logo

ఆ రెండు పోస్టులకు పోటాపోటీ!

ప్రొద్దుటూరు జిల్లా కేంద్రానికి ఏ మాత్రం తీసిపోని పట్టణం. బంగారం, వస్త్ర వ్యాపారాలకు ప్రసిద్ధి. అన్ని విధాలా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు.

Updated : 30 Mar 2023 06:55 IST

ప్రొద్దుటూరు గ్రామీణ పోలీసుస్టేషన్‌లో ఖాళీలు
రాజకీయ నేతల ద్వారాముమ్మర ప్రయత్నాలు
గతంలో పనిచేసిన ఓ ఎస్‌.ఐ. తిరిగొచ్చేందుకు సన్నాహాలు

  ప్రొద్దుటూరు గ్రామీణ పోలీసుస్టేషన్‌

ఈనాడు డిజిటల్‌, కడప: ప్రొద్దుటూరు జిల్లా కేంద్రానికి ఏ మాత్రం తీసిపోని పట్టణం. బంగారం, వస్త్ర వ్యాపారాలకు ప్రసిద్ధి. అన్ని విధాలా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాతో పాటు పొరుగు జిల్లాల అధికారులు సైతం ఇక్కడ పనిచేసేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఏ పోస్టు ఖాళీగా ఉన్నా పోటీ పడి మరీ బదిలీపై ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న నాయకుల వద్దకు వెళ్లి ఉన్నతాధికారులకు సిఫార్సు చేయించుంటున్నారు. తాజాగా ప్రొద్దుటూరు గ్రామీణ పోలీసుస్టేషన్‌ సీఐ, ఎస్‌.ఐ. పోస్టులకు జిల్లాలోని పలువురు అధికారులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాజకీయ నాయకుల జోక్యంతో ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా సీఐ, ఎస్‌.ఐ. పోస్టింగ్‌ల వ్యవహారం చర్చనీయాంశమైంది.


గతం ప్రశాంతం.. ప్రస్తుతం వివాదం

గతంలో ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా గత కొన్నేళ్లుగా వివాదాలకు అడ్డాగా మారిపోయింది. దీంతో ఇక్కడి పోలీసు అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు సీఐలు, ఎస్‌.ఐ.లు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ బదిలీ వేటుకు గురయ్యారు. మరికొందరు అధికారులను వీఆర్‌కు పంపుతూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల కర్ణాటక నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న డీజిల్‌ వ్యహారంపై చర్యలు తీసుకోలేదన్న వ్యవహారంలో సీఐ మధుసూదన్‌ గౌడ్‌, ఏఎస్‌ఐ బాషాలను ఎస్పీ అన్బురాజన్‌ వీఆర్‌కు పంపుతూ ఉత్తుర్వులు జారీ చేశారు. తాజాగా మంగళవారం అదే ఠాణాకు చెందిన ఎస్‌.ఐ. సంజీవరెడ్డి బదిలీ కావడం చర్చనీయాంశమైంది. దీంతో గ్రామీణ ఠాణాలో సీఐ, ఎస్‌.ఐ. కుర్చీలు ఖాళీ అయ్యాయి. వాటి కోసం జిల్లాలోని పలువురు అధికారులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ నాయకుల ద్వారా ఉన్నతాధికారులతో మంతనాలు జరిపినట్లు సమాచారం.  


ఆరోపణలతో వెళ్లి...  మళ్లీ వచ్చేందుకు ప్రయత్నం

గ్రామీణ ఠాణా సీఐ పీఠం ఎక్కేందుకు కడపకు చెందిన ఇద్దరు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికి ఆ సీటు వరిస్తుందో వేచి చూడాలి. ఎస్‌.ఐ. స్థానంలో జిల్లాలో పనిచేసే అధికారి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో అదే ఠాణాలో పనిచేసి అసాంఘిక కార్యకలాపాలు, మద్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ బదిలీపై వెళ్లారు. మళ్లీ అదే అధికారి స్థానికంగా ఉన్న కొందరు నేతల ద్వారా ప్రొద్దుటూరు వచ్చేందుకు యత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ప్రొద్దుటూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఠాణా పరిధిలో జరుగుతున్న వ్యవహారాలన్నింటింకీ చెక్‌ పెట్టాలంటే ఆరోపణలు ఎదుర్కొంట్ను వారిని కాకుండా సమర్థంగా పనిచేసే సీఐ, ఎస్‌.ఐ.లను నియమిస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని