logo

YSRCP: ప్రొద్దుటూరు వైకాపాలో ప్రకంపనలు.. 23 మంది కౌన్సిలర్లు విందు

ప్రొద్దుటూరులో 23 మంది వైకాపా కౌన్సిలర్లు విందు పేరిట శుక్రవారం ప్రత్యేక సమావేశం కావడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఎన్నడూలేనంతగా ఎన్నికలకు ముందు వీరి భేటీ కలకలం రేపుతోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి పార్టీ పరంగా ఎదురులేకుండా ఉంది.

Updated : 16 Dec 2023 09:09 IST

ఈనాడు, కడప, న్యూస్‌టుడే - ప్రొద్దుటూరు పట్టణం

ప్రొద్దుటూరులో 23 మంది వైకాపా కౌన్సిలర్లు విందు పేరిట శుక్రవారం ప్రత్యేక సమావేశం కావడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఎన్నడూలేనంతగా ఎన్నికలకు ముందు వీరి భేటీ కలకలం రేపుతోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి పార్టీ పరంగా ఎదురులేకుండా ఉంది. ఏ చిన్నపాటి సమావేశమైనా ఎమ్మెల్యే, ఆయన బావమరిది, పురపాలక వైస్‌ ఛైర్మన్‌ బంగారురెడ్డి అనుమతిలేనిదే జరగదు. ఈ ఇద్దరి కనుసన్నల్లోనే పార్టీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. రాజకీయాల్లో తలపండిన.. కొత్తపల్లి సర్పంచి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి సైతం ఎమ్మెల్యేతో అయిష్టంగానైనా రాజీపడి నడుస్తున్నారు. పార్టీ అగ్రనేతలు సైతం ఇతరులను ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడవాల్సిందేననే సంకేతాలు ఇచ్చింది. దీంతోనే కొత్తపల్లి సర్పంచితో పాటు ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ సైతం స్థానికుడైనా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా దూరంగా ఉంటున్నారు. పార్టీపరంగా.. అధికారికంగా ఎంతో పట్టుసాధించిన రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి... అందులోనూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 13వ వార్డు ఇర్ఫాన్‌ బాషా సారథ్యంలో విందు పేరిట ఓ రిసార్ట్స్‌లో ప్రత్యేక భేటీ జరిగింది. సమావేశానికి కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు, పలువురు మాజీలు హాజరయ్యారు. పురపాలక సంఘంలో 41 మంది కౌన్సిలర్లు ఉండగా.. వీరిలో ఒకరు మినహా మిగిలిన వారంతా వైకాపాకు చెందినవారే ఉన్నారు. ఈ భేటీలో తనకు రాజకీయంగా.. అధికారాలు... నిధులు కేటాయింపు పరంగా జరిగిన అన్యాయంపై ఇర్ఫాన్‌ బాషా ప్రస్తావించినట్లు తెలిసింది. ఇది వరకు కౌన్సిల్‌ సమావేశంలో తనపై వైస్‌ ఛైర్మన్‌ ఖాజా మొయిద్దీన్‌ దాడి చేయడం... దీని వెనక బంగారురెడ్డి హస్తం ఉందంటూ ఇర్ఫాన్‌ బాషా ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సహచర కౌన్సిలర్లు, ఇతర నేతలు సైతం ఎమ్మెల్యే, ఆయన బావమరిది పెత్తనం.. ఇతరులపై అణచివేత చర్యలపై చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలోనూ, అధికార పరంగా ప్రజాస్వామ్యం లేదని.. ఎమ్మెల్యేకు, బావమరిది కనుసన్నల్లో మెలగాల్సి వస్తోందంటూ మదనపడినట్లు సమాచారం. వైయస్‌ఆర్‌ జిల్లాలో పులివెందుల తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇక్కడ రాచమల్లుకు భయపడి ఇతరులు ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించే పరిస్థితి లేదు. అంతగా తన గుప్పిట్లో నియోజవర్గాన్ని ఉంచుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎన్నడూలేనంతగా 23 మంది కౌన్సిలర్లు.. ఇతరత్రా నేతలు అధిక సంఖ్యలో విందు పేరిట సమావేశం కావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.  ఈ భేటీలో తితిదే ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు చిప్పగిరి వెంకట ప్రసాద్‌, కౌన్సిలర్లు కమాల్‌ బాషా, ఖలీల్‌, జిలానీబాషా, నాగేంద్రరెడ్డి, మహమ్మద్‌ గౌస్‌, మల్లికార్జున ప్రసాద్‌ యాదవ్‌, నేతలు జయలింగారెడ్డి, పోసా భాస్కర్‌, చిన్నరాజు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని