logo

ప్రత్యర్థితో కలిసి ప్రియురాలి హత్య

భూ వివాదంలో సాయం చేస్తానని నమ్మబలికి.. వివాహితతో సహజీవనం చేసిన ఓ వ్యక్తి డబ్బు కోసం ప్రత్యర్థితో చేతులు కలిపి ఆమె ప్రాణాలు తీయడంతో పాటు మృతదేహాన్ని దహనం చేసిన ఉదంతమిది.

Updated : 02 Feb 2023 06:35 IST

నిందితులను చూపుతున్న పోలీసులు

చింతలపూడి, న్యూస్‌టుడే: భూ వివాదంలో సాయం చేస్తానని నమ్మబలికి.. వివాహితతో సహజీవనం చేసిన ఓ వ్యక్తి డబ్బు కోసం ప్రత్యర్థితో చేతులు కలిపి ఆమె ప్రాణాలు తీయడంతో పాటు మృతదేహాన్ని దహనం చేసిన ఉదంతమిది. ఈ కేసుకు సంబంధించి ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ చింతలపూడి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. చింతలపూడి నగర పంచాయతీలోని ఎస్బీఐ నగర్‌కు చెందిన మహిళ(37) భర్త 2015లో చనిపోయారు. అప్పటి నుంచి తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి ఆమె స్థానిక అత్త వారింట్లో ఉంటోంది. తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో ఉన్న సుమారు అరెకరం భూమి విషయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరాకు చెందిన నంబూరి శ్రీనివాసరావుతో మహిళకు కొంత కాలం నుంచి వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంపై ఆమె 2016లో కోర్ట్టులో దావా వేసింది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట చింతలపూడి మండలం ఎండపల్లికి చెందిన బర్రె రాంబాబుతో పరిచయం ఏర్పడింది. భూమి విషయంలో సహాయ, సహకారాలు అందిస్తానని చెప్పడంతో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే భూవివాదం ఎంతకీ తేలకపోవడంతో నంబూరి శ్రీనివాసరావు, బర్రె రాంబాబు ఒక్కటయ్యారు. ఆ మహిళను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా గత నెల 19న మహిళను రాంబాబు బాడుగ కారులో ఎక్కించుకొని కాకినాడ సర్పవరం జంక్షన్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో రాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. గత నెల 21వ తేదీ తెల్లవారుజామున మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని ముందుగా అనుకున్న ప్రకారం తెలంగాణ రాష్ట్రం దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామ శివారులోని డంపింగ్‌ యార్డు వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. ఆ సమయంలో ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. అదే రోజు మహిళ సోదరుడిని తీసుకొని చింతలపూడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు అనుమానిస్తున్నారనే భయంతో హైదరాబాద్‌ పారిపోయాడు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సత్యనారాయణ, సీఐ మల్లేశ్వరరావు, ఎస్సై హరికృష్ణ కేసు దర్యాప్తులో వేగం పెంచారు. ఎస్సై తన సిబ్బందితో కలిసి హైదరాబాద్‌ వెళ్లి గాలించి నిందితుడిని అరెస్టు చేసి తీసుకొచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన బర్రె రాంబాబు, నంబూరి శ్రీనివాసరావులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించిన చింతలపూడి పోలీసులను ఎస్పీ అభినందించారు.  


బంధువులు, కుటుంబ సభ్యుల ఆందోళన

గత నెల 19న తన కుమార్తె అదృశ్యమైనా పోలీసులు ఇప్పటి వరకు మృతదేహాన్ని అప్పగించలేదని మృతురాలి తల్లితో పాటు బంధువులు, కుటుంబ సభ్యులు చింతలపూడిలో బుధవారం ఆందోళన చేశారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులతో కలిసి స్థానిక ఫైర్‌స్టేషన్‌ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి ప్రదర్శనగా గురుభట్లగూడెం వద్దకు చేరుకొని సుమారు రెండు గంటల పాటు రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
* రెండు రోజుల్లో తిరిగివస్తాను. నువ్వు, చెల్లి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్లిన తల్లి ఇక రాదన్న నిజం నమ్మలేక ఇద్దరు కుమార్తెలు కన్నీటి పర్యంతమయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని