logo

మీ గెండెల్లో ధైర్యం నింపడానికి వచ్చా

కొల్లేరు సమస్య పరిష్కారానికి కేంద్ర సాయంతో కృషి చేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు. శుక్రవారం కైకలూరులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. 

Published : 04 May 2024 04:22 IST

ఎమ్మెల్యే దిగొచ్చాడా..  బెదిరిస్తే భయపడొద్దు
కైకలూరు సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌
కొల్లేరు సమస్య పరిష్కారానికి హామీ
మండవల్లి, కైకలూరు, న్యూస్‌టుడే

కొల్లేరు సమస్య పరిష్కారానికి కేంద్ర సాయంతో కృషి చేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు. శుక్రవారం కైకలూరులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.  కొల్లేరు కాంటూరు సమస్య చాలా సున్నితమైందని పరిష్కారానికి కేంద్ర సహకారం కావాలన్నారు. ‘అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఒక్కసారైనా కొల్లేరు వైపు వచ్చి చూశారా? మాట్లాడారా? పర్యాటక ప్రగతిని ముందుకు తీసుకెళ్లలేదు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే దీనిపై చాలా ఆదాయం వస్తుంది. స్థానిక యువత ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కానీ వాటితో మంత్రికి పని లేదు. ఎర్రచందనం కొట్టుకుంటూ బిజీగా ఉన్నప్పుడు కొల్లేరు కోసం ఆలోచించే సమయం వాళ్లకు ఎక్కడ ఉంటుంది?’ అంటూ పవన్‌ ప్రశ్నించారు. కొల్లేరు పూర్వవైభవానికి రెగ్యులేటర్‌ను నిర్మించేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ‘జనసేన పోటీలో లేని చోట స్వతంత్ర అభ్యర్థికి గాజుగ్లాసు గుర్తు కేటాయించేలా జగన్‌ కుట్ర చేశారు. జాగ్రత్తగా ఓటు వేయాలి’ అని సూచించారు. అసెంబ్లీ అభ్యర్థి కామినేని మృధు స్వభావి అని.. మాట ఇస్తే నిలబడతారని తెలిపారు.

కైకలూరు వాళ్ల సొంతమా..

‘స్థానిక ఎమ్మెల్యే, ఆయన కొడుకుకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.  ఎమ్మెల్యే ఏమైనా దిగొచ్చాడా? ఆయన కొడుకు దిగొచ్చాడా?  కైకలూరు వాళ్ల సొంతమా?  ఏపీ జగన్‌ సొంతమా? భయం వీడండి.  మీ గుండెల్లో ధైర్యం నింపడానికే నేనొచ్చా’ అంటూ  కైకలూరు గడ్డపై పవన్‌ గర్జించారు. ‘ప్రజలకు ఇబ్బంది కలిగించే వైకాపా ఎమ్మెల్యే ఎవరైనా సరే.. అవినీతి కోటలు బద్దలు కొడతాం’ అని ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే కొడుకు  బెదిరించి 50 ఎకరాల చేపల చెరువులు తీసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. రౌడీమూకలను వేసుకుని తిరుగుతున్నంత మాత్రాన బెదరాల్సిన అవసరం లేదన్నారు.

అభివృద్ధి కేంద్రంగా కైకలూరు

‘కైకలూరును స్మార్టు మున్సిపాలిటీగా మార్చుతాం’ అని పవన్‌ హామీ ఇచ్చారు. కలిదిండి మండలంలో అగ్నిమాపక కేంద్రం, ముదినేపల్లి మండలంలో ధాన్యం నిల్వ గోదాములు, డిగ్రీ కళాశాల, కైకలూరులో ఈఎస్‌ఐ ఆసుపత్రి, పార్కు, డయాలసిస్‌ కేంద్రంతోపాటు 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు.

ఆక్వా రంగాన్ని ఆదుకుంటాం

ఆక్వా రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన అనంతరం ఆక్వా రైతులకు రూ.1.50 విద్యుత్తు, రాయితీలు, రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వంతెనలు నిర్మిస్తాం

పేరూరులో పోల్‌రాజ్‌ కెనాల్‌పై చిన్నపాటి వంతెన కూలి మూడేళ్లయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వంతెనల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఏలూరు గ్రామీణం, కైకలూరును కలిపే వంతెన నిర్మాణానికి కేంద్ర సహకారంతో నిధులు సాధిస్తాం’ అని పవన్‌ ప్రకటించారు. కలిదిండి, పడమటిపాలెం, పరసావానిపాలెం, ఎస్‌ఆర్పీఅగ్రహారం, వెంకటాపురం గ్రామాల్లో ఆకుకూరలు పండించే రైతులకు రైతు బజార్‌ను ఏర్పాటు చేసి అండగా ఉంటాం’ అని భరోసా ఇచ్చారు. ఈ సభలో కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కామినేని, పుట్టా మహేశ్‌ యాదవ్‌, జనసేన నేత, క్రికెటర్‌ అంబటి రాయుడు తదితరులు ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని