logo

రోడ్డునూ రాసిచ్చేశారు!

పదిహేనేళ్ల కిందట బ్రాహ్మణచెర్వులో పేదలకు స్థలాలు కేటాయించారు.

Updated : 11 Mar 2024 05:35 IST

ప్రజావసర స్థలాల్లో  ప్లాట్లు
అనుచర గణానికి వైకాపా నాయకుల పందేరం

పెనుమంట్ర, న్యూస్‌టుడే: పదిహేనేళ్ల కిందట బ్రాహ్మణచెర్వులో పేదలకు స్థలాలు కేటాయించారు. అక్కడ రూ.50 వేలు విలువ చేయని స్థలం... కాలనీ ఏర్పడ్డాక రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో ఆ కాలనీలో ‘ఖాళీ స్థలాలపై’ అధికార పార్టీ నేతల కన్నుపడింది. ప్రజావసరాలకు కేటాయించిన ఖాళీ స్థలాలను ప్లాట్లుగా విభజించి కొందరికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడి నివాసితులు భగ్గుమన్నారు. అయినా లెక్క చేయకుండా తాత్కాలిక పట్టాలను సిద్ధం చేయించారు.

ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో గెలుపు కోసం అధికార పార్టీ అన్ని శక్తులనూ ఒడ్డుతోంది. వాలంటీర్‌ వ్యవస్థ రాకతో చెల్లాచెదురైన నాయకులను తమ వైపు రప్పించుకునే ప్రయత్నాలకు గ్రామాల్లో తెర లేపారు. దీనిలో భాగంగా తమ అనుచరగణంతోపాటు కొందరు కీలక వ్యక్తులకు స్థలాలు ఎర వేసి తమ వైపు రప్పించుకునే యత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే జగనన్న కాలనీల్లో స్థలాలు ఇచ్చేయడంతో వాటి పరిధిలో ఉన్న కామన్‌ స్థలాలపై వారి దృష్టి పడింది. ఆయా ప్రాంతాల్లోని పాత, కొత్త కాలనీల్లో స్థలాలు పొందిన వారి వివరాలతోపాటు ఖాళీ స్థలాల వివరాలు సేకరించారు. వీటిలో తమకు అనుకూలమైన కాలనీల్లో స్థలాల కోసం పట్టుపడుతున్నారు. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో ఈ రకమైన ప్రక్రియ గుట్టుగా సాగిపోతుంది. ఎన్నికల బదిలీల్లో భాగంగా పొరుగు జిల్లాలకు వెళ్లిన పలువురు తహసీల్దార్లు ఇందులో ప్రజాప్రతినిధుల ఒత్తిడులకు తలొగ్గినట్లు తెలుస్తోంది. కొత్తగా వచ్చిన తహసీల్దార్లకు ఇదీ కొంత సమస్యగా మారింది.

ఆందోళనతో కామన్‌ స్థలమిచ్చే ప్రయత్నం!

పొలమూరు పంచాయతీ పరిధిలోని నాగళ్లమెరకలో 42 ప్లాట్లతో లేఅవుట్‌ తయారు చేశారు. స్థలాలన్నీ పూర్తిగా స్థానికులకు ఇచ్చే విధంగా సొమ్ములు సైతం వసూలు చేశారు. తొలుత స్థానికులకు 29 పట్టాలు ఇచ్చి.. మిగిలిన 13 మందికి నాలుగేళ్ల తర్వాత సొమ్ము వెనక్కి ఇచ్చేశారు. ఈ ఖాళీ 13 స్థలాలను గ్రామంలోని అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి అనుచరులకు కట్టబెట్టారు. దీనిపై బాధితులు రోడ్డెక్కారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేయడం,  ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో స్థానిక పార్టీ పెద్దలు కంగుతిన్నారు. స్థలాలు ఏమీ లేవంటూనే కొందరికి కామన్‌ స్థలం ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక గ్రామంలో 189 ప్లాట్లతో వేసిన లేఅవుట్‌లో కామన్‌ స్థలం లేకుండా చేశారు. తొలుత వేసిన ప్లాన్‌ను మార్చి మరీ ప్లాట్ల సంఖ్యను పెంచి తమకు కావాల్సిన వారికి పంపకం చేసేశారు.

రహదారిని తొలగించి..

పెనుమంట్ర పంచాయతీ పరిధి బ్రాహ్మణచెర్వు పాత కాలనీలో నాయకుల తీరు అందరిని విస్మయ పరుస్తోంది. ఏకంగా కాలనీవాసుల కోసం నిర్మించిన రహదారిని సైతం తొలగించి ఏడుగురికి పట్టాలు తయారు చేసేశారు. ఇక్కడే ప్రజావసరాల కోసం ఉంచిన స్థలంలో మరో 12 మందికి పట్టాలు తయారు చేసి స్థలం కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని