logo

జగన్‌ ఓ విధ్వంసకారి!

‘జగన్‌ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం.

Published : 26 Apr 2024 05:46 IST

వివేకానందరెడ్డి హత్యపై చెల్లెళ్లకు సమాధానం చెప్పాలి
ఇంటి సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చే ప్రయత్నం
రాజంపేట, రైల్వేకోడూరు అభివృద్ధికి చేసిందేమీ లేదు
తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌
బహిరంగ సభలకు అశేష జనవాహినితో నేతల ఆనందం

రాజంపేటలో జనాలనుద్దేశించి మాట్లాడుతున్న తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ, రాజంపేట, రైల్వేకోడూరు, రైల్వేకోడూరు గ్రామీణ: ‘జగన్‌ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. ఏ రోజైనా పరదాలు కట్టుకున్నామా?. సిద్దం అని జగన్‌ అంటున్నాడు. మేము చెబుతున్నాం.. ప్రజలంటున్నారు. మేమంతా నిన్ను గద్దె దించడానికి సిద్దమని చెబుతున్నాం. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు వైకాపా ప్రభుత్వం ఏమైనా చేసిందా?. సొంత జిల్లాకు మేలు చేయని వ్యక్తి రాష్ట్రానికి అవసరమా?. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం ఈ జగన్‌. ఇలాంటి వ్యక్తి మూడు రాజధానులు కడతాడంట. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పూయలేదు. ఇళ్లు కోల్పోయిన వారికి తిరిగి కట్టివ్వలేదు. రాష్ట్రానికి ఈ దుర్మార్గుడు రాజధాని లేకుండా చేశాడు’ అని తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రాజంపేట, రైల్వేకోడూరు పట్టణాల్లో గురువారం జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. రెండు పట్టణాల్లో జరిగిన సభలకు అశేషంగా జనం తరలివచ్చి ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పట్టారు. రెండు పార్టీల అగ్రనేతలు తరలిరావడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో అభిమానం పొంగి పొర్లింది. భారీ ఎత్తున సభలకు తరలివచ్చి.. రాబోయేది... కూటమి ప్రభుత్వమని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ‘రాజంపేట, రైల్వేకోడూరు జనసంద్రం సముద్రాన్ని మరిపించింది. ఈ జన సమూహాన్ని చూశాక జగన్‌రెడ్డికి ఓటుపడుతుందని నమ్ముతారా?. అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రైల్వేకోడూరులో అశేష జనవాహినికి జనసేనాని పవన్‌కల్యాణ్‌ అభివాదం

రాజంపేటకు వైద్యకళాశాలను తీసుకొస్తాం

రాజంపేటను మంచి పట్టణంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైద్యకళాశాల తీసుకురావడంతో పాటు జిల్లా కేంద్రం ఏర్పాటుకు ప్రజల అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. అడ్డగోలుగా జిల్లాలను విభజించారని, ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తామని తెలిపారు. అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, మాచుపల్లి వంతెన, ఓబిలి- టంగుటూరు హైలెవల్‌ వంతెన నిర్మిస్తామని, ఝరికోన ప్రాజెక్టు ద్వారా సుండుపల్లె మండలానికి తాగునీరు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట క్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.  

రైల్వేకోడూరులో తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి,
జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్‌ల విజయకేతనం

చెల్లెమ్మలకు సీఎం జగన్‌  సమాధానం చెప్పాలి

నేరాలు, ఘోరాలు చేసే ఘరానా ముఠా నాయకుడు జగన్‌రెడ్డని చంద్రబాబు ఆరోపించారు. హంద్రీ- నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను గాలికొదిలేసిన సీమ ద్రోహి జగన్‌ అని విమర్శించారు. వివేకా హత్యపై చెల్లెమ్మలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. హంతకుడిని వెనకేసుకొస్తూ.. ఇంటి సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైల్వేకోడూరు అడ్డాగా గనుల్ని, ఎర్రచందనాన్ని మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. ఇంట్లో ముగ్గురు పదవులు అనుభవిస్తూ ప్రజలను పీక్కుతింటున్నారని  విమర్శించారు. రాయలసీమ సంస్కృతిని కించపర్చుతున్నట్లు జగన్‌ చేసిన విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు. తాను రాయలసీమలోనే పుట్టానని కడప కల్చర్‌, పులివెందుల కల్చర్‌, రాయలసీమంటూ ఎగతాళి చేస్తున్నట్లు ప్రచారం చేయడంపై అభ్యంతరం తెలిపారు. రాజంపేట నుంచి రైల్వేకోడూరుకు ఒకే హెలికాప్టర్‌లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తోపాటు భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిలు ప్రయాణించారు.

లక్ష్మీ ప్రసన్నకు నేతల అభయం

లక్ష్మీప్రసన్నతో మాట్లాడిస్తున్న తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌

ఇటీవల ఒంటిమిట్టలో చేనేత కార్మికుడు సుబ్బారావు, భార్య, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబంలో మిగిలిన లక్ష్మీ ప్రసన్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను రాజంపేట సభలో కలిసింది. తనకు అండగా నిలబడినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది. ఆయన స్పందిస్తూ అండగా ఉండడమే కాకుండా జీవితంలో స్థిరపడేవరకు తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ తరఫున రూ.5 లక్షలు సాయం అందించామని, వైకాపా భూదందాలు కారణంగా కుటుంబం ప్రాణాలు తీసుకుందని, ఇదేవిధంగా కోవూరి లక్ష్మి దిల్లీకి వెళ్లి ఇండియా గేటు వద్ద తన బొటన వేలు కోసుకుందని వివరించారు. మీ జీవితాలు బాగుపడాలంటే ఎంపీ మిథున్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.  

ఎర్రచందనం మాఫియాతో మిథున్‌రెడ్డికి సంబంధాలు: పవన్‌

ఎర్రచందనం మాఫియాతో ఎంపీ మిథున్‌రెడ్డికి సంబంధాలున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. మాఫియా డాన్‌ గంగిరెడ్డితో కలిసి మిథున్‌రెడ్డి తిరుగుతున్నారని, ఈ మేరకు తమ వద్ద ఆధారాలున్నట్లు తెలిపారు. రాయలసీమ నీ అడ్డా అయితే.. పీఠాపురంలో నీకేం పనంటూ ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డొస్తున్నారని 40 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అరాచకులను యువత అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ధైర్యంతోనే మార్పు వస్తుందని తెలిపారు. బహిరంగ సభల్లో తెదేపా రాజంపేట అసెంబ్లీ  అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, నేతలు విశ్వనాథనాయుడు, రూపానందరెడ్డి, వేమన సతీష్‌, బత్యాల చెంగల్రాయుడు, రైల్వేకోడూరు అభ్యర్థి అరవ శ్రీధర్‌, చప్పిడి మహేష్‌, కేకే చౌదరి, తాతంశెట్టి నాగేంద్ర, సుంకర శ్రీనివాస్‌, అతికారి దినేష్‌, శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.  

రైల్వేకోడూరులో యువత ఉత్సాహం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు