logo

కష్టాలు చూశాను... కన్నీళ్లు తుడుస్తాను...

‘సీమ కష్టాలు చూశాను.. సీమ కన్నీళ్లు తుడుస్తాను. యువత నుంచి వచ్చిన పిలుపు మేరకు యువగళం మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టాను. జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభించి కడప వరకు 119 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాను.

Published : 05 May 2024 05:05 IST

కూటమి  మేనిఫెస్టోలో ‘మిషన్‌ రాయలసీమ’
యువగళం పాదయాత్రలో లోకేశ్‌ ప్రకటన

‘సీమ కష్టాలు చూశాను.. సీమ కన్నీళ్లు తుడుస్తాను. యువత నుంచి వచ్చిన పిలుపు మేరకు యువగళం మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టాను. జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభించి కడప వరకు 119 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాను. అడుగడుగునా రాయలసీమ ప్రజానీకం కష్టాలు చూసి చలించిపోయాను. అందుకే ‘మిషన్‌ రాయలసీమ’ పేరిట పథకాలను ప్రకటిస్తున్నాను. తెదేపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో హామీలను స్వయంగా నేనే నెరువేరుస్తా. 2019 ఎన్నికల్లో  రాయలసీమలో 52కుగానూ 49 సీట్లలో వైకాపాను గెలిపించారు. వైకాపాతో ఏమైనా ఒరిగిందా?. మీ కన్నీళ్లు తుడవాలంటే వైకాపాకు ఇచ్చిన సంఖ్యా బలాన్ని తెదేపాకు ఇవ్వండి. అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తాం. హామీ నెరవేర్చలేదంటే నన్ను గట్టిగా నిలదీయండి. చొక్కా పట్టుకుని అడగండి.

2023, జూన్‌ 7న కడపలో జరిగిన సభలో ‘మిషన్‌ రాయలసీమ’ ప్రకటన సందర్భంగా నారా లోకేశ్‌

లోకేశ్‌ ప్రకటన మేరకు ఎన్డీఏ కూటమి తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ‘మిషన్‌ రాయలసీమ’ను పొందుపర్చారు. ఇటీవల తెదేపా, జనసేన ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో ప్రముఖంగా కార్యక్రమాన్ని ప్రస్తావించారు. దీంతో రాయలసీమతో పాటు ప్రత్యేకించి అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల వాసులకు ఎంతో ఊరట కలగనుంది.

ఈనాడు, కడప

మిషన్‌ రాయలసీమ ప్రణాళిక ఏమంటే?

  • రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరందించడం.
  • మామిడి, బొప్పాయి. దానిమ్మ, చీని, అరటి, టమాట తదితర పంటల సాగు పెంచడానికి ప్రోత్సాహం.
  • 90 శాతం రాయితీపై బిందు సేద్యం పరికరాల అందజేత.
  • ఉద్యాన పరిశోధన కేంద్రాలు ఏర్పాటు.
  • దేశ, అంతర్జాతీయ స్థాయి విపణిలో డిమాండుకు తగ్గట్టుగా వంగడాలు అందుబాటులోకి తీసుకురావడం.
  • టమాట వాల్యూచైన్‌ ఏర్పాటు చేసి పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పించడం.
  • వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు రాష్ట్రంలోనే తయారు చేసి తక్కువ ధరకు రాయితీపై పంపిణీ చేయడం.

సీడ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం

  • నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందేవిధంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.
  • పాత బీమా పథకాన్ని అమలు చేయడం.
  • రైతుబజార్లు పెంపు. వాతారణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పంటలు వేయాలనేదానిపై ప్రభుత్వం నుంచే సలహాలు.
  • గుజ్జు పరిశ్రమల ఏర్పాటు. మిర్చి, పసుపు కొనుగోలు కేంద్రాల స్థాపన.
  • కౌలు రైతులను గుర్తించి భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాయం అందించడం.

పాడి రైతులను కాపాడతాం

  • పాడి రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం.
  • పశువుల కొనుగోలు దగ్గర నుంచి దాణా, మందుల వరకు అన్నీ రాయితీపై అందించడం.
  • గోకులాల ఏర్పాటు. గొర్రెలు, మేకలు పెంపకం కోసం ప్రత్యేక సాయం.
  • పేదలకు ఉచితంగా గొర్రెలు, మేకలు పంపిణీ.
  • మేత కోసం బంజరు భూముల కేటాయింపు.
  • పాడి రైతులకు రాయితీపై రుణాల పంపిణీ

క్రీడా విశ్వవిద్యాలయానికి అడుగులు

  • స్పోర్ట్స్‌ క్యాపిటల్‌గా ఆఫ్‌ ఇండియాగా తీర్చిదిద్దడానికి రాయలసీమలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు
  • అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడాపోటీలకు క్రీడాకారులను తీర్చిదిద్దేవిధంగా శిక్షణ ఇవ్వడం.
  • క్రికెట్‌, పుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, స్విమ్మింగ్‌ ఇలా అన్ని రకాల క్రీడలకు స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ ఫెసిలిటీలు, స్టేడియంల స్థాపన.

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి

  • టెంపుల్‌ టూరిజం, ఏకో టూరిజం, టైగర్‌ ఏకో టూరిజం ఏర్పాటు.
  • గండికోట, హార్సిలీహిల్స్‌ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి.
  • ప్రత్యేకించి గిరిజనులు, చెంచులకు ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పన

పరిశ్రమల స్థాపన

  • రాయలసీమ జిల్లాలను ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలకు చిరునామాగా తీర్చిదిద్దడం.
  • బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ కారిడార్ల ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కృషి.
  • ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్‌ కంపెనీల ద్వారా యువతకు ఉపాధి.
  • అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో మైనింగ్‌ పరిశ్రమకు మరింత ప్రోత్సాహం.
  • మైనింగ్‌ తుది ఉత్పత్తి వరకు పూర్తి వ్యాల్యూచైన్‌ రాష్ట్రంలో ఏర్పాటు.
  • మైనింగ్‌ పనులు మనం రాష్ట్రం వాళ్లే చేసేవిధంగా నైపుణ్య శిక్షణ ఇవ్వడం.
  • డిఫెన్స్‌ పరికరాల తయారీ కంపెనీల ఏర్పాటు.
  • సీమకు కియా, ఫ్యాక్స్‌ కాన్‌, టీసీఎల్‌ తదితర పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపడం.

వాటర్‌గ్రిడ్‌ ద్వారా ఇంటింటికి తాగునీరు

  • వాటర్‌గ్రిడ్‌ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షత తాగునీరందించడం.

మాకెంతో భరోసా ఇచ్చింది

ప్రతి ఎకరాకు నీరిస్తామంటూ మేనిఫెస్టోలో ప్రస్తావించడం మాకెంతో భరోసాను ఇచ్చింది. కాలువలు లేనందున సర్వరాయసాగర్‌ ప్రాజెక్టు సీఎం జగన్‌ కుటుంబ సభ్యులకే ఉపయోగపడుతోంది. తెదేపా అధికారంలోకి వస్తే కాలువలు వస్తాయనే నమ్మకం కలిగింది. దీంతో వేలాది మంది రైతులు బాగుపడతారు.  

జి.ఓబయ్య యాదవ్‌, అడవి చెర్లోపల్లె, వీరపునాయునిపల్లె మండలం

తెదేపా ప్రభుత్వంతోనే రైతులకు మేలు

వైకాపా సర్కారు ఉద్యాన పంటల రాయితీలకు మంగళం పలికింది. చిన్నపాటి పరికరాలు సైతం అందని పరిస్థితి నెలకొంది. తెదేపా అధికారంలోకొస్తే ఉద్యాన రైతులకు పండగే. మేమంతా తెదేపాకు మద్దతివ్వాలనుకున్నాం.

కస్తూరి నాగరాజు, కాకర్లవారిపల్లె, ఓబులవారిపల్లె మండలం

తాగునీటి సమస్యకు మోక్షం

ఇంటింటికి తాగునీటి సౌకర్యం కలుగుతుంది. మిషన్‌ రాయలసీమ కార్యక్రమం కింద మోక్షం లభిస్తుంది. వైకాపా ప్రభుత్వంలో తాగునీటికి నానా తంటాలు పడుతున్నాం. 

బాలకృష్ణారెడ్డి, పెండ్లిమర్రి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని