logo

ఎన్నికలకు పోలీసుల రక్షణ ఛత్రం

లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

Published : 09 May 2024 02:20 IST

కవాతులో సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా, పోలీసు అధికారులు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లకు తావులేకుండా పోలీసు అధికారులు తగిన చర్యలు చేపట్టారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వరంగల్‌ పార్లమెంటు నియోజకర్గంతో పాటు జనగామ, నర్సంపేట, కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్‌, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎన్నికలు సజావుగా సాగేలా వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆరు కంపెనీల కేంద్ర బలగాలు కమిషనరేట్‌కు చేరుకున్నాయి. త్వరలో 20 కంపెనీల బలగాలు బందోబస్తు విధుల కోసం రానున్నాయి. ప్రస్తుతం 3200 మంది స్థానిక పోలీసులతో పాటు 20 కంపెనీల కేంద్ర బలగాలతో ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తున్నారు.

వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు..

పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందు కోసం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. వెబ్‌కాస్టింగ్‌తో ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని శాటిలైట్‌ ద్వారా గుర్తించవచ్చు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఏవైనా హింసాత్మక, సంఘ విద్రోహ సంఘటనలు జరిగినా కంట్రోల్‌ రూం నుంచి వీక్షించి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేయవచ్చు.

  • నియోజకవర్గంలోని ఠాణాల వారీగా బలగాలను కేటాయించారు. మండల కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. ఓటర్లకు భరోసా కల్పిస్తూ.. స్వేచ్ఛగా ఓటు వేయాలని చెబుతున్నారు.
  • కేంద్ర బలగాలు పోలింగ్‌ రోజునే కాకుండా ముందస్తుగా తనిఖీ కేంద్రాల వద్ద, బందోబస్తు సేవలు అందిస్తున్నాయి. ఈవీఎంలు  భద్రపర్చిన గదుల వద్ద కూడా సాయుధ బలగాలతో పహారా నిర్వహిస్తున్నారు.
  • సమస్యాత్మకమైన పోలింగ్‌ బూత్‌ల వద్ద స్థానిక పోలీసులు, హెడ్‌కానిస్టేబుళ్లతో పాటు కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తారు.
  • సాధారణ పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర బలగాల నుంచి ఒకరు లేదా ఇద్దరితో పాటు స్థానిక పోలీసులు ఉంటారు.

ధైర్యంగా వచ్చి ఓటు వేయాలి..

సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా బందోబస్తు ప్రణాళిక రూపొందించాం. ప్రజలు ధైర్యంగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలి. సమస్యాత్మక కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు,  పోలింగ్‌ శాతం పెరగడానికి ఇతర శాఖల అధికారులతో సమస్వయం చేసుకుని పని చేస్తున్నాం. ఎన్నికలు ముగిసి, ఈవీఎంలను భద్రపర్చే వరకు పోలీసులు అప్రత్తంగా ఉండి విధులు నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని