logo

జగన్‌ సిద్ధం.. జనానికి నరకం

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి శుక్రవారం నరసాపురంలో నిర్వహించిన సిద్ధం సభ.. జనానికి నరకం చూపింది.

Published : 04 May 2024 04:15 IST

ఎండలో అల్లాడిన మహిళలు, వృద్ధులు
పట్టణంలో ట్రాఫిక్‌ ఇక్కట్లు.. పలు దుకాణాల మూసివేత

ఎండలో దుకాణాల ముందు మహిళల ఇక్కట్లు

ఈనాడు, భీమవరం: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి శుక్రవారం నరసాపురంలో నిర్వహించిన సిద్ధం సభ.. జనానికి నరకం చూపింది. ఉదయం 10 గంటలకు రావాల్సిన జగన్‌ 2 గంటలకు పైగా ఆలస్యంగా రావడంతో ఎండలో మహిళలు, వృద్ధులు అవస్థలు పడ్డారు. ఆటోలు పెట్టి మనిషికి రూ.200 ఇచ్చి తరలించినా జగన్‌ రాకముందే సగం మంది, ప్రసంగం ముగియక ముందే మూడొంతులు వెళ్లిపోయారు.

బస్సులు లేక  వెలవెలబోతున్న  బస్టాండు

అంతా ఇష్టారాజ్యంగా.. సభ ఏర్పాట్ల విషయంలో నిర్వాహకులు అడ్డగోలుగా వ్యవహరించారు. జగన్‌ ప్రచార వాహనం నిలిపే ప్రాంతంలో ఉన్న డివైడర్‌ను సుమారు 10 మీటర్ల మేర  అడ్డగోలుగా కొట్టేశారు. డివైడర్‌పై ఉన్న విద్యుత్తు స్తంభాన్ని శుక్రవారం తెల్లవారుజామున గుట్టుగా తొలగించారు. సభా ప్రాంగణం పక్కన ఉన్న డ్రెయిన్‌ను ధ్వంసం చేశారు. ఉదయం 7 గంటల నుంచే సభ జరిగే మార్గంలో దుకాణాలను బలవంతంగా మూయించారు. బారికేడ్లు పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు.  నియమావళి ఉన్నా పట్టణంలో సిద్ధం పేరుతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

నరసాపురంలో ట్రాఫిక్‌ ఇక్కట్లు

మండుటెండలో ఉక్కిరిబిక్కిరి

ఉదయం 8 గంటల నుంచే జనాన్ని తరలించారు. పది గంటల్లోపు సభా ప్రాంగణానికి రావాల్సిన జగన్‌ 2.15 గంటలు ఆలస్యంగా రావడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎండ మండిపోవడంతో నిలబడలేక వందలాది మంది వెనుదిరిగారు. సభ అయ్యే వరకూ తీసుకొచ్చిన ఆటోలు కదలవని నిర్వాహకులు చెప్పడంతో పట్టణంలోని దుకాణాల నీడలో తలదాచుకున్నారు. బందోబస్తు విధులకు వచ్చిన పోలీసులు వైకాపా కార్యకర్తల్లా మారి వచ్చిన వారికి మజ్జిగ, మంచి నీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. సభ కారణంగా నరసాపురం బస్టాండ్‌ సమీపంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచింది. దీంతో సాధారణ ప్రయాణికులు, వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. పూర్తిస్థాయిలో బస్సులు లేక ప్రయాణికులు బస్టాండ్‌లోనే గంటల తరబడి నిరీక్షించారు.

రోడ్డుకు అడ్డుగా బారికేడ్లు పెట్టడంతో రాకపోకలకు ఇబ్బందులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని