logo

నీకు కప్పం తప్ప ఇల్లు కట్టలేకపోయాం!

ఇనుముతో సమానంగా ఇసుక ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు భవన నిర్మాణానికి వెనకడుగు వేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 12 ఇసుక రీచ్‌లు ఉన్నాయి.

Updated : 02 May 2024 05:39 IST

 వైకాపా ప్రభుత్వంలో సాకారం కాని సొంతిళ్లు
పెరిగిన ధరలతో పునాదుల్లోనే నిలిచిన పనులు

ఇసుక కొరత కారణంగా నిలిచిన భవన నిర్మాణం

ఇనుముతో సమానంగా ఇసుక ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు భవన నిర్మాణానికి వెనకడుగు వేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 12 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిందిపోయి రవాణా పేరుతో ప్రజలు భరించలేని విధంగా వైకాపా ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. 3 యూనిట్లు రూ.6 వేల నుంచి రూ.9 వేలకు లభించేది. ప్రస్తుతం రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. ఇసుక రీచ్‌లవద్దే సీనరేజీ, బాట ఛార్జీల పేరిట ఒక్కొక్క లారీకి అదనంగా రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. ఇసుక ధరకు సమానంగా రవాణా ఛార్జీలు భరించాల్సిరావడం సామాన్యులకు భారంగా మారింది.

  • ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పాలకొల్లుకు చెందిన పాలపర్తి సాయిబాబా. వృత్తి తాపీమేస్త్రి. తనకున్న 60గజాల స్థలంలో సొంతింటి కలను సాకారం చేసుకుందామని గత ఏడాది ఇంటి నిర్మాణంలోకి దిగారు. ఒక మేస్త్రిగా తన ఇల్లు పూర్తిచేయడానికి సుమారు రూ.12 లక్షల వ్యయ ప్రతిపాదనతో పనులు ప్రారంభించారు. అంతకంతకూ పెరుగుతున్న భవన నిర్మాణ మెటీరియల్‌, కూలీల ఖర్చులతో అంచనా మరో రూ.4 లక్షలకు పెరిగిపోయింది. రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబం డబ్బు సర్దుబాటు చేయలేక ప్రస్తుతానికి పనులు విరమించారు. ఎన్నో ఇళ్లు కట్టిన తాపీమేస్త్రికే సొంతిల్లు పూర్తిచేయాలంటే కత్తిమీద సామవుతుందని సాయిబాబా వాపోయారు.

మా వల్ల కాదు బాబోయ్‌..

నాలుగేళ్ల కిందట వంద చదరపు గజాల స్థలంలో హంగులు లేని పక్కా ఇంటిని నిర్మించేందుకు సుమారు రూ.4.50 లక్షల వరకు ఖర్చయ్యేది. ఇసుక ధరలు, ఇతర నిర్మాణ సామగ్రి ధరల పెంపు ప్రభావంతో ఇప్పుడు రూ.7 లక్షల వరకు ఆ ఖర్చు చేరింది. టన్ను రూ.40 వేలుండే ఇనుము రూ.70 వేలు దాటిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిపనికీ నాయకుల నుంచి అధికారుల వరకు మామూళ్ల రూపంలో కప్పం కట్టలేక కుదేలైన కుటుంబాలు అనేకం ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

ఆకాశాన్నంటడంతో ఆగిపోయాం

ఒకదాని తర్వాత ఒకటిగా ఆకాశాన్నంటిన ధరల్లో నదుల్లో ఉండే ఇసుకను తీసుకెళ్లి కొండమీద కూర్చోబెట్టిన జగన్‌ ప్రభుత్వంలో సొంతిల్లు అయ్యేపనికాదని మా ఇంటి నిర్మాణాన్ని సగంలో నిలిపివేశాం. నాలుగేళ్ల కిందట మేము ఇంటి నిర్మాణం ప్రారంభించినపుడు. ఇసుక 6 యూనిట్లు రూ.12 వేలకు లభించేది. ఇప్పుడు రూ.30 వేలకు పైబడింది. ఇసుక ధర తగ్గితే తప్ప ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకునే పరిస్థితి ఎవరికీ లేదు.

-కె.విజయ, ఏలూరు


రెట్టింపు ధరకు  కొనుగోలు చేశాం

‘ఆరేళ్ల కిందట ఇంటి నిర్మాణం ప్రారంభించా. అప్పట్లో ఇసుక ఉచితంగా దొరికేది. రవాణా ఛార్జీలు మూడు యూనిట్లకు రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఖర్చయ్యేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నూతన విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఇసుక దొరకక ఇబ్బందులు పడ్డాం. కొంతకాలం నిర్మాణం నిలిచిపోయింది. తర్వాత రెట్టింపు ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో నిర్మాణ వ్యయం పెరిగింది

- కొల్లాటి కనక సుబ్బారావు, ముత్యాలపల్లి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని