logo

ఇంకెంతన్నారు.. వేతనానికే దిక్కు లేదు

వైద్య ఆరోగ్య శాఖలోని జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) సిబ్బంది రెండు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 18 Apr 2024 06:20 IST

ఆర్భాటమే తప్ప అమలుకు నోచని ముఖ్యమంత్రి హామీ

ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల వేదన

ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న జాతీయ  ఆరోగ్య మిషన్‌ సిబ్బంది (పాత చిత్రం)

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖలోని జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) సిబ్బంది రెండు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.  అసలే చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటే దాన్ని సక్రమంగా ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అధికారంలోకి రాగానే వేతనం రూ.35 వేలు చేస్తామని జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారని.. తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఊసే మర్చిపోయారని ప్రస్తుతం అందిస్తున్న వేతనం కూడా సక్రమంగా రావడం లేదని సిబ్బంది వాపోతున్నారు.

ఉమ్మడి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 2 వేల మంది జాతీయ ఆరోగ్య మిషన్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంలు, ఫార్మసిస్టులు, ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోలు ఇలా అనేక హోదాల్లో వీరు సేవలందిస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వీరికి నెలకు వేతనం రూ.15 వేలు. దీన్ని పెంచాలని గతంలో అనేక ఆందోళనలు చేపట్టారు ఈ క్రమంలోనే గత ఎన్నికలకు ముందు జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అధికారంలోకి రాగానే వేతనం పెంచుతామని ఆయన ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు.

వేతనాలు సక్రమంగా అందక..

ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఎం సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ సకాలంలో రావని, ఎప్పుడూ 5వ తేదీ లోగా జీతం అందుకోలేదని, 10, 15 తేదీలు దాటాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఇంటి అద్దెలు, నిత్యావసరాలకు జీతం సరిపోవడం లేదని, అది కూడా సక్రమంగా రావడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి సకాలంలో జీతాలు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

మొండి చేయి చూపారు..

‘నెల అంతా కష్టపడి పనిచేస్తున్నాం. అయినా మాకు కష్టాలు తప్పడం లేదు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామని, జీతాలు రూ.35 వేలు చేస్తామని జగన్‌ మోహన్‌ రెడ్డి నమ్మబలికారు. అందరం ఓట్లు వేసి గెలిపించాం. తీరా మొండి చేయి చూపారు. ఇప్పుడిచ్చే రూ.15 వేల జీతమైనా సక్రమంగా ఇవ్వాలి.’ అని టెక్నీషియన్‌ కె.అనిల్‌ కుమార్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని