logo

‘నిషా’దం వెనుక జగన్‌

మద్యపానం నిషేధం విషయంలో జగన్‌ తీరు చూసి జనాలు ‘చెప్పేది శ్రీరంగనీతులు’.. అనే సామెత గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు మద్యాన్నే లేకుండా చేస్తానని నటనా చాతుర్యాన్ని ప్రదర్శించిన జగన్‌.. పీఠం ఎక్కాక మాట మార్చి..

Updated : 05 May 2024 06:21 IST

ప్రజల ప్రాణాలతో వైకాపా సర్కారు చెలగాటం
ఆదాయం పెంచుకోవడమేపరమావధి
పేదల కుటుంబాల్లో మద్యం కల్లోలం
ఉమ్మడి జిల్లాలో మత్తులో దారుణాలు
ఈనాడు, భీమవరం, ఆచంట, ఏలూరు టూటౌన్‌, టి.నరసాపురం, న్యూస్‌టుడే

‘మందు దుకాణం లేని గ్రామం ఉందా అని అడుగుతున్నా.. ఫోన్‌ కొడితే ఇంటికి నీటి డబ్బా తీసుకు వస్తారో లేదో కాని మందు సీసా మాత్రం తీసుకొచ్చే పరిస్థితి ఉంది. మన ప్రభుత్వం వచ్చాక మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం’

2018 జూన్‌ 15న ప్రతిపక్షనేతగా జగన్‌ చెప్పిన మాటలివి.


మద్యపానం నిషేధం విషయంలో జగన్‌ తీరు చూసి జనాలు ‘చెప్పేది శ్రీరంగనీతులు’.. అనే సామెత గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు మద్యాన్నే లేకుండా చేస్తానని నటనా చాతుర్యాన్ని ప్రదర్శించిన జగన్‌.. పీఠం ఎక్కాక మాట మార్చి.. మద్యాన్ని ఏరులై పారించి ఆడబిడ్డల పుస్తెలు తెంచేస్తున్నారు. నాసిరకం మందు తాగించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేస్తున్నారు. వైకాపా నాయకులతో విచ్చలవిడిగా బెల్టు షాపులు పెట్టించి రేయింబవళ్లు మద్యం అమ్మకాలు చేయిస్తున్నారు. మందుబాబులు మత్తులో చేసే దారుణాలతో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి.


మద్యం చేస్తున్న మారణ హోమం

జీలుగుమిల్లిలో మద్యానికి డబ్బులు ఇవ్వటం లేదని ఓ యువకుడు తల్లి, చెల్లిపై దాడి చేశాడు. గతేడాది అర్ధరాత్రి ఏలూరులో ఓ బార్‌లో మద్యం తాగిన ఇద్దరు స్నేహితులు గొడవపడి ఓ వ్యక్తి మరొకరిపై మద్యం సీసాతో దాడి చేసి హత్య చేశాడు. ఏలూరు అమీనాపేటలో ఇద్దరు స్నేహితులు మద్యం మత్తులో గొడవపడి. ఒకరు మరొకరిని కర్రతో తల పై కొట్టి చంపాడు. పెంటపాడు మండలం ఆకుతీగ పాడుకు చెందిన అన్నదమ్ములకు వివాదం తలెత్తి అన్న..తమ్ముడిని చాకుతో పొడిచి చంపాడు. మద్యం మత్తులో వాహన ప్రమాదాలకు కారణమై మృతి చెందిన ఘటనలు తరచూ జరుగుతున్నాయి.


ప్రాణాలు తోడేస్తావా

మద్యం తాగి అనారోగ్యంపాలై ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాసిరకం మద్యం తాగి మందుబాబులు జీర్ణకోశ వ్యాధులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా ఆసుపత్రి పాలైన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఏలూరు ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య నెలకు 40కి చేరింది. గతంతో పోల్చితే మూడింతలు పెరిగింది. ప్రస్తుతం ఒక జీర్ణకోశ సంబంధ ప్రైవేటు ఆసుపత్రిలో ఓపీ 700కు ఉంటే అందులో 300 మంది వరకు మద్యంతో అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తున్నారు. వీరంతా నాసిరకం మద్యం తాగటమే కారణమని వైద్యులు చెబుతున్నారు.


గుట్టుగా.. గొలుసు కట్టుగా

కొవ్వలిలో పాఠశాల ఎదురుగా ఉన్న దుకాణంలో  మద్యం విక్రయాలు

దుకాణాల్లో మద్యాన్ని సిబ్బందే గుట్టుగా తరలించి వేరే వ్యక్తుల ద్వారా విక్రయాలు చేస్తున్నారు. వారంతా వైకాపా నాయకుల అనుచరులే కావటంతో అధికారులు పట్టించుకోవటం లేదు. రెండేళ్ల క్రితం ఏలూరులోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి సిబ్బంది భారీగా మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బెల్టు దుకాణాలు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. కిళ్లీ, చిల్లర దుకాణాలు, పాల డెయిరీలు, బడ్డీ కొట్లు ఇలా అన్ని చోట్ల మద్యం వైకాపా నాయకుల అనుచరుల ద్వారానే అమ్మకాలు జరుగుతున్నాయి. దెందులూరు మండలం కొవ్వలిలో పాఠశాల ముందు, ఆలయం పక్కన, సచివాలయానికి ఆనుకుని చిన్న దుకాణాల్లో రేయింబవళ్లు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.


ఇల్లు ఒల్లు గుల్ల

ఉమ్మడి పశ్చిమలో ప్రభుత్వ మద్యం దుకాణాలు 334
ప్రస్తుతం రోజుకు జీర్ణకోశ వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య 700
వారిలో మద్యపానంతో ఆసుపత్రిపాలవుతున్న వారు 300  


అనాథలయ్యాం

‘నా భర్త కోరుకొండ వెంకన్నబాబు ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేసేవారు. మద్యానికి బానిసయ్యారు. అనారోగ్య సమస్యలు తలెత్తి రెండేళ్ల కిందట ప్రాణాలు కోల్పోయారు.  వైద్య నిమిత్తం ఎంతో సొమ్ము ఖర్చు చేశాం.  కుటుంబానికి ఆధారం లేక, నేను ఇద్దరు పిల్లలు అనాథలమయ్యాం’ అని బొర్రంపాలేనికి చెందిన నాగేశ్వరమ్మ వాపోయింది.


పెద్ద దిక్కు కోల్పోయాం

‘మాది చిన్నపాటి రైతు కుటుంబం. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడికి వివాహాలు చేశాం. సాఫీగా సాగే మాకుటుంబంలో మూడేళ్ల క్రితం భార్య, ఇద్దరు పిల్లలతో ఉన్న నా కుమారుడు అకస్మాత్తుగా మృతి చెందాడు. ఆ తర్వాత నా భర్త మద్యానికి బానిసయ్యారు. కాలేయం, కిడ్నీలు దెబ్బతిన్నాయి. వైద్యం నిమిత్తం రూ.లక్షలు వెచ్చించినా బతకలేదు’ అని వెలగపాడుకు చెందిన నరదల పుష్పరాజ్యం ఆవేదన వ్యక్తం చేశారు.


వ్యసనమే ప్రాణాలు తీసింది

‘నేను, నా భర్త కూలిపనులు చేస్తూ ఇద్దరు పిల్లల్ని పెంచి వారికి పెళ్లిళ్లు కూడా చేశాం. నా భర్త సిద్ధియ్యను తాగొద్దని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఆయన సంపాదించినదంతా తాగుడుకే సరిపోయేది. చివరికి అనారోగ్యంతో మృతి చెందారు’ అని వెలగపాడుకు చెందిన పేరుబోయిన గంగమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని