logo

చేలకు నీరు.. చేరని తీరు

జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో  సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు.

Published : 29 Mar 2024 04:21 IST

అడ్డంకులతో శివార్లలో అవస్థలు!
బీటలు తీస్తున్న పంట భూములు

మోటార్‌ సాయంతో నీటి మళ్లింపు

మొగల్తూరు, ఆచంట, పెనుమంట్ర, న్యూస్‌టుడే: జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో శివారు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మొగల్తూరు మండలంలో  సుమారు 150 ఎకరాలకు నీటిఎద్దడి ఉందని కర్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రధాన కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకంగా మారింది. జిన్నూరు కాలువ పరిధిలోని శేరేపాలెం, కొత్తపాలెం నరసాపురం కాలువ ఆయకట్టు పరిధిలో మొగల్తూరు, కొత్తకాయలతిప్ప, రామన్నపాలెం గ్రామాల్లోని పలు ప్రాంతాలకు సమస్యగా ఉంది. పక్వానికి వస్తున్న పంటను వదల్లేక కొన్నిచోట్ల రైతులు సొంత ఖర్చులతో మోటార్ల ద్వారా నీటిని తోడుకుంటున్నారు. అయిదేళ్లుగా కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సారీ నీటి ఎద్దడి మరింత ఎక్కువగా ఉంటుందని ముందస్తుగా అంచనా వేసినా ఆ దిశగా యంత్రాంగం అప్రమత్తం కాలేదనే ఆరోపణలు ఉన్నాయి. కాలువల్లో కనీసం  గుర్రపుడెక్క తొలగించకపోవడంతో ఉన్న కాస్త  నీరు ముందుకు సాగక పొలాలకు చేరడం లేదు.  

సాగు భారం.. ఆచంట మండలం ఎ.వేమవరంలోని పలు ప్రాంతాల్లో భూములకు నీరందక  పొలాలు బీటలు తీశాయి. ఇక్కడ దాదాపు 70 ఎకరాలకు పైగా నీటి ఎద్దడి ఉంటుందని అంచనా. నక్కల కాలువ పక్కన ఉన్న వందలాది ఎకరాలు మరో నెల దాటితే కాని పక్వానికి వచ్చే అవకాశం లేదు. సార్వాలో ఇక్కడ ముంపు సమస్యతో తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు నీరందక ఎకరాకు అదనంగా రూ.అయిదు వేలు ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. వల్లూరు గ్రామ పరిధిలో 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు నీటి సమస్య ఉంది. ఆచంట, కొడమంచిలి, పెనుమంచిలి, కరుగోరుమిల్లి గ్రామాల్లోని శివారు ప్రాంతాల రైతులు ఆయిల్‌ ఇంజిన్ల ద్వారా నీటిని తోడి పంటను కాపాడుకుంటున్నారు. దీంతో అదనంగా వెచ్చించాల్సి రావడంతో సాగు వ్యయం భారం అవుతోందని వాపోతున్నారు.

మూడేళ్లుగా నష్టాలే.. నేను మూడున్నర ఎకరాలు సాగు చేస్తున్నా. సక్రమంగా నీరందక ఇబ్బందులు పడుతున్నాం. నీటి కోసం అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. మూడేళ్ల నుంచి ఏటా          రూ.50 వేల నుంచి రూ.80 వేలు  నష్టపోతున్నా.

తూము నాగభూషణం, రైతు, వేమవరం

వ్యవసాయం చేయలేం.. సార్వాలో ముంపు, దాళ్వాలో నీరందక అదనపు పెట్టుబడి తప్పడం లేదు. పూర్తిస్థాయిలో నీరు ఇస్తామని చెప్పడంతో సాగు చేశా. తీరా నీరందక నానా కష్టాలు పడుతున్నాం. ఎకరానికి రూ.5 వేలు ఆయిల్‌ ఖర్చు అవుతోంది.

వరదా వెంకటేశ్వరరావు, రైతు, వేమవరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని