logo

అభివృద్ధి కావాలా.. జూద శిబిరాలు కావాలా

సోమవారం సాయంత్రం 5.45 గంటలకు పవన్‌ గణపవరం మహాలక్ష్మి థియేటర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడికి భారీగా చేరుకున్న నాయకులు అపూర్వ స్వాగతం పలికారు.

Updated : 30 Apr 2024 06:52 IST

మోసపు వైకాపాను సాగనంపేద్దాం
కూటమిని గెలిపిస్తేనే మంచి రోజులు
ఆక్వా రంగానికి పూర్వ వైభవం తెస్తాం
గణపవరం వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్‌కల్యాణ్‌

 

ఎన్నికల గుర్తును చూపుతూ ధర్మరాజు, మహేశ్‌ యాదవ్‌తో కలిసి ఓటు అభ్యర్థిస్తున్న  పవన్‌ కల్యాణ్‌,

జనసేనానికి ఘన స్వాగతం..సోమవారం సాయంత్రం 5.45 గంటలకు పవన్‌ గణపవరం మహాలక్ష్మి థియేటర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడికి భారీగా చేరుకున్న నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. గజమాల వేసి ఆహ్వానించారు. అక్కడి నుంచి జనసేనాని ర్యాలీగా పోలీస్‌ ఐల్యాండ్‌కు చేరుకున్నారు. దారి పొడవునా మహిళలు హారతులు పట్టారు. పవన్‌ సభా ప్రాంగణానికి చేరుకునే సమయానికి ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. పవన్‌ ప్రసంగం ఆద్యంతం అభిమానుల కేరింతలతో హోరెత్తింది. రాత్రి 8 గంటలకు సభ ముగించుకుని ర్యాలీగా వెళ్లి తాడేపల్లిగూడెం సభలో మాట్లాడారు. ఆయా సభలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల తెదేపా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, రామరాజు, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, భాజపా నరసాపురం పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాస వర్మ, భాజపా ఉంగుటూరు అసెంబ్లీ కన్వీనర్‌ శరణాల మాలతీరాణి, జనసేన తాడేపల్లిగూడెం అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌, ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


ఉంగుటూరు, గణపవరం, నిడమర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘వైకాపా పాలనలో ఆక్వా రంగం కుదేలైంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆక్వా రంగానికి పూర్వవైభవం తీసుకొస్తాం. మీకు అభివృద్ధి కావాలో..జూద శిబిరాలు కావాలో నిర్ణయించుకోండి’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గణపవరం వారాహి విజయభేరి సభలో ప్రసంగించారు. ఆక్వా ఉత్పత్తులు నిత్యం రవాణా చేసే పశ్చిమలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు వైకాపా పాలనలో తన ఇంటి ముందు కూడా రోడ్డు వేసుకోలేక పోయారని, తాము అధికారంలోకి రాగానే రోడ్డు వేస్తామన్నారు. ప్రతిపక్ష నేతగా సీఎం జగన్‌ పాదయాత్ర సమయంలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు, రక్షిత నీటి ప్లాంట్లు నిర్మిస్తామని ఇదే గణపవరంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయిదేళ్లు పూర్తైనా తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయారని ఎద్దేవా చేశారు. నారాయణపురం, పూళ్ల, గుండుగొలను వంతెనలు నిర్మిస్తానన్న జగన్‌ హామీ తుంగలో తొక్కి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. నిడమర్రు మండలం భీమేశ్వర స్వామి దేవస్థానం చెరువులకు వైకాపా నాయకులు లీజు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జూద శిబిరాలు నిర్వహించడంలో బీజీగా ఉంటూ ప్రజల సమస్యలు గాలి కొదిలేశారని విమర్శించారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటే గాజుగ్లాసుకి ఓట్లు వేసి ధర్మరాజును గెలిపించాలన్నారు. కొల్లేరు సమస్యలను పరిష్కరించాలంటే సమస్యలపై పార్లమెంటు చెప్పగల ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్‌ యాదవ్‌కు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. 
ఏలూరును స్మార్ట్‌ సిటీ చేస్తాం.. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా..రైతులు బాగుండాలన్నా..యువతకు ఉద్యోగాలు రావాలన్నా ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలి. రాష్ట్రం కోసం పవన్‌ కొంచెం తగ్గి కూటమి ఏర్పడటానికి కారణమయ్యారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 8 రకాల పరిశ్రమలు తీసుకొస్తాం. ఏలూరును స్మార్ట్‌ సిటీగా మారుస్తాం.
- పుట్టా మహేశ్‌కుమార్‌, ఏలూరు


పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి

మోసపురెడ్డిని సాగనంపేద్దాం.. కొల్లేరు పరిధిలోని గ్రామాల్లో తాగునీరు    లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాంటూరు సమస్యతో జిరాయితీ భూముల రైతులు పరిహారం లేక  అవస్థలు పడుతున్నారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు కొత్తతరం రాజకీయాల్లో వస్తే పవన్‌ రాకతో మళ్లీ కొత్తతరం వచ్చింది. మోసపురెడ్డి అధికార దాహంతో మళ్లీ ఓట్లడుగుతున్నారు. ఆయన్ని సాగనంపేద్దాం.

-పత్సమట్ల ధర్మరాజు, ఉంగుటూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని