logo

వాలంటీర్ల కోసం వెతుకులాట!

తాము రాజీనామా చేసేందుకు ససేమిరా అంటూ గ్రామ/ వార్డు వాలంటీర్లు వైకాపా నేతలకు కంట కనిపించకుండా తిరుగుతున్నారు.

Published : 23 Apr 2024 05:29 IST

ఇళ్లకెళ్లి వైకాపా నాయకుల బెదిరింపులు
ప్రచారానికి రావాల్సిందేనని తీవ్ర ఒత్తిళ్లు

ఈనాడు, కడప : తాము రాజీనామా చేసేందుకు ససేమిరా అంటూ గ్రామ/ వార్డు వాలంటీర్లు వైకాపా నేతలకు కంట కనిపించకుండా తిరుగుతున్నారు. దీంతో నాయకులు వెతుకులాటకు దిగారు. కడప నగరంలో వాలంటీర్ల కోసం కార్పొరేటర్లు, నేతలు కలిసి సోమవారం వెతకడం కనిపించింది. వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఎన్నికల ప్రచారానికి రావాలంటూ ఒత్తిళ్లు పెరిగాయి. రాజీనామా చేసే పక్షంలో తిరిగి ఉద్యోగం సంపాదించుకోవడమెలా అనే సందేహం తలెత్తుతోంది. అందులోనూ తెదేపా అధినేత చంద్రబాబు సైతం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామనే హామీ ఇచ్చారు. నిబంధనలు మేరకు పని చేసేవారికి ఎలాంటి ఢోకా లేదని, వైకాపాకు అంటకాగేవారి భరతం పడతామనే హెచ్చరికలు చేశారు. ఈ భరోసాతో దాదాపు 60 శాతం మంది వరకు వాలంటీర్లు రాజీనామా చేయకుండా దాటవేశారు. రాజీనామా చేసిన వారు సైతం ప్రచారానికి హాజరుకావడంలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ చరవాణులు, సిమ్‌లు సైతం వెనక్కి ఇచ్చేశారు. దీంతో సొంత చరవాణులు వాడే నంబర్లు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో వాలంటీర్ల చిరునామాలు తెలుసుకుని ఇళ్లకు వెళ్లే పక్షంలోనూ కనిపించడంలేదు. చాలా మంది స్థానికంగా లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ పరిస్థితిని తెలుసుకున్న వైకాపా నేతలు కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. నేతల కంటే వాలంటీర్లకు ఓటర్లు ప్రాధాన్యమిస్తుండడంతో వారి కోసం వైకాపా అభ్యర్థులు దృష్టి సారించారు. వారి ద్వారానే తాయిలాలు పంపిణీ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. వాలంటీర్లు చాలా మంది అందుబాటులో లేకుండా పోవడంతో నేతలకు సమస్యగా మారింది. మాట వినకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే నేతల హెచ్చరికలకు వాలంటీర్లు భయపడడంలేదు. ¢ు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వాలంటీర్లపై నేతలు దృష్టి పెట్టారు. ప్రొద్దుటూరులో సొంత పార్టీవారి కంటే వాలంటీర్లే నయమనేవిధంగా వైకాపా అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి భావించారు. 500 మంది వాలంటీర్ల జట్టుతో ఎన్నికల తతంగం నడపడానికి ప్రయత్నాలు సాగించగా చాలా మంది జారుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని