logo

గణపవరం విలీనం లాంఛనమే!

ఏలూరు జిల్లాలోని గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేయడం ఇక లాంఛనం కానుంది.

Published : 09 Feb 2023 05:48 IST

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లాలోని గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేయడం ఇక లాంఛనం కానుంది. ఏలూరు రెవెన్యూ డివిజన్‌లోని ఈ మండలాన్ని భీమవరం రెవెన్యూ,  తాడేపల్లిగూడెం పోలీస్‌ సబ్‌ డివిజన్‌లోకి మార్చడానికి బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. దీంతో విలీనంపై దాదాపు స్పష్టత వచ్చినట్లేనని ఓ రెవెన్యూ అధికారి తెలిపారు. మండల ప్రజల ఆకాంక్షల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలోకి కలపాలని గత ఏడాది మే 16న గణపవరంలో నిర్వహించిన రైతు భరోసా చెక్కుల పంపిణీ సభకు హాజరైన సీఎం జగన్‌ను ఎమ్మెల్యే వాసుబాబు కోరారు. దీంతో ఆ మేరకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విలీనంపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలని గత ఏడాది నవంబరు 10న ప్రభుత్వం పేర్కొంది.

నాటకీయ పరిమాణాలు.. అభ్యంతరాలు తెలియజేయడానికి ఇచ్చిన 30 రోజులు గడువు వారంలో ముగుస్తుందనగా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గణపవరం మండలాన్ని ఓ వర్గం భీమవరం రెవెన్యూ డివిజన్‌లో కలపాలని, మరో వర్గం ఏలూరులోనే కొనసాగించాలంటూ పట్టుబట్టాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి  కలెక్టర్లకు, స్థానిక తహశీల్దారుకు అభ్యంతరాలు ఇచ్చారు. ఓ వర్గానికి ఎమ్మెల్యే వాసుబాబు మద్దతు పలుకుతున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం హామీకే కట్టుబడి ఉన్నానని వెల్లడించారు.

తగ్గనున్న దూరాభారం.. ప్రస్తుతం ఏలూరు జిల్లాకు గణపవరం శివారున ఉంది. మండల కేంద్రం నుంచి ఏలూరు 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివారు గ్రామమైన ఎస్‌.కొండేపాడు 80 కి.మీ.దూరంలో ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. భీమవరం మండల కేంద్రం గణపవరం నుంచి 17 కి.మీ, ఎస్‌.కొండేపాడు 15 కి.మీ. దూరం ఉండటంతో దూరాభారం తగ్గనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని