logo

మహిళలు ముందుకొచ్చి పోరాడాలి

తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది.

Published : 29 Mar 2024 04:18 IST

‘నిజం గెలవాలి’ యాత్రలో భువనేశ్వరి
ముగిసిన మూడు రోజుల పర్యటన

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే, నూజివీడు రూరల్‌, ఆగిరిపల్లి: తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలకు ఆయన సతీమణి భువనేశ్వరి నేనున్నానంటూ..బాసటగా నిలిచారు. వారిని కలిసేందుకు ఆమె చేస్తున్న నిజం గెలవాలి యాత్ర మూడో రోజు గురువారం ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో సాగింది. నలుగురు మృతుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. చంద్రబాబు పంపిన భరోసా పత్రాలు అందించారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

యాత్ర సాగిందిలా.. భువనేశ్వరి ఉదయం 11.30 గంటలకు తోటపల్లి చేరుకున్నారు. బెజవాడ రామారావు కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు. అక్కడికి తరలివచ్చిన మహిళలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తర్వాత ఆగిరిపల్లిలో కల్వకొల్లు శ్రీరాములమ్మ, పలగాని చంద్రయ్య కుటుంబాలను పరామర్శించారు. అనంతరం నూజివీడు మండలం గొల్లపల్లి చేరుకున్నారు. అక్కడ వెనిగళ్ల పూర్ణచంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించారు. స్థానికులతో మాట్లాడారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని..మహిళలు ముందుకొచ్చి పోరాటం చేయాలని సూచించారు. యాత్ర ప్రారంభం నుంచీ మహిళలు భారీ ఎత్తున చేరుకుని హారతులు పడుతూ స్వాగతం పలికారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో చప్పట్లు, నినాదాలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అక్కడి నుంచి యాత్ర హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా గుడివాడ నియోజకవర్గం వైపు సాగింది. కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు,  కూటమి లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు పుట్టా మహేశ్‌కుమార్‌, కొలుసు పార్థసారథి,   తెదేపా నాయకులు పాల్గొన్నారు.

3 రోజులు.. 5 నియోజకవర్గాలు.. ఏలూరు, పశ్చిమ జిల్లాల్లో ఈ నెల 26న మొదలైన నిజం గెలవాలి యాత్ర మూడు రోజుల పాటు సాగి గురువారం ముగిసింది. పోలవరం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నూజివీడు నియోజకవర్గాల్లో మొత్తం 13 మంది మృతులకు సంబంధించి వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో వైకాపా పాలనలో జరుగుతున్న అరాచకాలు, చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తీరు, కూటమి ప్రభుత్వం విజయం సాధించాల్సిన అవసరాన్ని, తాను ప్రజల్లోకి రావడానికి దోహద పడిన పరిణామాలు తదితర అనేక విషయాలపై మాట్లాడారు. ఆమె వెళ్లిన ప్రతి చోటా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని