logo

ఆర్టీసీ కార్గో సేవలు అధ్వానం

హనుమకొండలోని ఆర్టీసీ కార్గో సేవలపై వినియోగదారులు మండిపడుతున్నారు. నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో పాటు వినియోగదారులే చరవాణికి ఫోన్‌ చేసినా స్పందించకపోవడం, పార్శిల్‌ వస్తే సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వకపోవడం,

Published : 05 May 2024 05:23 IST

వినియోగదారుడికి ఇవ్వకముందే  చిరిగిపోయిన పార్శిల్‌

హనుమకొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: హనుమకొండలోని ఆర్టీసీ కార్గో సేవలపై వినియోగదారులు మండిపడుతున్నారు. నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో పాటు వినియోగదారులే చరవాణికి ఫోన్‌ చేసినా స్పందించకపోవడం, పార్శిల్‌ వస్తే సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వకపోవడం, రోజుల తరబడి వాటిని కౌంటర్‌ల వద్దే ఉంచడం వంటి సంఘటనలు నిత్యం జరుగుతున్నాయి. పార్శిల్‌ ఇవ్వడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. తొలినాళ్లలో ఆర్టీసీ ఉద్యోగులే కార్గో బాధ్యతలు నిర్వహించేవారు. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. గతేడాది జూన్‌ మాసంలో కార్గొ కేంద్రాన్ని ఓ ప్రైవేటు సంస్థకు యాజమాన్యం అప్పగించింది. అప్పటి నుంచి వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ప్రతి రోజు సుమారు 450 వరకు బుకింగ్‌ అయ్యేవి. ప్రస్తుతం రోజుకు 250 మించి కావడం లేదని తెలిసింది. ఇటీవల ఓ వినియోగదారుడికి పార్శిల్‌ వచ్చింది. గత నెల 16న ఆ పార్శిల్‌ హనుమకొండలోని కార్గో కేంద్రానికి చేరింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పార్శిల్‌ కోసం వినియోగదారుడు ఫోన్‌ చేసినా నిర్వాహకులు స్పందించడంలేదు.  తీరా వినియోగదారుడు అక్కడికి వెళ్లి చూస్తే పార్శిల్‌ చిరిగిపోయి, కాగితాలు బయటకు వచ్చి పడ్డాయి. ఇదేమిటని అడిగితే నిర్వాహకులు అమర్యాదగా మాట్లాడుతున్నారు. ఆ వినియోగదారుడు ఆ పార్శిళ్లు అక్కడే ఉంచి వెళ్లాడు. వీరి నిర్వహణ ఇలాగే కొనసాగితే ప్రజలకు ఆర్టీసీపై నమ్మకం పోనుంది. ఇకనైనా ఆర్టీసీ రీజియన్‌ అధికారులు కార్గో సేవలు సమర్థవంతంగా అందించేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని