logo

గంజాయి మత్తు.. యువత చిత్తు!

ఈ అంకెలను చూస్తే తెలుస్తుంది గంజాయి సామ్రాజ్యం ఎలా విస్తరిస్తోందో.. వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో గతంతో పోలిస్తే గంజాయి విక్రయాలు ఎలా ఊపందుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.

Published : 06 Jun 2023 02:41 IST

విచ్చలవిడిగా దిగుమతి, అమ్మకాలు
నేరాలకు అడ్డాగా ఇరు జిల్లాలు
న్యూస్‌టుడే, మదనపల్లె పట్టణం, కడప నేరవార్తలు

ఇటీవల కడపలో స్వాధీనం చేసుకున్న గంజాయిని పరిశీలిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌, అధికారులు (పాత చిత్రం)

ఈ అంకెలను చూస్తే తెలుస్తుంది గంజాయి సామ్రాజ్యం ఎలా విస్తరిస్తోందో.. వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో గతంతో పోలిస్తే గంజాయి విక్రయాలు ఎలా ఊపందుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. కరోనా అనంతరం గంజాయి అమ్మకాలు, దిగుమతులు ఎక్కువయ్యాయి. కరోనా సమయంలో మద్యం దొరకలేదు, దొరికినప్పటికీ ఎక్కువ ధరలతో విక్రయించారు. మద్యం కొనలేని వారు గంజాయికి అలవాటు పడ్డారు. ఆ మత్తుకు అలవాటు పడిన వారు మద్యం, సారా, గంజాయి అని చూడకుండా బానిసలుగా మారారు. ఇరు జిల్లాల్లో గంజాయి అమ్మకాలు చాపకింద నీరులా సాగాయి. ఒకప్పుడు గంజాయి అంటే సాధువులు, వృద్ధులు తాగేవారు. ఇప్పుడు ఎక్కువ శాతం యువత, ఇంజినీరింగ్‌ విద్యార్థులు, జులాయిగా తిరిగే వారు ఎక్కువగా తాగుతున్నారు. గంజాయి పొట్లం రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు.

నేరాలకు పాల్పడుతున్న యువత

నెల రోజుల క్రితం రెండో పట్టణ ఠాణాలో అన్నను తమ్ముడు హత్య చేశాడు. అది కూడా గంజాయి మత్తులోనే ఉంది. రవీంద్రనగర్‌లో ఓ చికెన్‌ దుకాణ నిర్వాహకుడిపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి కూడా గంజాయి మత్తులోనే జరిగింది. మైనర్లు, మహిళలతో గంజాయి విక్రయాలు చేయిస్తున్నారు. మైనర్లే ఎక్కువగా దీనికి బానిసలవుతున్నారు. గంజాయి వల్ల ఎక్కువగా యువత నష్టపోతున్నారు. గంజాయి మత్తులో వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్నారు.ః గత మూడు సంవత్సరాలుగా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గంజాయి ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. గంజాయి వ్యాపారం జోరుగా సాగాలంటే యువతను ఆకర్షించాలి. ఇందుకోసం వ్యాపారులు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

విశాఖ టు బెంగళూరు: విశాఖ ప్రాంతంలోని ఏజెన్సీ నుంచి వయా బెంగళూరు మీదుగా గంజాయి మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె తదితర ప్రాంతాలకు చేరుతోంది. అక్కడి వ్యాపారులు ఒక్కో కిలో చొప్పున ప్యాకింగ్‌ చేసి వాహనాల్లో మదనపల్లెకు తరలిస్తున్నారు. గంజాయిని విక్రయించడానికి అక్కడక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. * బెంగళూరు నుంచి వచ్చిన గంజాయిని 5 గ్రాములు, 10 గ్రాముల బరువు కలిగిన ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు.  
* మదనపల్లె పట్టణం పరిసర ప్రాంతాల్లోని బసినికొండ, పుంగనూరు రోడ్డు, చంద్రా కాలనీ, ఈశ్వరమ్మ కాలనీ, నీరుగట్టువారిపల్లె తదితర ప్రాంతాల్లో వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

* ఇటీవల కురబలకోట మండలం అంగళ్లులో 70 ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి గంజాయి తీసుకొస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి మదనపల్లెకు వాహనంలో చీరలు వస్తుండగా ఆ చీరల కింద గంజాయి ప్యాకెట్లను ఎక్సైజు పోలీసులు గుర్తించారు. ఇందులో 27 ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి జప్తు చేశారు. దీంతో పాటు వాహనం, నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

* మదనపల్లె పట్టణ శివారు ప్రాంతం చంద్రాకాలనీలో 200 గ్రాములు గంజాయిని జప్తు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బసినికొండలో వ్యానులో తీసుకెళుతున్న 150 గ్రాములు గంజాయిని జప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

* గంజాయికి బానిసైన ఇంజినీరింగ్‌ విద్యార్థి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేయడం, దాడులు చేయడం వంటి పనులకు పూనుకోగా, తండ్రి విరక్తి చెంది హత్య చేయించిన సంఘటన మదనపల్లె శివారు ప్రాంతం బైపాస్‌ రోడ్డు పక్కన గుట్టలో జరిగింది.

* వైయస్‌ఆర్‌ జిల్లాలో రెండేళ్ల కాలంలో 70 గంజాయి కేసులు నమోదు చేసి, వందల కిలోల గంజాయిని స్వాధీనపరచుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు.. రెండు నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా 70 కిలోల గంజాయి, 50 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, తంబళ్లపల్లె, పీలేరు ప్రాంతాల్లోనూ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది.

విద్యా సంస్థల్లో యాంటి డ్రగ్‌ కమిటీలు

యువత మత్తు వైపు మొగ్గు చూపకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి విద్యాసంస్థల్లో యాంటి డ్రగ్‌ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలు ద్వారా ప్రతి శుక్రవారం విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా వారికి తగు సూచనలు, సలహాలు ఇస్తారు. కాగా మదనపల్లెలో ఇప్పటి వరకు గంజాయి కేసు నమోదు కాలేదు.

శ్రీహరిరెడ్డి, ఎస్‌ఈబీ, సీఐ, మదనపల్లె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని