logo

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం

అపరిష్కృతంగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వంపై మహా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ నేతృత్వంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు

Published : 07 Feb 2023 05:34 IST

కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : అపరిష్కృతంగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వంపై మహా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ నేతృత్వంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడ తలపెడతామన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తుంటే పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ముఖ ఆధారిత హాజరు అడుగుతున్నారని, దీన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచి ఉచితంగా గ్యాస్‌ సరఫరా చేయాలని, సుప్రీంకోర్టు సూచన మేరకు సమాన పనికి సమాన వేతనంగా రూ.26 వేలు చెల్లించాలని డిమాండు చేశారు. విచారణ పేరుతో ఎంపీడీవోలు, మహిళా పోలీసులు, రాజకీయ నాయకులు వేధిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, అదే సమయంలో అంగన్‌వాడీలకు బడ్జెట్‌లో కోత విధిస్తే మనుగడ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీఏ, డీఏలు తక్షణమే చెల్లించాలని, ప్రతి కార్యకర్త, ఆయాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, సర్వీసులో ఉంటూ చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ఉద్యోగంతో పాటు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించారు. సీఐటీయూ నాయకులు మనోహర్‌, కామనూరు శ్రీనివాసులరెడ్డి, సుబ్బయ్య, రవి, ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం డివిజన్‌ కార్యదర్శి రఘునాథరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపి ఆందోళనలో బైఠాయించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సంఘ నాయకురాళ్లు లక్ష్మీదేవి, భాగ్య, సుభాషిణి, వసుంధర, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని