logo

YSRCP Survey: ‘మీ మనసులో ఏముంది.. మాకు తెలియాలి!’

ఇదే కాదు....క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి సమాచార సేకరణలో అధికార వైకాపాకు చెందిన సర్వే బృందాలు పాల్గొంటున్నాయి. వీరికి వార్డు/ గ్రామ వాలంటీర్లు సహాయసహకారాలు అందిస్తున్నారు. ఇంటి యాజమాని పేరు, వయసు, కులం, చరవాణి సంఖ్య, ఓటరు అవునా/కాదా, ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు సంఖ్య, స్థానికులా/ కాదా, ఇంటి చిరునామా తదితర వివరాలు సేకరిస్తున్నారు.

Updated : 24 Nov 2023 07:50 IST
అధికార వైకాపా ఇంటింటి సర్వే
ఫోన్‌లోనూ తెలుసుకునే ప్రయత్నం

వైకాపా ఫోన్‌ సర్వేకు సమాధానాలిస్తున్న తెదేపా కడప నియోజకవర్గ బాధ్యురాలు మాధవిరెడ్డి

ఈనాడు, కడప : ఇదే కాదు....క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి సమాచార సేకరణలో అధికార వైకాపాకు చెందిన సర్వే(YSRCP Survey) బృందాలు పాల్గొంటున్నాయి. వీరికి వార్డు/ గ్రామ వాలంటీర్లు సహాయసహకారాలు అందిస్తున్నారు. ఇంటి యాజమాని పేరు, వయసు, కులం, చరవాణి సంఖ్య, ఓటరు అవునా/కాదా, ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు సంఖ్య, స్థానికులా/ కాదా, ఇంటి చిరునామా తదితర వివరాలు సేకరిస్తున్నారు. కడప నగరంలో తాజాగా ఇంటింటి సర్వే జరుగుతోంది. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో పెద్దఎత్తున సర్వే చేపట్టగా, ప్రస్తుతం వైయస్‌ఆర్‌ జిల్లాపై దృష్టి సారించారు. ఇంటింటి సర్వే ద్వారా సమగ్ర వివరాలు సేకరిస్తుండగా, చరవాణి ద్వారా మాత్రం వైకాపా పరిస్థితి, ప్రత్యర్థుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటి సర్వేలో వివరాలు అడుగుతుండగా కొందరు ఎందుకంటూ నిలదీస్తుండగా, వీరికి వాలంటీర్లు అందుబాటులో ఉండి సమాచారమివ్వాలని దగ్గరుండి మరీ ఇప్పిస్తున్నారు. ఈ సమాచారాన్ని వైకాపా నేతల చేతిలో పెడుతున్నారు. వ్యక్తిగత సమాచారం సేకరణపై ప్రజల నుంచి విమర్శలొస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందే ఎత్తుగడలో భాగంగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమాచారం ఇవ్వకపోయినా బలవంతం పెడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్వేలను మరింత వేగవంతంగా సాగిస్తున్నారు. పక్కింట్లో సమాచారం సేకరిస్తుండగా, విషయం తెలుసుకుని పలువురు తమ ఇళ్లకు తాళం వేసుకుని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.

ప్రజాభిప్రాయ సేకరణ...

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్టు అనంతరం తమ పార్టీ పరిస్థితిని తెలుసుకోవడానికి వైకాపా చరవాణి ద్వారా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ పరిస్థితిని రాబట్టడానికి ప్రయత్నించడంతో పాటు తెదేపా, జనసేన పార్టీ బలాబలాలు, వాటి మధ్య పొత్తులు, తద్వారా ఒనగూరే ప్రయోజనాలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగే పక్షంలో ఏ పార్టీకి ఓటేస్తారంటూ అడుగుతున్నారు. మాటల్లో సమాచారాన్ని రాబడుతూ చివరగా పేరు, ఊరు వివరాలు సేకరిస్తున్నారు. చివరి సమాచారం అడిగే సమయంలో ప్రజలు అనుమానంతో ఫోన్‌ కట్ చేస్తున్నారు. తెదేపా కడప నియోజకవర్గ బాధ్యురాలు మాధవిరెడ్డి ‘బాబు స్యూరిటీ...భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆమె వెంట ఉన్న ఓ నాయకుడికి సర్వే నిమిత్తం వచ్చింది. ఈ సందర్భంగా సదరు నాయకుడు స్పీకరు ఆన్‌ చేసి అందరికీ వినిపిస్తుండగా, ఇంతలో మాధవి జోక్యం చేసుకుని తన సమాధానాలతో చుక్కలు చూపించారు. ఈ తరహా ఫోన్లు అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో పలువురికి తాజాగా వస్తున్నాయి.

ఇదీ చరవాణి ద్వారా అధికార వైకాపా చేపడుతున్న సర్వే

  • చంద్రబాబును మీరు దోషిగా భావిస్తున్నారా?
  • చంద్రబాబు అరెస్టు ద్వారా తెదేపా బలపడుతుందనుకుంటున్నారా?
  • మీరు ఎంత వరకు చదువుకున్నారు?
  • ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు?
  • మీ ప్రాంతంలో ఎక్కువగా ఏ పార్టీకి ఆదరణ ఉంది?
  • సీఎం జగన్‌ పలు కార్యక్రమాలు చేపట్టారు కదా... ‘గడప గడపకు మన ప్రభుత్వం’, ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ లాంటివి మీకు తెలుసా?
  • తెదేపా, జనసేన కూటమి కలిసి పోటీ చేస్తే గెలిచే అవకాశాలున్నాయా?
  • రేపే ఎన్నికలైతే మీరు ఏ పార్టీకి ఓటేద్దామనుకుంటున్నారు?
  • మీ పేరు.. ఊరు?
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని