logo

రథంపై దాశరథి... మురిసిన భక్తజన హృది!

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రథోత్సవం కనులపండువగా జరిగింది.

Published : 24 Apr 2024 03:43 IST

భక్తులకు దర్శనమిచ్చిన సీతారామలక్ష్మణమూర్తులు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రథోత్సవం కనులపండువగా జరిగింది. తొలుత యాగశాలలో తితిదే పాంచరాత్ర ఆగమ సలహాదారుల కల్యాణపురం రాజేష్‌ భట్టార్‌ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అనంతరం రథంగ ప్రతిష్ఠ, రథాన్యాసం తదితర పూజలు శాస్త్రోక్తంగా జరిపారు. సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ఆలయం నుంచి మేళతాళాలతో తీసుకొచ్చి తేరుపై కూర్చోబెట్టారు. ఉదయం 10.33 గంటలకు తేరు చక్రాలు కదిలాయి. భక్తులు జై శ్రీరామ్‌.. జై శ్రీరామ్‌.. గోవిందా.. గోవిందా.. కోదండ రామయ్యా కదిలిరావయ్యా అంటూ నినదించారు. మండుటెండలోనూ భక్తిభావంతో పెద్దసంఖ్యలో భక్తులు రథాన్ని లాగడానికి పోటీపడడంతో పురవీధులు కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం 12.07 గంటలకు నడి గంగమ్మ గుడి వద్దకు రాగానే భోజనం విరామమిచ్చి రథాన్ని నిలిపారు. తిరిగి సాయంత్రం 3.50 గంటలకు కదిలింది. కోలాట నృత్య ప్రదర్శనలు, కేరళ వాద్యం, డప్పులతో సాయంత్రం 5.04 గంటలకు రథ మండపానికి తేరు చేరింది.

మాడవీధుల్లో తిరుగుతున్న రామయ్య రమణీయ రథం

అలరించిన కోలాట నృత్య ప్రదర్శనలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని