logo

జగన్‌ జమానాలో దగా పడ్డ కౌలురైతు

విపత్తులకు పంట దెబ్బతిన్నా అందని పరిహారంః ప్రతి రైతుకూ చెబుతున్నా. అధికారంలోకి రాగానే గుర్తింపు కార్డులు ఇస్తాం. వడ్డీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా చేస్తాం. వారికి అన్ని రకాలుగా తోడుంటాం.

Updated : 02 May 2024 05:30 IST

అయిదేళ్లుగా  కన్నీటి సాగు

కార్డులు లేవు..రుణాలు రావు

విపత్తులకు పంట దెబ్బతిన్నా అందని పరిహారంః ప్రతి రైతుకూ చెబుతున్నా. అధికారంలోకి రాగానే గుర్తింపు కార్డులు ఇస్తాం. వడ్డీ లేకుండా బ్యాంకు రుణాలు వచ్చేలా చేస్తాం. వారికి అన్ని రకాలుగా తోడుంటాం.

-2018లో ప్రజాసంకల్పయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీ ఇది.


పాడి పంటలకు నిలయమైన పశ్చిమ గోదావరి జిల్లాలో తరచూ తుపాన్లు, వరదలతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. ముఖ్యంగా సాగు చేస్తున్న కౌలు రైతులు అప్పుల పాలవుతున్నారు. మన ప్రభుత్వం రాగానే కౌలు రైతులను  అన్ని విధాలుగా ఆదుకుంటాం. వడ్డీ లేని రుణాలతో పాటు పంట నష్ట పరిహారాన్ని నేరుగా వారికే అందిస్తాం

 -మరో సందర్భంలో జిల్లా పర్యటనలో నాడు ప్రతిపక్షనేతగా జగన్‌ హామీ


ఇవన్నీ ఉత్తమాటలే అన్నది ఇప్పుడు ప్రతి రైతుకూ అర్థమైంది. కష్టాల సాగు చేస్తున్న కౌలురైతు బాధను విని పట్టించుకొనే నాథుడే లేడు.

పాలకోడేరు, భీమవరం టూటౌన్‌, వీరవాసరం, న్యూస్‌టుడే: కౌలు రైతులకు వైకాపా ప్రభుత్వంలో కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి. కొత్త చట్టాన్ని తెచ్చామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గొప్పలు చెబుతున్నా పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1.45 లక్షల మంది కౌలు రైతులుండగా గత సార్వా సీజన్‌లో 90 వేల మందికి మాత్రమే సాగుదారు హక్కు పత్రాలు జారీ చేశారు. వీటిలో వాస్తవ కౌలురైతులకు అందినవి 50వేలు మించవని సంఘ నాయకులు చెబుతున్నారు. అంటే జిల్లాలో సుమారు మరో 90వేల మందికి సాగుదారు హక్కుపత్రాలు అందడం లేదు.

పెనుగొండలో ఆందోళన (పాత చిత్రం)

రుణాల్లోనూ మతలబే

జిల్లాలో అధికార లెక్కలు ప్రకారం ఈ ఏడాది 90,053 మంది కౌలు రైతులకు సాగుదారు హక్కుపత్రాలు జారీచేశారు. బ్యాంకుల నుంచి పంట రుణాల విషయానికి వస్తే రూ.354 కోట్లు ఇచ్చినట్లు చూపుతున్నారు. వాస్తవంగా ఒక్కొక్కరికి కనీసం రూ.లక్ష చొప్పున రుణం మంజూరు చేసినా రూ.900 కోట్లు దాటుతుంది. అంటే ప్రస్తుతం సాగుదారు హక్కుపత్రాలు జారీచేసినవారిలో సగం మందికి కూడా రుణం అందలేదని స్పష్టమవుతోంది. వైకాపా అధికారం చేపట్టిన అనంతరం వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కూడా కౌలు రైతులకు పంట రుణాలు ఇస్తామని అధికారులు తెలిపారు. కాని జిల్లాలో ఒక ఏడాది మాత్రమే నాలుగైదు మండలాల పరిధిలో మాత్రమే పరిమిత సంఖ్యలో రుణాలు అందించారు. సకాలంలో తిరిగి చెల్లించడం లేదనే నెపంతో సుమారు ఏడాది నుంచి వీటికి మంగళం పాడేశారు.

భూయజమానుల నిరాకరణతో...

2019లో వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో కౌలు రైతులకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. సాగుదారు హక్కు పత్రం జారీ చేయాలంటే తప్పనిసరిగా భూయజమాని అంగీకారం, సంతకం ఉండాలి. ఈ విషయంలో భూయజమానుల్లో పలు అనుమానాలు, సందేహాలు ఉండటంతో సంతకం చేసేందుకు చాలా మంది నిరాకరిస్తున్నారు. ఆచంట, పెనుగొండ, అత్తిలి, ఇరగవరం, తణుకు, నరసాపురం వంటి మండలాల్లో ఎక్కువగా భూయజమానులు నుంచి నిరాకరణ ఎదురవడంతో కౌలురైతులకు సాగుహక్కు పత్రాలు అందని పరిస్థితి ఉంది.  

వడ్డీ రాయితీ లేదు.. రైతు భరోసా రాదు

గతంలో సాగు అవసరాలకు బంగారం తాకట్టుపై 7 శాతం వడ్డీకి బ్యాంకులు పంట రుణాలు అందించేవి. ఏడాదిలోగా చెల్లిస్తే కేంద్రం వడ్డీ రాయితీగా 3 శాతం మినహాయింపు ఉండేది. మూడేళ్లుగా వడ్డీ రాయితీని ఎత్తేశారు. మరో పక్క వడ్డీని పెంచి 8   నుంచి 9 శాతం వరకు వసూలు చేస్తున్నారు. భూహక్కు పత్రాలు పొందిన కౌలు రైతుల్లో  20 శాతం మందికి మాత్రమే రైతు భరోసా, పీఎం కిసాన్‌ సాయం అందుతుంది. చాలా మంది భూయజమానులు రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకాలు పొందుతున్నారు. వీరి భూములను ముగ్గురు లేదా నలుగురు కౌలు రైతులు సాగు చేస్తే  ఒకరికి మాత్రమే పథకం వర్తిస్తోంది.గడిచిన అయిదేళ్లలో తుపాన్లు, భారీ వర్షాలు, వరదలతో  పంట నష్టం వాటిల్లడంతో కౌలు రైతులు అప్పులుపాలయ్యారు. గడిచిన సార్వా సీజన్‌లో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నా పరిహారం అందలేదు.

12 ఎకరాలు పోయినా పరిహారం రాలేదు

కౌలుకు తీసుకుని 12 ఎకరాల్లో గత సార్వాలో వరి సాగు చేశా. వారం రోజుల్లో మాసూలు చేద్దామని ఏర్పాట్లు చేస్తుండగా తుపానుతో మొత్తం పంట నేలకొరిగిపోయింది. మూడు అడుగుల మేర నీరు నిలిచి పంట కుళ్లిపోవడంతో పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు. అంతకు ముందు ఏడాదీ భారీ వర్షాలతో ముంపు బారిన పడి నష్టపోయాం.
- కె. సుందరరావు, కౌలురైతు, శృంగవృక్షం


రుణాలు ఇప్పించడంలో విఫలం

కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇప్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పలు బ్యాంకులు కౌలు రైతులను గుమ్మం కూడా తొక్కనివ్వలేదు. ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, నరసాపురం మండలాల్లో బ్యాంకుల వద్ద రైతుల తరపున ధర్నాలు సైతం నిర్వహించాం. రైతు భరోసా కేంద్రాల వద్ద ఆందోళనలు చేసినా జిల్లా అధికార యంత్రాంగం స్పందించలేదు. కొత్త చట్టంతో అర్హులైన కౌలురైతులు కూడా సాగు హక్కు పత్రాలను పొందలేకపోయారు.
-ఎం.రామాంజనేయులు, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని