logo

నామపత్రాల ఉప సంహరణలు

ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి దాఖలు చేసిన 21 మంది అభ్యర్థుల్లో ఆరుగురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలోని ఆర్వో కౌసర్‌ బాను వద్దకు వెళ్లి ఆరుగురు పోటీ నుంచి వైదొలుగుతున్నామని సంతకాలు చేశారు.

Updated : 30 Apr 2024 07:10 IST

మాట్లాడుతున్న ప్రత్యేక  పరిశీలకులు భానుదాసు పలావె, రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి దాఖలు చేసిన 21 మంది అభ్యర్థుల్లో ఆరుగురు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలోని ఆర్వో కౌసర్‌ బాను వద్దకు వెళ్లి ఆరుగురు పోటీ నుంచి వైదొలుగుతున్నామని సంతకాలు చేశారు. చివరకు 15 మంది మిగిలారు. దీంతో అభ్యర్థులకు ఎన్నికల చిహ్నాలను ఆర్వో ఖరారు చేశారు. ప్రధాన అభ్యర్థులైన నంద్యాల వరదరాజులురెడ్డి (తెదేపా-సైకిల్‌),  రాచమల్లు శివప్రసాదురెడ్డి (వైకాపా-ఫ్యాను), పీఎండీ నజీర్‌ (కాంగ్రెస్‌పార్టీ-హస్తం) పోటీలో ఉన్నారు.

ఎన్నికల బరిలో మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ బంగారురెడ్డి :  ప్రొద్దుటూరు శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఆర్వో కౌసర్‌ బాను సోమవారం ఆమోదం తెలిపిన 15 మంది అభ్యర్థుల్లో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పాతకోట బంగారు మునిరెడ్డి పోటీలో ఉన్నారు. కానీ నామినేషన్‌ పత్రంలో అతని పేరులో గందరగోళం, స్పష్టత లేని ఫొటో, ఇంటి పేరు గుర్తించని విధంగా వివరాలు ఉన్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఖరారు చేసిన అభ్యర్థుల తుది జాబితాలో 10వ వరుస సంఖ్యలో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ పేరు మీదుగా సింహం గుర్తుపై పి.మునిరెడ్డి బంగారు అనే అక్షరాలతోపాటు ఫొటో నిశితంగా గమనిస్తేకానీ గుర్తుపట్టని విధంగా గుండు ఉన్న ముఖం ఉండటం గమనార్హం.

బద్వేలులో.. : బద్వేలు : బద్వేలు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీలైన వైకాపా అభ్యర్థి సుధ, ఉమ్మడి కూటమి అభ్యర్థి రోశన్న, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయజ్యోతితోపాటు  స్వతంత్ర, వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

జమ్మలమడుగులో : జమ్మలమడుగు: జమ్మలమడుగు అసెంబ్లీ బరిలో 15 మంది ఉన్నట్లు రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 24 మందిలో చివరి రోజు 9 మంది నామినేషన్లను ఉప సంహరించుకున్నట్లు తెలిపారు. పోటీలో ఆదినారాయణరెడ్డి, భాజపా (కమలం), ఓబయ్య, బహుజన సమాజ్‌ పార్టీ (ఏనుగు), పాముల బ్రహ్మానందరెడ్డి, కాంగ్రెస్‌ (హస్తం), మూలె సుధీర్‌రెడ్డి, వైకాపా (ఫ్యాను) ఉన్నారు.

మైదుకూరులో.. మైదుకూరు: నియోజకవర్గంలో 15మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. బహుజన సమాజ్‌ పార్టీ నుంచి డి.ఎస్‌.కల్యాణ్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి గుండ్లకుంట శ్రీరాములు, తెదేపా నుంచి పుట్టా సుధాకర్‌యాదవ్‌, వైకాపా నుంచి శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని