logo

వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం

తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు.

Published : 26 Apr 2024 05:19 IST

లబ్ధిదారులైనా అందని పథకం

మదనపల్లె స్టాండులో ఆపిన ఆటోలు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. ఇచ్చే పదివేలకు ఎన్నో నిబంధనలు పెట్టి ఆటోడ్రైవర్లను సచివాలయాల చుట్టూ తిప్పుకున్నారు. విద్యుత్తు బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడారని కొందరిని, గ్రామంలో ఒక మీటరు, పట్టణంలో ఒక మీటరు ఉందని మరికొందరినీ, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని ఇంకొందరినీ అనర్హులను చేశారు. చాలామంది ట్యాక్సీ డ్రైవర్లు తక్కువ ధరకు వచ్చే కార్లు తీసుకుని వాటిని బాడుగకు తిప్పుకుని జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారిని కార్లున్నాయని వాహన మిత్రకు ఎంపిక చేయకపోగా వారి రేషన్‌ కార్డు కూడా తొలగించారు. వాహనం ఏ కండీషన్‌లో ఉంది. ఎంత విలువ చేస్తుందని విచారించకుండా ఆటోకంటే తక్కువ ధర కలిగిన కారు ఉన్నా వైఎస్‌ఆర్‌ వాహన మిత్రకు అనర్హులను చేశారు. దీంతో ఎంతో మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు వాహనమిత్ర పథకానికి అనర్హులయ్యారు. ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి వాహన బీమా, రోడ్డు ట్యాక్సుల కోసం రూ.10 వేలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి బీమా కోసం రూ.7 వేలు, ఫిట్‌నెస్‌ ధ్రువపత్రం కోసం రూ.4 వేలు, కాలుష్య ధ్రువీకరణ కోసం రూ.వెయ్యి కట్టించుకున్నారు. రూ.10 వేలు ఇచ్చిన ప్రభుత్వం అదనంగా రూ.2 వేలు ట్యాక్సుల రూపంలో కట్టించుకుని వాహన మిత్ర ద్రోహం చేసిందని ఆటో కార్మికులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు, డీజల్‌ ధరలు అమాంతం పెంచేశారు. దీని వల్ల ఒక్క ఆటో డ్రైవర్‌పై నెలకు రూ.2 వేల వరకు అదనపు భారం పడుతోంది. పథకాలు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో ట్యాక్సులు, ఇంధన ధరలు పెంచి డబ్బు కట్టించుకుంటున్నారని ఆటో, ట్యాక్సీ కార్మికులు అంటున్నారు.

  • జిల్లాలో 20 వేల వరకు ఆటో కార్మికులు, 2,500 మంది ట్యాక్సీ డ్రైవర్లు జీవనం సాగిస్తున్నారు. ఇందులో సగం మంది చదువుకున్న నిరుద్యోగులే ఉన్నారు

ప్రమాద బాధితులకు పరిహారం శూన్యం.

గత ప్రభుత్వంలో ఎవరైనా డ్రైవర్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే రూ.5 లక్షలు, క్షతగాత్రులైతే రూ.2.50 లక్షలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ రాలేదు. దీనికి తోడు నల్ల జీవోలు తీసుకొచ్చి వాహన రంగాన్ని అతలాకుతలం చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. స్వేచ్ఛగా ఆందోళన కూడా చేసుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇచ్చింది గోరంత అయితే చెప్పుకునేది కొండంత. పెట్రోలు, డీజల్‌ ధరలు పెంచి డ్రైవర్ల నడ్డి విరిచారు. పక్క రాష్ట్రంలో లీటరుపై రూ.10 తక్కువగా ఉంది. ఇక్కడ చూస్తే రూ.10 ఎక్కువగా ఉంది. ఒక్కో ఆటో డ్రైవర్‌పైన అదనపు భారం తప్ప పథకాల ద్వారా ఆదుకున్నది మాత్రం ఏమి లేదు. 

రెడ్డెప్ప, ఏఐటీయూసీ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు, మదనపల్లె

కార్పొరేషన్‌కు స్వస్తి పలికిన జగన్‌

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం లోకి వస్తూనే ఆటో కార్మికులకు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చి కొంతమందికి మాత్రమే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా అందించే వాహనాలు ఒక్కరికి కూడా రాలేదు. దీనివల్ల ఆటో నడుపుకునేవారు యజమానుల నుంచి వాహనాలు రోజువారి అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారికి వాహన మిత్ర పథకం వర్తించలేదు. ఆటో, ట్యాక్సీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాని ఊసే లేదు. పేరుకు మాత్రమే వాహన మిత్ర సగం మంది కార్మికులకు ఈ పథకం వర్తించలేదు. సచివాలయాల చుట్టూ తిరిగి విసిగి పోయారు. ఒకసారి వెళితే ఒక ధ్రువపత్రం తేవాలని ఇబ్బందులకు గురి చేశారు. దీంతో చాలా మంది పథకం ఆలోచనే మానేశారు.

ప్రభాకర్‌రెడ్డి, ఆటో యూనియన్‌ నాయకుడు, మదనపల్లె

ఒకసారిచ్చి తర్వాత నిలిపేశారు

వాహన మిత్ర అర్హులందరికీ ఇస్తామని చెప్పారు. పేర్లు రాసుకెళ్లి ఒక ఏడాది మాత్రం రూ.10 వేలు ఇచ్చారు. తర్వాత సంవత్సరం సచివాలయ సిబ్బంది పిలిచి వాహన మిత్ర పథకం ఇవ్వడం కుదరదని చెప్పారు. నాకు బి.కొత్తకోట మండలంలో ఆంధ్రా - కర్ణాటక సరిహద్ధుల్లో కొంత పొలం ఉంది. అక్కడ పంటలు పండని పరిస్థితుల్లో సుమారు 20 సంవత్సరాల క్రితం మదనపల్లెకు వచ్చి ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాను. రైతు భరోసా వస్తోందని ఈ పథకాన్ని నిలిపేశారు. మిగిలిన వారికి అమ్మఒడి, వాహన మిత్ర, వృద్ధాప్య పింఛన్లు అన్ని వస్తున్నాయి. మా వరకు వచ్చే సరికి నిలిపేశారు. సచివాలయంలో ఉన్న సిబ్బంది, వాలంటీర్లు కలెక్టర్ల కంటే ఎక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే వాహన మిత్ర గురించి అడగటం వదిలేశాను. సచివాలయ సిబ్బంది వారికి కావాల్సిన వారికి మాత్రమే ఈ పథకం అర్హులని నిర్ణయిస్తున్నారు. సాధారణ ఆటో డ్రైవర్లను పట్టించుకోవడం లేదు.

శ్రీరాములు, ఆటో యూనియన్‌ నాయకుడు, మదనపల్లె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు