logo

మునక తప్పదని తెలుసు... అయినా!

దేశ రాజధాని దిల్లీ అతలాకుతలం.. ఇటు హైదరాబాద్‌ మునక... వరద బారిన కోస్తా జిల్లాలు.. ఇదీ ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పరిస్థితి. వరుణుడు ఒక్కసారిగా విరుచుకుపడుతుండడంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఊళ్లకు ఊళ్లు ఏర్లు ఒక్కటైపోతున్నాయి.

Published : 31 Jul 2023 04:21 IST

పాఠాలు నేర్వని పాలకులు
భారీవర్షం పడితే పరిస్థితి అస్తవ్యస్తం

కడప అప్సరా సర్కిల్‌ నుంచి ఆర్టీసీ బస్టాండు దారిలో నిలిచిన నీరు (పాత చిత్రం)

కడప నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : దేశ రాజధాని దిల్లీ అతలాకుతలం.. ఇటు హైదరాబాద్‌ మునక... వరద బారిన కోస్తా జిల్లాలు.. ఇదీ ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పరిస్థితి. వరుణుడు ఒక్కసారిగా విరుచుకుపడుతుండడంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఊళ్లకు ఊళ్లు ఏర్లు ఒక్కటైపోతున్నాయి. అదృష్టం కొద్దీ జిల్లాను ఈ ఏడు ఇప్పటి వరకు వరుణుడు గట్టిగా పలకరించలేదు. ఒకవేళ తుపాను ఏర్పడి భారీ వర్షాలు పడితే మన పరిస్థితి ఏమిటి? ఒక్కసారిగా వచ్చే వరదను నది వైపు మళ్లించే వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయా? అర్బన్‌ ప్రాంతాల్లోని మురుగు కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారా? వరద ప్రవాహ మార్గాల్లో పిచ్చిమొక్కలను, వెలసిన ఆక్రమణలు కొట్టేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ లేదు అనే సమాధానమే వస్తోంది. గతం నుంచి పాలకులు, అధికారులు ఇంకా పాఠాలు నేర్వలేదు. జిల్లాలోని నగర, పుర పాలికల్లో ఎక్కడ చూసినా వర్షం వస్తే మునక తప్పదని అందరికీ తెలుసు. మరి గట్టెక్కే మార్గమేదీ?

ఆక్రమణలతో అగచాట్లు : కడప నగరం చుట్టూ దాదాపు 10 గొలుసుకట్టు చెరువులున్నాయి. ఒకటి నిండిన తర్వాత మరో చెరువులోకి వరదనీరు ప్రవహించాలి. గత 20 సంవత్సరాలుగా వంకలు, వాగుల స్థలాలను యథేచ్ఛగా ఆక్రమించారు. వాటిని తొలగించడానికి అధికారులు చేపట్టిన చర్యలు పూర్తి కాలేదు. దీంతో చెరువుల రూపురేఖలు మారిపోయాయి. నగరంలో ఇప్పటి వరకు పటిష్టమైన వరద కాల్వల నిర్మాణం జరగలేదు.

రెండేళ్ల కిందట మునక : కడప నగర పరిధిలో వరదనీటి ప్రవాహానికి ప్రత్యేకించి కాలువలు లేవు. చెరువుల నుంచి దిగువకు పారే వంకలు, బుగ్గవంక, కేసీ కాలువ ద్వారా వరద నీరు పెన్నా నదిలో చేరుతోంది. ఈ మూడింటి మధ్య సమన్వయం లేదు. వంకలు ఆక్రమణల పాలయ్యాయి. బుగ్గవంక నిండా గుర్రపు డెక్క ఏపుగా పెరిగింది. కేసీ కాలువ పూడికతో నిండి దుర్గంధ భరింతంగా మారింది. దీంతో భారీ వర్షాలు కురిస్తే కడప నగరం నీటమునుగుతోంది. 2021లో కురిసిన వానలకు నగరంలోని ఎన్జీవో కాలనీ, భాగ్యనగర్‌ కాలనీ, హౌసింగ్‌ బోర్డు కాలనీ, మద్రాసు రోడ్డు తదితర ప్రాంతాలు దాదాపు మూడు రోజుల పాటూ వరద నీటిలో చిక్కుకున్నాయి.

ఎన్జీవో కాలనీలో వరద బాధితుల పాట్లు (పాత చిత్రం)

ఇతర పట్టణాల్లోనూ అంతే...

జిల్లాలో రెండో ముఖ్య పట్టణమైన ప్రొద్దుటూరులో మురుగు కాలువల్లో పూడికతీత చేపట్టకపోవడంతో కొర్రపాడురోడ్డు, రాజీవ్‌సర్కిల్‌, ఓనేటి కాల్వ వీధి, శ్రీనివాసనగర్‌ తదితర ప్రాంతాల్లో వరద నీరు చేరుతోంది. జమ్మలమడుగులో కాల్వల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండడంతో వర్షాకాలంలో ప్రధాన రహదారులు జలమయమవుతున్నాయి.

  • మైదుకూరు పట్టణానికి అన్నకుంట, శాకిరేని కుంట ఆక్రమణకు గురికావడం శాపంగా మారింది. దీని వల్ల బాలాజీ నగర్‌, శ్రీనివాసనగర్‌, ఎర్రచెరువు, కడప రోడ్డు నీటమునుగుతున్నాయి. జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవలేదు. గత అయిదేళ్లుగా వర్షాల తీరును పరిశీలిస్తే ఒక్కసారిగా కుండపోత పడితే జనావాసాలు జలమయమైనట్టు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో నగరపాలక, పురపాలక, రెవెన్యూ, నీటిపారుదల శాఖాధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేసి వరద నీరు సక్రమంగా పారేలా చర్యలు వెంటనే చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని