logo

వైకాపా అరాచకాలకు ముగింపు పలుకుదాం

‘వైకాపా అసమర్థతతో చింతలపూడి ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేసి నాగార్జున సాగర్‌ నీరు తీసుకొచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా.

Published : 05 May 2024 06:19 IST

మెట్టను సస్యశ్యామలం చేస్తా
చింతలపూడి పూర్తి చేయడం నా కల
మల్లవల్లి  పారిశ్రామిక పార్కును పునరుద్ధరిస్తాం
నూజివీడుకు అవుటర్‌ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం
ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు

వైకాపా పాలనలో భివృద్ధి జరిగిందా.. నిరుద్యోగ సమస్య తొలగిందా.. రైతులకు గిట్టుబాటు ధర అందిందా.. నిత్యావసరాల ధరలు  అందుబాటులో ఉన్నాయా

అంటూ ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు... లేదంటూ ప్రజలు చెప్పిన సమాధానానికి నూజివీడు దద్దరిల్లింది. అయిదేళ్ల వైకాపా అరాచకాలకు ముగింపు పలికి ఓడించాలంటూ తెదేపా అధినేత పిలుపునిచ్చారు.

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే నూజివీడు రూరల్‌, పట్టణం, ముసునూరు: ‘వైకాపా అసమర్థతతో చింతలపూడి ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేసి నాగార్జున సాగర్‌ నీరు తీసుకొచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా. మామిడికి, మొక్కజొన్న సాగుకు నీరు ఇస్తా. కమీషన్లు దండుకునేందుకు వైకాపా నాయకులు మల్లవల్లికి పారిశ్రామిక పార్కును పాడుపెట్టారు. తెదేపా అధికారంలోకి రాగానే పారిశ్రామిక ప్రగతిని పట్టాలెక్కిస్తా’ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అమరావతిలో  నూజివీడును భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. శనివారం నూజివీడు ప్రజాగళం సభలో  జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
ఎమ్మెల్యే వల్ల ఒరిగిందేంటి.. ‘ఇక్కడ ఎమ్మెల్యే మూడుసార్లు గెలిచినా ఒక అభివృద్ధి పని చేసినట్లు మీకు గుర్తుందా. ఆయనకు తోడు కొడుకు తయారయ్యాడు తెదేపా కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడుతున్నారు. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాది. ఇసుక, మట్టి, గ్రావెల్‌ తరలించి సొమ్ము చేసుకున్నారు. చిన్న పనికి కూడా కమీషన్లు దండుకుంటున్నారు. ఆగిరిపల్లి మండలంలో క్వారీల్లో అక్రమాలు చేశారు. ముసునూరు మండలంలోని ఇసుక  దోపిడీ చేసి రూ.కోట్లు దోచేశారు’ అంటూ చంద్రబాబు ఆరోపించారు.


అధినేతకు అపూర్వ స్వాగతం

తెదేపా అధినేత సాయంత్రం 4.30 గంటలకు నూజివీడు రోటరీ క్లబ్‌ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకొని..నూజివీడు గాంధీబొమ్మ కూడలికి ర్యాలీగా వచ్చారు. దారి పొడవునా అధినేతకు తెదేపా, జనసేన, భాజపా నాయకులు స్వాగతం పలికారు. భారీగా చేరుకున్న ప్రజలు జై చంద్రబాబు అంటూ నినదించారు. మహిళలు హారతులు పట్టారు. ఆయన సభా ప్రాంగణానికి చేరుకునే సమయానికి ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. దాదాపు 40 నిమిషాలు ఆయన ప్రసంగించారు. ఆయన కంటే ముందు నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్‌కుమార్‌ ప్రసంగించారు.  తెదేపా నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


నూజివీడును కృష్ణా జిల్లాలో కలుపుతాం

మాట్లాడుతున్న చంద్రబాబు, పక్కన మహేశ్‌ యాదవ్‌, పార్థసారథి

‘నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలన్న మీ కలను నెరవేరుస్తా. ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారంగా అవుటర్‌ రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేస్తాం.  గ్రామాల్లో డ్రెయిన్లు సమస్య పరిష్కరిస్తా. మల్లవల్లికి పరిశ్రమలు నేను తెచ్చా మీకు జ్ఞాపకం ఉందా తమ్ముళ్లు. నేనుంటే ఎన్ని పరిశ్రమలు ఇక్కడకు వచ్చేవి. ఎంత మంది యువతకు ఉపాధి లభించేది.. తన అవినీతి కోసం జగన్‌ రెడ్డి పెట్టుబడుదారులను తరిమేశారు.  మీరంతా ఓటు వేసి ఎమ్మెల్యేగా పార్థసారథిని, ఎంపీˆగా మహేశ్‌యాదవ్‌ను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని అయి ఉంటే నూజివీడు నుంచి నేరుగా వెళ్లి ఉద్యోగం చేసి ఇంటికి వచ్చేవారు. అవుటర్‌ రింగ్‌ రోడ్‌ హనుమాన్‌జంక్షన్‌ వరకు ఉండేది. నేను వస్తూనే అమరావతికి పూర్వ వైభవం తీసుకుని వస్తా. నూజివీడు బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది అమరావతిలో ఒక భాగంగా ఉంటుంది. స్థానిక నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు సముచిత స్థానం కల్పిస్తాను’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

సభకు హాజరైన జనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని