logo

ఓటేశారు.. స్ఫూర్తి రగిలించారు..!

అభివృద్ధిలో మన కన్నా దిగువన ఉన్న దేశాల్లో ఓటు హక్కు వినియోగం ఎక్కువ. మన దగ్గర ఓటు హక్కుపై చైతన్య పరిచేందుకు విభిన్న రూపాల్లో కార్యాచరణ చేపడుతున్నా నిర్లిప్తత వీడట్లేదు. సుపరిపాలన కావాలంటే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.

Published : 06 May 2024 06:29 IST

డోర్నకల్‌, మానుకోటలో మొదలైన హోం ఓటింగ్‌

డోర్నకల్‌, న్యూస్‌టుడే: అభివృద్ధిలో మన కన్నా దిగువన ఉన్న దేశాల్లో ఓటు హక్కు వినియోగం ఎక్కువ. మన దగ్గర ఓటు హక్కుపై చైతన్య పరిచేందుకు విభిన్న రూపాల్లో కార్యాచరణ చేపడుతున్నా నిర్లిప్తత వీడట్లేదు. సుపరిపాలన కావాలంటే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. హోం ఓటింగ్‌కు 85 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగుల ఆదరణ లభించింది. ఈ ప్రక్రియకి మహబూబాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల్లో ఈ నెల 3న శ్రీకారం చుట్టారు. డోర్నకల్‌, మహబూబాబాద్‌ నియోజకవర్గాల్లో హోం ఓటింగ్‌ ఆదివారం మొదలైంది. కుటుంబ సభ్యుల సహకారంతో వృద్ధులు, దివ్యాంగులు ఉత్సాహంగా ఓటేశారు. వీరిని కదిలిస్తే... యువతరం నిర్లిప్తత వీడితేనే పోలింగ్‌ శాతం పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. 13న ఓటు వేస్తే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఓటు.. మీ బాధ్యత అని గుర్తు చేస్తున్న వృద్ధులు, దివ్యాంగుల మనోగతంతో ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం


దరఖాస్తుదారుల ఇంటికి అధికారులు

డోర్నకల్‌లో హోం ఓటింగ్‌కు వచ్చిన సిబ్బంది

పీవో, ఏపీవో, మైక్రో అబ్జర్వర్‌, పోలీసు, రూట్‌ అధికారి, బీఎల్వోలతో కూడిన అధికారుల బృందం గడప గడపకు వచ్చి హోం ఓటింగ్‌ చేయించారు. డోర్నకల్‌, మహబూబాబాద్‌ నియోజకవర్గాల్లో 85 ఏళ్లుపై బడిన వారు 374, దివ్యాంగులు 383 మంది ఉన్నారు. డోర్నకల్‌లో 26 రూట్లు, మహబూబాబాద్‌లో 23 రూట్లలో అధికారులు పర్యటించి నిబంధనల మేరకు ఓటింగ్‌ జరిపారు. ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా పకడ్బందీగా ఈ ప్రక్రియ పూర్తి చేశారు. హోం ఓటింగ్‌కు ఆధార్‌ కార్డు, పోల్‌ చీటీలను ప్రామాణికంగా తీసుకున్నారు. రహస్యంగా ఓటు వేయించి డబ్బాలో పోస్టు చేయించారు. దీనిని కెమెరాలో బంధించారు.


బామ్మ ఓటు.. బంగారు బాట

92 ఏళ్లలో అదే ఉత్సాహం

డోర్నకల్‌లోని కుందోజు వారి వీధికి చెందిన ఈ బామ్మ పేరు కమలమ్మ. వయస్సు 92 ఏళ్లు. కంటి చూపు మందగించడంతో తన మనమడి సాయంతో ఇంటి వద్ద ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత శాసనసభ ఎన్నికల్లోనూ ఈ బామ్మ ఇంటి నుంచే ఓటు వేశారు. ఈ బామ్మ ఓటు... నేటి తరానికి బంగారు బాట వంటిది. మనం విధిగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వినియోగించుకుందామా... మరి.


కర్తవ్యంగా భావించి ముందుకు కదలండి

వీరబ్రహ్మచారి, డోర్నకల్‌,

పైలేరియాకు తోడు పక్షవాతం బారిన పడ్డా. గతంలో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి క్రమం తప్పకుండా ప్రతి ఎన్నికలోనూ ఓటు వేశా. ఇప్పుడు ఓటు ఇంటికి వచ్చింది. ఇంటికి ఓటు రాకున్నా... పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకుందామని మా అబ్బాయితో చెప్పా. ఇంటి దగ్గర ఓటు వేసిన నేను 13న కుటుంబ సభ్యులను ఓటు వేసి రమ్మని పోలింగ్‌ కేంద్రానికి పంపిస్తా. ఓటు మన జన్మహక్కు... విస్మరిస్తే ప్రశ్నించే హక్కు కోల్పోతాం.


మన చేతిలోనే బ్రహ్మాస్త్రం

- రేణిగుంట్ల బుచ్చయ్య, డోర్నకల్‌

నా చేతిలో సత్తువ, చలనం లేదు. అయినప్పటికీ ఇంటికి వచ్చిన ఓటును ఉపయోగించుకున్నా. ధనికుడికైనా, పేదోడికైనా ఓటు హక్కు ఒక్కటే సమానం. ఓటు విలువను గుర్తించడానికి ఇదొక్క ఉదహారణ. ఒక విధంగా చెప్పాలంటే... ఇది మన చేతిలోని బ్రహ్మాస్త్రం. బాధ్యతగా భావించి తప్పక ఓటు వేయండి. ఓటును విస్మరిస్తే అభివృద్ధికే కాదు వ్యక్తిగతంగా మనకూ నష్టమే సుమా. అదేదో ఇంటికి వచ్చే సరికి నా పని సులువైంది. వృద్ధులు, దివ్యాంగులుగా మేం ఓట్లు వేశాం. రేపటి మీ బాధ్యతను మరవకండి.


రేపటి మీ భవితకు ఊపిరి

- షేక్‌ అమీనాబీ, 95 ఏళ్లు, డోర్నకల్‌

నా వయస్సు 95 ఏళ్లు. 20 ఏళ్ల ప్రాయంలోనే మొదటి సారి ఓటు వేశా. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు వేశా. వయసు పైబడిన కూడా గత ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నా.  ఈ సారి ఓటు ఇంటి దగ్గరికి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని