logo

వాటా ఇవ్వరు..జమ చేయరు!

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చి.... అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచిపోయారు.

Published : 04 May 2024 04:06 IST

ఉద్యోగులతో ఆటలాడుతున్న ప్రభుత్వం
తమ సొమ్మును దారి మళ్లిస్తోందంటూ మండిపాటు

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చి.... అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచిపోయారు. సీపీఎస్‌ రద్దు దేవుడెరుగు... కనీసం సీపీఎస్‌ ఉద్యోగుల జీతాల్లో నుంచి మినహాయిస్తున్న మొత్తాన్ని సకాలంలో జమ చేయడం లేదు. నెలల తరబడి జాప్యం చేస్తుండటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఈనాడు డిజిటల్‌, భీమవరం; న్యూస్‌టుడే, ఏలూరు విద్య, నరసాపురం

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సీపీఎస్‌) ఉద్యోగులను వైకాపా ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల హామీని అమలు చేయాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు అయిదేళ్లుగా పోరాడుతున్నా ఫలితం మాత్రం దక్కలేదు. మరోవైపు తమ జీతాల నుంచి మినహాయించిన డబ్బునూ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తన వాటాను ఏ నెలకానెల వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోందని ఉద్యోగులు వాపోతున్నారు.

పది శాతం మినహాయిస్తూ...

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సచివాలయ సిబ్బందితో కలిపి మొత్తం 11 వేల మంది సీపీఎస్‌ ఉద్యోగులున్నారు. వీరి వేతనంలో ప్రభుత్వం ప్రతినెలా 10 శాతం సీపీఎస్‌ను మినహాయిస్తోంది. దీనికి తన వాటాగా మరో 10 శాతం కలిపి ఆ మొత్తాన్ని ఉద్యోగుల ప్రాన్‌(శాశ్వత పదవీ విరమణ) ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఇక్కడే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. అలా జమ చేసిన మొత్తాన్ని స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి... అప్పటి మార్కెట్‌ విలువ ఆధారంగా ఉద్యోగ విరమణ సమయంలో వారు దాచుకున్న మొత్తంలో 60 శాతం అందజేస్తారు. మిగతా 40 శాతంతో ప్రైవేటు పెన్షన్‌ స్కీంలో తప్పకుండా భాగస్వాములు కావాల్సి ఉంటుంది. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన సమయంలో నష్టమొస్తే ఆ భారం ఉద్యోగులపైనే పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. సీపీఎస్‌లో సర్వీస్‌ మొత్తంలో మూడుసార్లు మాత్రమే 25 శాతం చొప్పున రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ కారణంగానే మొత్తంగా సీపీఎస్‌ వద్దని పాత పింఛను విధానం అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

జీపీఎస్‌ కూడా సీపీఎస్‌లానే ఉంది

పాత పెన్షన్‌ విధానంలో రుణాలు తీసుకోవడం ఉద్యోగి ఇష్టం. సీపీఎస్‌లో రుణాలు తీసుకోవడానికి అనేక షరతులున్నాయి. ఉద్యోగి వాటా ఆ సమయంలో ఎంత ఉందో దానిలో 25 శాతమే రుణాలు తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. జీపీఎస్‌లోనూ సీపీఎస్‌లానే నిబంధనలున్నాయి.

చింతపల్లి కృష్ణమోహన్‌, యూటీఎఫ్‌ మండలాధ్యక్షుడు


సమయానికి చెల్లించాలి...

చాలామందికి ప్రొబెషన్‌ అయ్యాక కూడా ప్రాన్‌ ఖాతా ప్రారంభంలో జాప్యం జరిగింది. ఉద్యోగులకు నష్టం కలగకుండా ప్రభుత్వ వాటా సమయానికి చెల్లించాలి. కేంద్రం ఇటీవల ప్రభుత్వ వాటా 14శాతం పెంచగా... అది ఏమేరకు అమలవుతుందో చూడాలి.

కోసూరి గోపాలకృష్ణంరాజు, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని