logo

రంగులు మారలే... ప్రలోభాలు తగ్గలే!

నరసాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు పట్టణంలోని ఎండీయూ ఆపరేటర్‌. ఆయన నిత్యం ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉంటారు. ఎన్నికల ప్రచారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Published : 06 May 2024 05:21 IST

వాహనాలపై జగన్‌ ఫొటో, నవరత్నాల లోగో
వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు ఎండీయూ ఆపరేటర్లు

ఎండీయూ వాహనం ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఓ ఆపరేటర్‌

నరసాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు పట్టణంలోని ఎండీయూ ఆపరేటర్‌. ఆయన నిత్యం ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉంటారు. ఎన్నికల ప్రచారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎండీయూ ఆపరేటర్‌గా ఆయన ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు.

నరసాపురం మండలానికే చెందిన మరో వైకాపా నాయకుడు ఓ గ్రామంలో ఎండీయూ ఆపరేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సైతం క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఆయన సైతం ప్రజలకు నిత్యావసర సరకులు పంపిణీ చేస్తుండటంతో... ఓటర్లను మభ్యపెట్టే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నరసాపురం (తూర్పుతాళ్లు), న్యూస్‌టుడే: వైకాపా అధికారంలోకి వచ్చాక... ఇంటింటి వద్దకే రేషన్‌ అంటూ ఎండీయూ వాహన వ్యవస్థను తీసుకొచ్చింది. ఇంటికే నిత్యావసర సరకులొస్తే... అంతకంటే కావాల్సింది ఏముంటుందని ప్రజలూ సంబరపడ్డారు. వైకాపా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన వారినే  వాహనాల నిర్వాహకులుగా నియమించారు.  వీరు ఇంటి వద్దే లబ్ధిదారులకు సరకులు అందించాల్సి ఉండగా... వీధి చివరనో... గ్రామ కూడలిలోనో వాహనాలు నిలిపి.. ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసేవారు. పశ్చిమగోదావరి జిల్లాలో 5.62 లక్షల మంది రేషన్‌కార్డుదారులుండగా, 356 ఎండీయూ వాహనాలను వినియోగిస్తున్నారు.   ప్రస్తుతం ఒకటో తేదీ నుంచి కార్డుదారులకు సరకులు పంపిణీ చేస్తున్నారు. ఎండీయూ వాహనాల ఆపరేటర్లంతా అధికార పార్టీ విధేయులు కావడంతో... వారంతా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.

ప్రభావాన్ని అడ్డుకునేదెవరు?

ప్రస్తుతం ఎండీయూ ఆపరేటర్లకు ప్రభుత్వం ప్రతినెలా గౌరవ వేతనంతోపాటు వాహనాల అద్దె చెల్లిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 17 వరకూ ఎండీయూ ఆపరేటర్లు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. వీరిలో కొందరు రేషన్‌ తీసుకునే ప్రజలను ప్రభావితం చేసి... వైకాపాకు అనుకూలంగా ఓట్లు వేయించుకునేలా కుట్ర చేస్తున్నారని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు.

వాహనాలకూ వైకాపా రంగులే

నిత్యావసరాలు అందజేస్తున్న ఎండీయూ వాహనాలపైనా సీఎం జగన్‌ చిత్రంతోపాటు నవరత్నాల లోగో ఉంటోంది. దీనికితోడు వాహనానికి పార్టీ రంగులున్నాయని కూటమి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా... సీఎం చిత్రం, నవరత్నాల లోగో, పార్టీ రంగులు కనిపించకుండా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని