logo

జగన్‌ బటన్‌ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు

దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్‌ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా

Published : 26 Apr 2024 05:27 IST

మాయ మాటలతో యువత కష్టాల్లోకి
విద్యా, వసతి దీవెన సొమ్ము రాక విద్యార్థులకు అవస్థలు

న్యూస్‌టుడే, జమ్మలమడుగు గ్రామీణ: దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్‌ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఇతర వృతి పరమైన కోర్సుల్లోని విద్యార్థులకు కళాశాలల్లో చెల్లించే రుసుం మేరకు సొమ్ము అందించాలి. గత ప్రభుత్వం అమలు చేసిన ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను పక్కనెట్టి విద్య, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు నేరుగా నగదు అందజేస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం వారిని అవస్థల కూపంలోకి నెట్టేసింది. తెదేపా హయాంలో నేరుగా నగదు యాజమాన్యాలకు చేరేది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు దూరమయ్యేవి. విద్యార్థులు సైతం ఫీజుల విషయాన్ని పట్టించుకునేవారు కాదు. వసతి దీవెన కింద రుసుంతో పాటు మెస్‌ ఛార్జీలు, పుస్తకాల కొనుగోలు, ఇతర వాటి కోసం నగదు ఇవ్వాలి. ఐటీఐ వారికి రూ.10 వేలు, డిప్లొమా వారికి రూ.15 వేలు, డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులవారికి రూ.20 వేలు చెల్లించాలి. ఏడాదికి రెండుసార్లు ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. 2023-24 ఆర్థిక ఏడాదిలో ఒక్క రూపాయి కూడా రాలేదు. ఈ ఏడాది మార్చిలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ సైతం నొక్కారు.. కానీ నేటికీ నగదు రాలేదని విద్యార్థులు చెబుతున్నారు. వారి మాటల్లోనే..

ఇంకా జమ కాలేదు

నేను డిగ్రీ ఫస్టియర్‌. విద్య, వసతిదీవెన కింద నగదు జమ కాలేదు. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. మా తల్లిదండ్రులు రోజు వారి కూలీ పనులకు వెళ్లేవాళ్లు కావడంతో చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

టి.లక్ష్మీగాయత్రి, డిగ్రీ విద్యార్థిని.

నిరాశే మిగిలింది

మాది జమ్మలమడుగు మండల పరిధిలోని అంబవరం గ్రామం. మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాను. విద్యాదివెన కింద ఇప్పటికీ నగదు జమ కాలేదు. చేసేది లేక సొంతంగా చెల్లించి చదువు కొనసాగిస్తున్నాను.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి.   

సి.దాసు, డిగ్రీ విద్యార్థి

సొమ్ము అందక అవస్థలు

పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నా. ఉన్నత విద్య కోసం జగనన్న ప్రభుత్వం విద్యాదీవెన కింద ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో అవస్థలు పడ్డాం. అప్పులు చేసి కళాశాల ఫీజు కట్టాల్సిన  పరిస్థితి వచ్చింది. విద్యాదీవెన సొమ్ములు అందించి పేద విద్యార్థులను అదుకోవాలి.

పూజిత, డిగ్రీ విద్యార్థిని

ఈ ఏడాది అందనే లేదు

నేను ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాను. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వేయలేదు. తల్లిదండ్రులు కూలీ చేసి చదివిస్తున్నారు. ప్రభుత్వం ఏడాదిగా విద్యాదీవెన కింద చేసే డబ్బులు వేయకపోవడంతో నా చదువు తల్లిదండ్రులకు భారంగా మారింది.

కె.మునేశ్వరి, డిగ్రీ విద్యార్థిని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని