logo

అనుమానాస్పదస్థితిలో యువకుడు...

మండల పరిధి ఊటుకూరు సమీపంలో మైదుకూరు మండలం గంజిగుంట గ్రామానికి చెందిన యువకుడు చిన్ననూరు నాగరాజు (30) అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు బాధ్య ఎస్సై రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Published : 05 Feb 2023 02:22 IST

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే : మండల పరిధి ఊటుకూరు సమీపంలో మైదుకూరు మండలం గంజిగుంట గ్రామానికి చెందిన యువకుడు చిన్ననూరు నాగరాజు (30) అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు బాధ్య ఎస్సై రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. నాగరాజు టిప్పర్‌ డ్రైవర్‌గా పనిచేసేవారు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. శుక్రవారం టిప్పర్‌ను తీసుకొచ్చి ఊటుకూరు సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకులో పెట్టారు. సమీపంలోని ఖాళీ స్థలంలో శనివారం శవమై కనిపించారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఎస్సై రాజరాజేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. అతని వద్ద పురుగుల మందు కొనుగోలు చేసిన చీటి ఉందని, విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


అంబులెన్స్‌ బోల్తా ... మహిళ మృతి

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : అత్యవసర వైద్యం కోసం ఓ మహిళను కడపకు తీసుకొస్తుండగా అదుపుతప్పి అంబులెన్స్‌ బోల్తాపడింది. మహిళకు తీవ్రగాయాలై మృతిచెందారు. ఈ ఘటన కడప తాలూకా పరిధిలో శనివారం చోటుచేసుకుంది. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (59) అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను జమ్మలమడుగులోని క్యాంబెల్‌ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి సంబంధించిన అంబులెన్స్‌లో కడపకు తీసుకొస్తుండగా ఆలంఖాన్‌పల్లె సమీపంలోని దండు వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనం దారివ్వకపోవడంతో డ్రైవరు ఉన్నఫలంగా బ్రేకులు వేశారు. దీంతో అంబులెన్సు అదుపు తప్పి బోల్తా పడింది. తీవ్రంగ గాయపడిన లక్ష్మీదేవిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె భర్త సుబ్బరాయుడు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని