధారణంగా 25-30 డిగ్రీల మధ్య ఉండాల్సిన ఉష్ణోగ్రత 33.7-36.8 డిగ్రీలు నమోదవుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 45.3 డిగ్రీలు సెల్సియస్‌ నమోదవగా, వాతావరణశాఖ ఆదివారం జిల్లాలోని మూడు మండలాలను రెడ్‌ జోన్‌ కింద ప్రకటించింది భానుడు ధాటికి అత్యవసరమైనా బయటికి వెళ్లలేని పరిస్థితి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి.  కుంటలు, చెరువులు, జలాశయాలు ఎండి పశుపక్ష్యాదులు దాహార్తితో తల్లడిల్లుతున్నాయి.

 గిర్రుమంటున్న మీటర్లు

 సూర్యుడు సుర్రుమని మండుతుండటంతో విద్యుత్తు మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. పల్లెలు, పట్టణాల్లోనూ విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు వినియోగాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురాగా, ఉష్ణోగ్రతల తీవ్రతతో అత్యధిక శాతం వినియోగదారులు ఉచిత విద్యుత్తును అధిగమించి కరెంటును వినియోగించాల్సి వస్తోంది. ఏసీలు, కూలర్లు, ఇతర శీతల సదుపాయాలపై జనం దృష్టి సారించి ఉపశమనం పొందుతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

బయటికి వెళితే తప్పనిసరిగా గొడుగు, టోపీ, చేతిరుమాలును ధరించాలి. కాటన్‌ వస్త్రాలకు ప్రాధాన్యమివ్వాలి. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే తాగునీరు వెంటతీసుకెళ్లాలి. తేలికపాటి ఆహారం తీసుకుంటే మంచిది. తరచూ నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. వడదెబ్బకు గురైతే ఓఆర్‌ఎస్‌ లేదా లీటరు నీటిలో చిటికెడు ఉప్పు, కొంత పంచదార కలిపి తాగించాలి. తక్షణమే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి.

రెడ్‌ జోన్‌ నమోదు

జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా ప్రచంఢ భానుడు భగభగ మంటున్నాడు. ఏప్రిల్‌లోనే ఈ పరిస్థితి ఉంటే మే నెల ఎలా గడుసుందోననే  భయాందోళనలతో ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు. ఆదివారం వాతావరణశాఖ జారీ చేసిన ఉష్ణోగ్రతల్లో ములుగు జిల్లాలోని మూడు మండలాలు రెడ్‌ జోన్‌లోకి చేరడం గుబులు పుట్టిస్తోంది. వెంకటాపురం, వాజేడు, మంగపేట మండలాల్లో 45.1 నుంచి 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ఆరు మండలాల్లోనూ 41.1 నుంచి 44.9 డిగ్రీలకు చేరింది. దీంతో అప్రమత్తత తప్పనిసరని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని