logo

వాలంటీర్లతో వైకాపా నేతల రహస్య సమావేశం

రాయచోటిలోని పురపాలక సభా భవనం వద్ద శనివారం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి సగీర్‌పై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. సభా భవనంలో ఛైర్మన్‌ ఎస్‌.ఫయాజ్‌బాషా మరికొంత మంది కౌన్సిలర్లు గత నెలలో రాజీనామాలు చేసిన వాలంటీర్లతో రహస్యంగా సమావేశమయ్యారు.

Published : 05 May 2024 04:54 IST

ప్రశ్నించిన తెదేపా మైనార్టీ హక్కుల పరిరక్షణ రాష్ట్ర కార్యదర్శిపై దాడి

ఘర్షణ పడుతున్న పురపాలక ఛైర్మన్‌ ఫయాజ్‌బాషా, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి సగీర్‌, కౌన్సిలర్లు

రాయచోటి, న్యూస్‌టుడే: రాయచోటిలోని పురపాలక సభా భవనం వద్ద శనివారం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి సగీర్‌పై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. సభా భవనంలో ఛైర్మన్‌ ఎస్‌.ఫయాజ్‌బాషా మరికొంత మంది కౌన్సిలర్లు గత నెలలో రాజీనామాలు చేసిన వాలంటీర్లతో రహస్యంగా సమావేశమయ్యారు. ఏప్రిల్‌కు సంబంధించిన వేతనం చెల్లించడంతో పాటు ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన కార్యక్రమాలపై వ్యూహరచన చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మైనార్టీ హక్కుల పరిరక్షణ రాష్ట్ర కార్యదర్శి సగీర్‌, తెదేపా నాయకుడు రవీంద్రారెడ్డి అక్కడికి వెళ్లారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా రాజీనామా చేసిన వాలంటీర్లతో ఎలా సమావేశం నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన పురపాలక సంఘం ఛైర్మన్‌ ఫయాజ్‌బాషా, కౌన్సిలర్లు సగీర్‌పై చేయి చేసుకుని దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పాత్రికేయులు అక్కడికి చేరుకోగానే కౌన్సిలర్లు, వాలంటీర్లు అక్కడ నుంచి జారుకున్నారు. వైకాపా ఆగడాలను అడ్డుకోవడంతోనే తనపై దాడిచేశారని సగీర్‌ వాపోయారు. సంఘటనపై ఎస్పీ, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.


వైకాపాకు ఓటేయాలంటూ వాలంటీర్ల ప్రచారం

జిల్లాలో ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు

రాయచోటి, న్యూస్‌టుడే: ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. ఎన్నికల ప్రచారంలలో వాలంటీర్లు యథేచ్ఛగా పాల్గొంటున్నా వారిపై కనీస చర్యలు తీసుకోవడంలేదు. జిల్లా కేంద్రమైన రాయచోటిలో వాలంటీర్లు బ్యాలెట్‌ నమూనా బాక్సులు పట్టుకొని వృద్ధుల వద్దకు వెళ్లి ఫ్యాన్‌ గుర్తును చూపించి వైకాపాకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. రామాపురంలో ఓ మహిళా వాలంటీరు వృద్ధుల వద్దకు బ్యాలెట్‌ నమూనా బాక్సు తీసుకెళ్లి అవగాహన కల్పించారు. బ్యాలెట్‌పై ఫ్యాను గుర్తును చూపించి దానిపై బటన్‌ నొక్కాలని ఓ వృద్ధురాలికి చూపిస్తున్న చిత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని