logo

పంట నష్టం మదింపు... నిబంధనలతో కుదింపు!

అకాల వర్షాలతో వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టించి అప్పులు చేసి పంటలను పండిస్తే.. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచాయి.

Published : 31 Mar 2023 02:18 IST

33 శాతం కంటే ఎక్కువ ఉండాలట!
వచ్చే నెల 3న ఆర్‌బీకేల్లో జాబితాలు
ఈనాడు డిజిటల్‌, కడప

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నేలకొరిగిన రాజంపేట మండలం లింగరాజుపల్లెలోని అరటి పంట

అకాల వర్షాలతో వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టించి అప్పులు చేసి పంటలను పండిస్తే.. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నారు. పంటలను పరిశీలించిన అధికారులు.. ప్రభుత్వం నుంచి పరిహారం అందించే విషయంలో నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. వీటిని తెలుసుకున్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైయస్‌ఆర్‌ జిల్లాలో అకాల వర్షాలతో రైతులు సాగు చేసిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రకృతి పంజా విసరడంతో 17 మండలాల్లో 2,058 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వీటిల్లో మినుము 83, కొర్ర 116, జొన్న 155, వరి 260, పొద్దుతిరుగుడు 453, మొక్కజొన్న 622 ఎకరాల్లో వర్షార్పణమైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఉద్యాన తోటలకు కూడా కోలుకోలేని గాయం తగిలింది. ఈ సీజన్‌లో ప్రకృతి ప్రకోపంతో 13 మండలాల్లో చేతికందాల్సిన అరటి, బొప్పాయి, మామిడి, నిమ్మ, బత్తాయి, టమోటా, తమలపాకు పంటలు 2,340.69 ఎకరాలు నీటి పాలయ్యాయి. అన్నమయ్య జిల్లాలో 1,237.91 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. బాధిత అన్నదాతలు 1,031 మందిని గుర్తించారు. క్షేత్రస్థాయిలో రైతు వారీగా నష్టపోయిన వారి వివరాలు సేకరించారు. వ్యవసాయ పంటలు 387 ఎకరాల్లో నష్ట పోయినట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. వేలాది రూపాయులు పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించి కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటే వరుణాగ్రహంతో కళ్లెదుటే పచ్చని పంట చేజారిపోయినట్లు కర్షకులు కన్నీరుమున్నీరయ్యారు. మండు వేసవిలో ఊహించని విపత్తు తమ ఆశలను మింగేసినట్లు రైతులు వాపోతున్నారు. జోరువానకు గాలి తోడవ్వడంతో మామిడి కాయలు రాలిపోయాయి. అరటి చెట్లు విరిగిపోయాయి. గెలలు మట్టిపాలు కావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఈదురు గాలుల తాకిడికి బత్తాయి, నిమ్మ చెట్లు కూకటివేర్లతో సహాయ నేలవాలాయి.


వివిధ మండలాల్లో...

వైయస్‌ఆర్‌ జిల్లా చింతకొమ్మదిన్నె, చక్రాయపేట, చాపాడు, చెన్నూరు, ఖాజీపేట, లింగాల, ముద్దనూరు, మైదుకూరు, మైలవరం, పెద్దముడియం, పెండ్లిమర్రి, వేంపల్లె, వీరనాయునిపల్లె, గోపవరం, అన్నమయ్య జిల్లా గుర్రంకొండ, మదనపల్లె, ఓబులవారిపల్లె, నిమ్మనపల్లి, రైల్వేకోడూరు, వాయల్పాడు, కలకడ, చిట్వేలి, పుల్లంపేట, రాజంపేట, పెద్దమండెం, కలికిరి, రామసముద్రం, తంబళ్లపల్లె, కురబలకోట మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు నేలవాలాయి. రైతు భరోసా కేంద్రాల బాధ్యుల ద్వారా వాన పోటుతో పంటలు కోల్పోయిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు. విపణిలో అరటి ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈ సారి మంచి లాభాలు పొందవచ్చునని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.


నష్టపరిహారం అందే పరిస్థితి లేదు!

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందేలా కనిపించడంలేదు. పంట నష్టం వివరాలు సేకరించిన వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు మొత్తం పంటలో 33 శాతం కంటే అధికంగా నష్టం జరిగితేనే పరిహారం అందుతుందని చెబుతున్నారు. అంతకంటే తక్కువ పంట దిబ్బతింటే నష్టం వాటిల్లినట్లు పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఈ- క్రాప్‌ నమోదైన వెంటనే పంటలను అధికారులు పరిశీలిస్తున్నారు. వివిధ కారణాలతో ఈ- క్రాప్‌ నమోదు కాని రైతులకు పరిహారం అందే పరిస్థితి లేదు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. భూయజమాని అంగీకార పత్రాలు ఇస్తేనే పరిహారం అందుతుందని చెబుతున్నారు. ఏప్రిల్‌ 3న పంట నష్టం వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై రైతులకు ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.  


ఒక్క రోజుతోనే రూ.8 లక్షల నష్టం : నాలుగెకరాల్లో అరటి తోట సాగు చేశాను. ఎకరాకు రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. నాలుగు రోజుల్లో పంట చేతికొచ్చేది. ఇంతలోనే అకాల వర్షంతో దాదాపు రూ.8 లక్షల వరకు పంట నష్టం జరిగింది. అరటికి మంచి ధర ఉండగా ఆదాయం పొందలేకపోయాను.

రామచంద్రారెడ్డి, అరటి రైతు, లింగరాజుపల్లె, రాజంపేట మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని