logo

‘లోక్‌సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూత’

లోక్‌సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూతపడడం ఖాయమని స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

Published : 30 Apr 2024 03:37 IST

 సమావేశంలో మాట్లాడుతున్న కడియం శ్రీహరి, చిత్రంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, తీన్మార్‌ మల్లన్న తదితరులు

నయీంనగర్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూతపడడం ఖాయమని స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం హనుమకొండలోని కాంగ్రెస్‌ భవన్‌లో డీసీసీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాను ఆరు ముక్కలు చేసింది చాలదన్నట్లు ఏం ముఖం పెట్టుకొని కేసీఆర్‌ వరంగల్‌కు వచ్చారని ప్రశ్నించారు. తనపై విమర్శలు చేయడం మానుకొని, పార్టీని కాపాడుకునే పనిలో ఉండాలని సూచించారు. వరంగల్‌లో భాజపాను గెలిపించేందుకే భారాస తరఫున డమ్మీ అభ్యర్థిని బరిలోకి దించారని విమర్శించారు. దేశంలో మోదీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు. గతంలో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్న అరూరి వందల ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. కేయూలో సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం ప్రతినిధులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సెంట్రల్‌ జైలును కూల్చి, ఆ భూములను మహారాష్ట్ర బ్యాంకులో తాకట్టు పెట్టిన కేసీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పేదలకు పెద్ద దిక్సైన ఎంజీఎం ఆసుపత్రిని ఎలుకలకు నిలయంగా మార్చారని దుయ్యబుట్టారు. మందకృష్ణ మాదగి భాజపా కోసం సమావేశాలు పెట్టడం సిగ్గుచేట్టాన్నారు. కుల, మతాల మధ్య చిచ్చుపెడుతున్న భాజపాను ఎన్నికల్లో ఓడించాలని ప్రజలను కోరారు. పట్టు భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ.. రాజ్యాంగంలో రిజర్వేషన్ల మార్పిడికి యత్నిస్తున్న భాజపాకు గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం మాజీ కార్పొరేటర్‌ బోడ డిన్న, యువకులు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో టీపీసీసీ నేత కూచన రవళి, నగర మాజీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్‌, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ ఎండీ.అజీజ్‌ఖాన్‌, పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని