logo

కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు

కడప పార్లమెంట్‌ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను.

Published : 26 Apr 2024 05:23 IST

జమ్మలమడుగులో తెదేపా, భాజపా, జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

పలగాడి వీధిలో మాట్లాడుతున్న కడప పార్లమెంట్‌ తెదేపా అభ్యర్థి భూపేష్‌రెడ్డి, పక్కనే ఆదినారాయణరెడ్డి, సత్యకుమార్‌

జమ్మలమడుగు : కడప పార్లమెంట్‌ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. నాయకులు, కార్యకర్తలను నమ్ముకుని బరిలోకి దిగానని తెదేపా అభ్యర్థి భూపేష్‌రెడ్డి అన్నారు. గురువారం ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు అభ్యర్థి ఆదినారాయణరెడ్డి నామినేషన్‌ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూరగాయల మార్కెట్‌లోని గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ర్యాలీని ప్రారంభించారు. సంజామల మోటు, తాడిపత్రి రోడ్డు, తేరు రోడ్డు మీదుగా పలగాడి సెంటర్‌కు ర్యాలీ చేరుకుంది. ప్రధానంగా తెదేపా మైనారిటీ నాయకుడు జీకే గైబు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు దేవగుడి కుటుంబానికి మద్దతు పలికారు. ధర్మవరం అసెంబ్లీ భాజపా అభ్యర్థి సత్యకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ  రెండు సార్లు కడప ఎంపీగా పనిచేసిన అవినాష్‌రెడ్డి ఏనాడు జిల్లా సమస్యలపై పార్లమెంట్‌లో నోరెత్తలేదని విమర్శించారు. 2019 ఎన్నికల్లో వివేకా హత్య కేసును అడ్డుపెట్టుకుని గంపగుత్తగా వైకాపా నాయకులు ఓట్లు దండుకున్నారని ఆరోపించారు.

జమ్మలమడుగు ప్రజలు తలదించుకునేలా పనులు

సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క మంచి పని కూడా చేయలేదని నియోజకవర్గ ప్రజలు తలదించుకునేలాతప్పుడు పనులు చేశారని అసెంబ్లీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి దుయ్యబట్టారు. అక్రమంగా ఇసుక వ్యాపారం, కోళ్లు, నీళ్లు, మట్టి మాఫియా, ఉద్యోగాల భర్తీలో కమీషన్‌ ఇలా అన్ని రంగాలను కలుషితం చేశారని విమర్శించారు.

కబ్జా, కమీషన్‌, కరెప్షన్‌, కలెక్షన్‌

సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నప్పట్నుంచి కబ్జా, కమీషన్‌, కరెప్షన్‌, కలెక్షన్‌పైనే దృష్టి పెట్టి దండుకుంటున్నారని ధర్మవరం భాజపా అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్‌ వ్యాఖ్యానించారు. 15 ఏళ్లుగా ఎమ్మెల్యే, 20 నెలలు మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి ఈ సారి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల గురించి పట్టించుకోని సుధీర్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవగుడి నారాయణరెడ్డి, జంబాపురం రమణారెడ్డి, జనసేన నాయకుడు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు