logo

వైకాపా సిద్ధం.. జనానికి నరకం

ఎన్నికల నేపథ్యంలో జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రజలకు నరకం చూపించింది. ఏలూరు నుంచి నారాయణపురం వరకు ట్రాఫిక్‌ అంతరాయంతో అతలాకుతలమైంది. దాదాపు మూడు గంటల పాటు ఆ మార్గంలో జన జీవనం స్తంభించింది..

Updated : 16 Apr 2024 05:41 IST

పేలవంగా బస్సు యాత్ర

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే, బృందం: ఎన్నికల నేపథ్యంలో జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రజలకు నరకం చూపించింది. ఏలూరు నుంచి నారాయణపురం వరకు ట్రాఫిక్‌ అంతరాయంతో అతలాకుతలమైంది. దాదాపు మూడు గంటల పాటు ఆ మార్గంలో జన జీవనం స్తంభించింది.. దీనికి వేసవి ఉక్కపోత తోడవడంతో ప్రజలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు అల్లాడారు. అరకొర స్పందనతో జిల్లాలో తొలి రోజు జగన్‌ బస్సు యాత్ర ఓ విఫల యాత్రగా సాగింది. యాత్ర సాగిన విధానం చూస్తే సీఎం జనాలను కలిసేందుకు, వారి బాధలు వినేందుకు చేపట్టినట్లు ఎక్కడా కనిపించలేదు. సీఎంకు ఇది ఓ విహార యాత్రలా..వరదల సమయంలో ఆయన చేసే విహంగ వీక్షణంలా ఉంది. ప్రజలను కలిసేందుకు వచ్చిన వ్యక్తి అభివాదాలు..అర్థంలేని హావభావాలతో 60 కిమీ చుట్టేయడంతో వైకాపా కార్యకర్తలే ముక్కున వేలేసుకున్నారు. దాదాపు 8 కూడళ్లు ఉంటే ఒక్క చోట కూడా జనం పోటెత్తిన దృశ్యాలు కనిపించలేదు. కొన్ని చోట్ల జనాలు లేకపోవటంతో సీఎం కనీసం బస్సులో నుంచి తొంగి కూడా చూడలేదు. 

నారాయణపురంలో మూసివేయించిన దుకాణాలు

ట్రాఫిక్‌ స్తంభించి యాతన.. సీఎం కలపర్రు టోల్‌ గేటు దగ్గరకు రావడానికి ముందే 16వ నంబర్‌ జాతీయ రహదారి రెండు వైపులా ట్రాఫిక్‌ ఆపేశారు. యాత్ర కలపర్రు దాటి..గుండుగొలను చేరినా వాహనాలను వదల్లేదు దాదాపు గంట పాటు కిమీ మేర ట్రాఫిక్‌ నిలిచిపోవటంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. తర్వాత ఒకేసారి వాహనాలను వదిలినా చాలా దూరం వాహనాలు కదల్లేని పరిస్థితి ఉంది. కలపర్రు, ఆశ్రం, గుండుగొలను, కైకరం, పూళ్ల, నారాయణపురం.. ఇలా ప్రతి కూడలిలోనూ ప్రజలు నరకయాతన అనుభవించారు. సీఎం కాన్వాయ్‌ 15 కిమీ ముందుకు వెళ్లినా వాహనాలను వదలకపోవటంతో వాహనదారులు హారన్లు కొడుతూ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలంతా పనులు ముగించుకుని వచ్చే సమయం, జాతీయ రహదారి కావటంతో దూర ప్రయాణాలు చేసేవారు చాలాసేపు ట్రాఫిక్‌ చక్రబంధంలో ఇరుక్కున్నారు. సర్వీస్‌ రహదారుల్లో వెళదామంటే పోలీసులు బారికేడ్లతో మూసేశారు. సీఎం రాక నేపథ్యంలో జాతీయ రహదారిపై ఉన్న దుకాణాలను సైతం పోలీసులు బలవంతంగా మూయించారు.

కలపర్రు టోల్‌గేటు వద్ద నిలిచిన ట్రాఫిక్‌

యాత్ర సాగిందిలా: గుడివాడలో బహిరంగ సభ అనంతరం జగన్‌ బస్సు యాత్ర రాత్రి 7.30 గంటలకు కలపర్రు టోల్‌ గేటు దగ్గర ఏలూరు జిల్లాలో ప్రవేశించింది. జిల్లా ప్రవేశంలోనే జన స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో ఆశ్రం కూడలి దగ్గర జగన్‌ కనీసం బస్సులో నుంచి బయటికి కూడా చూడలేదు అక్కడ నుంచి యాత్ర గుండుగొలను..భీమడోలు చేరుకుంది. అక్కడ కొంత జన సమూహం ఉండటంతో బస్సు పైకి ఎక్కి అభివాదం చేశారు. అక్కడ నుంచి కైకరం..చేబ్రోలు మీదుగా రాత్రి 9.40కి నారాయణపురం బస ప్రాంతానికి చేరుకున్నారు.

ఆశ్రం కూడలి వద్ద రాకపోకల్ని ఆపేసిన పోలీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని