logo

జగనుడిదే పాపం.. కార్మికుడికి శాపం..!

అసంఘటిత, సంఘటిత కార్మికవర్గాల సంక్షేమాన్ని  వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ప్రతిపక్షనేతగా ఊదరగొట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటమరిచారు.

Published : 01 May 2024 07:17 IST

మేడే సందర్భంగా ప్రత్యేక కథనం

అసంఘటిత, సంఘటిత కార్మికవర్గాల సంక్షేమాన్ని  వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ప్రతిపక్షనేతగా ఊదరగొట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటమరిచారు. హామీలు నెరవేర్చాలని రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే అణిచివేశారు. ఉద్యమిస్తే కేసులు పెట్టి బెదిరించారు. అంగన్‌వాడీలపై ఏకంగా ఎస్మా ప్రయోగించారు. జిల్లాలో వివిధ రంగాలకు చెందిన కార్మికులు అయిదేళ్లల్లో జగన్‌ సర్కారుపై గళమెత్తిన తీరుపై సచిత్ర కథనం కార్మికుల దినోత్సవం సందర్భంగా...

 న్యూస్‌టుడే, రాయచోటి


పుర సిబ్బంది ఆందోళన

మున్సిపల్‌ కార్మికులను అన్నివిధాలుగా ఆదుకుంటామని ప్రతిపక్షనేతగా వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట తప్పారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేసినా ప్రయోజనం లేదు. జిల్లాలో సుమారు 700 మంది కార్మికులు పని చేస్తున్నారు.

న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ


ఆశ కార్యకర్తలకు పని భారం

జిల్లాలో 1,400 మంది ఆశ కార్యకర్తలు పని చేస్తున్నారు. 2,000 జనాభాకు ఒక ఆశ కార్యకర్త ఉండాల్సి ఉన్నా 5,000 మందికి ఒక కార్యకర్త చొప్పున పని చేస్తున్నారు. కనీస వేతనాల్లేక, పని గంటలు పెరగడంతో ఆందోళనలు చేసినా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించలేదు.


క్లాప్‌మిత్రలకేదీ భరోసా

జిల్లాలో స్వచ్ఛభారత్‌ కింద సుమారు 2,000 మంది క్లాప్‌ మిత్రలున్నారు. కనీసవేతనం లేకపోవడంతో వారి జీవనం భారమైంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.


భవన నిర్మాణ సంక్షేమ నిధుల మళ్లింపు

వైకాపా ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ నిధులను మళ్లించి కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ఇసుక రీచ్‌లతో ఉపాధిలేక రోడ్డున పడ్డారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన వారికి బీమా చెల్లించలేదు. వందల సంఖ్యలో క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో 70 వేల మంది భవననిర్మాణ కార్మికులున్నారు.


క్రమబద్ధీకరణ హామీ గాలికి...

విద్యుత్తుశాఖలో తాత్కాలిక, ఒప్పంద, పొరుగసేవల కార్మికుల సమస్యలను విస్మరించడంతో సమ్మె బాట పట్టారు. ఉమ్మడి జిల్లాలో 2,545 మంది కార్మికులు, మరో 2,400 మంది కార్యాలయాల్లో ఒప్పంద కార్మికులుగా పని చేస్తున్నారు.


అంగన్‌వాడీలకు బెదిరింపులు

అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హమీ విస్మరించడంతో రోడ్డెక్కారు. 42 రోజులు రోడ్డెక్కి నినదించినా ప్రభుత్వం పట్టించుకోకపోగా ఎస్మాను ప్రయోగించి బెదిరింపులకు పాల్పడింది. జిల్లాలో సుమారు 3,950 మంది అంగన్‌వాడీ సిబ్బంది ఉన్నారు.


యానిమేటర్లకు రాజకీయ వేధింపులు

వెలుగులో యానిమేటర్లకు రాజకీయ వేధింపులకు తప్పడం లేదు. జిల్లాలో 2,100 మంది యానిమేటర్లు పని చేస్తున్నారు. ఉద్యోగుల భద్రత, సమస్యల పరిష్కారానికి ఆందోళన చేశారు.


ఉద్యోగ భద్రతకు నిరసన

వైకాపా పాలనలో పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కరవైంది. వారి సమస్యల పరిష్కారానికి నినదించినా పాలకులు పట్టించుకోలేదు. జిల్లాలో 414 గ్రామ పంచాయతీలలో 4 వేల మంది కార్మికులున్నారు. 


ఆటో చోదకులకు అన్యాయం

ఆటో కార్మికులకు ఆర్థికసాయం అందించే వాహనమిత్ర పథకానికి నిబంధనలతో అర్హుల సంఖ్యను వైకాపా సర్కారు కుదించింది. జిల్లాలో 22,000 మంది ఆటో కార్మికులుండగా 8 వేల మందికే సాయం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని