logo

రెండు సార్లు వచ్చావ్‌... ఉక్కుకేమి చేశావ్‌?

ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆ పెద్ద మనిషి (అప్పటి సీఎం చంద్రబాబు) టెంకాయ కొట్టాడు. ఒకసారి ఆలోచించమని చెబుతున్నా ప్రజలు ఐదేళ్ల పరిపాలనకు అధికారం ఇస్తారు. నాలుగున్నరేళ్లు ఏమీ చేయకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు.

Published : 05 May 2024 05:09 IST

పరిశ్రమ ఏర్పాటుకు సీఎం జగన్‌ భూమి పూజలు
నేటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడని వైనం
నిరుద్యోగ యువతకు వైకాపా సర్కారు నయవంచన

2023 ఫిబ్రవరి 15న రెండోసారి ఉక్కు పరిశ్రమ కోసం జేఎస్‌డబ్ల్యు ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌తో కలసి భూమి పూజలో పాల్గొన్న సీఎం జగన్‌ (పాత చిత్రం)

ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆ పెద్ద మనిషి (అప్పటి సీఎం చంద్రబాబు) టెంకాయ కొట్టాడు. ఒకసారి ఆలోచించమని చెబుతున్నా ప్రజలు ఐదేళ్ల పరిపాలనకు అధికారం ఇస్తారు. నాలుగున్నరేళ్లు ఏమీ చేయకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు. అదే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారు. పాలనలో తేడా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మూడేళ్లలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేసి ప్రారంభిస్తాం.

జమ్మలమడుగు మండలం కన్యతీర్థం బహిరంగ సభలో 2019 డిసెంబరు 23న సీఎం జగన్‌ చెప్పిన మాటలు

30 నెలల్లో ఉక్కు పరిశ్రమ మొదటి దశ అనంతరం,  ఐదేళ్లలో రెండో దశ నిర్మాణం పూర్తవుతుంది. దీని నిర్మాణానికి సజ్జన్‌ జిందాల్‌ ముందుకు రావడం అభినందనీయం. ఈ నిర్మాణం 3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతోనే ఆగిపోదు. పరిశ్రమతో వైయస్సార్‌ జిల్లా ముఖ చిత్రమే మారిపోతుంది. రూ.8,800 కోట్లతో పరిశ్రమ నిర్మాణం జరుగుతుంది. ఉక్కు పరిశ్రమకు సహాయ సహకారాలు అందిస్తాం. మొత్తం 3,500 ఎకరాలు జిందాల్‌ కంపెనీకి ఇవ్వడమే కాకుండా రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. తద్వారా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఇక్కడో స్టీల్‌ సిటీ వస్తుంది. ప్రొద్దు టూరు - ఎర్రగుంట్ల రైల్వేలైను కలుపుతూ మరో పది కిలోమీటర్లు కొత్త లైను నిర్మాణం చేపడతాం.

2023 ఫిబ్రవరి 15 జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో వైయస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ రెండోసారి భూమి పూజలో సీఎం జగన్‌ చెప్పిన మాటలు

న్యూస్‌టుడే, జమ్మలమడుగు: జమ్మలమడుగు మండలం కన్యతీర్థం వద్ద 2019, డిసెంబరు 23న ఒకసారి, 2023, ఫిబ్రవరి 15న రెండోసారి సీఎం జగన్‌ ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ముందుగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు లిబర్టీ స్టీలు కంపెనీ ఆసక్తి చూపింది. ఆర్థిక వెసులుబాటు వంటి కారణాలతో ఒప్పందం రద్దయింది. అనంతరం ఎస్‌ఆర్‌ స్టీలు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అది కూడా తప్పుకోవడంతో జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ముందుకొచ్చింది.  పరిశ్రమ ఏర్పాటుకు రూ.8,800 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వంతో ఒప్పందం కుదురుర్చుకుంది. ‘మొదటి విడతలో రూ.3,300 కోట్లు వెచ్చించి త్వరలో పనులు ప్రారంభిస్తుంది. మొదటి దశలో ఏడాదికి మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి చేస్తుంది. రెండో విడతలో ఏడాదికి మరో 2 మిలియన్‌ టన్నులు తయారు చేస్తుంది. వెనుకబడ్డ రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే ప్రక్రియలో ఇదొక గొప్ప ప్రయత్నం’ అని సీఎం జగన్‌ ఆ సమయంలో ప్రకటించడంతో జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె - పెద్ద దండ్లూరు గ్రామాల మధ్యలో 3,148.68 ఎకరాల్లో రూ.11,606 కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌కు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తే... 25 వేల మంది యువతకు ప్రత్యక్షంగా, మరో లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. 2023, ఏప్రిల్‌ ఆఖరు నుంచి పనులు పూర్తిస్థాయిలో మొదలవుతాయని సీఎం చెప్పినా కార్యరూపం దాల్చలేదు. ఇంత వరకు అక్కడ రెండు కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మాణ పనులు జరిగాయి. ఇంకా 22 కిలోమీటర్ల ప్రహరీ ఏర్పాటు చేయాల్సి ఉండగా, బిల్లుల చెల్లింపుల్లేక పనులు నిలిచిపోయాయి.

ఆగుతూ...సాగుతున్న రహదారి పనులు

జమ్మలమడుగు కొత్త రోడ్డు నుంచి స్టీల్‌ప్లాంటు వరకు నాలుగు వరుసల రహదారి పనులు జరుగుతున్నాయి. ఉక్కు పరిశ్రమ నిర్మిత ప్రాంతం వరకు ఆధునిక తరహాలో రహదారి ఏర్పాటుకు 2021, జూన్‌ 4వ తేదీన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పనులను ప్రారంభించారు. కొంత వరకు మట్టి పనులు జరిగాయి. ఆ తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. కొద్ది రోజులుగా పనులు మొదలయ్యాయి. మొత్తం 7.5 కిలోమీటర్లకు రూ.22.50 కోట్లు కేటాయించారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.
పరిహారం: వైయస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ కోసం 3148.68 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరులో 1390.60 ఎకరాలు, సున్నపురాళ్లపల్లె గ్రామంలో 1758.08 ఎకరాలు సేకరించారు. వీటితోపాటు 409.48 ఎకరాల డీకేటీ భూమిని సేకరించారు. ఇందులో 379 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా 286 మందికి ఒక ఎకరా చొప్పున రూ.3.75 లక్షల వంతున నగదు జమ చేశారు. చిరునామా, పేరు మార్పులు వంటి కారణాలతో చాలామందికి పరిహారం అందలేదు.

పుట్టిన గడ్డకు మేలు చేస్తారనుకుంటే

మన ప్రాంతంలో ఉక్కు కర్మాగారం వస్తే చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. నిరుద్యోగ సమస్య తీరుతుంది. జిల్లా వాసి జగన్‌ సీఎం కాగానే పుట్టిన గడ్డను మేలు చేస్తారని యువత ఆశపడ్డారు. ఒకసారి కాదు రెండు సార్లు ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేసినా కార్యరూపం దాల్చక పోవడం బాధాకరం

ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు

జమ్మలమడుగు రూపురేఖలు మారుతాయనుకున్నాం

సీఎం జగన్‌ ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేయగానే జమ్మలమడుగు రూపురేఖలు మారుతాయని అనుకున్నాం. ఉక్కు పరిశ్రమ వస్తే దాంతో పాటు అనుబంధ పరిశ్రమలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, వలసలు తగ్గుతాయని అనుకుంటే సీఎం జగన్‌ మా ఆశలను సమాధి చేశారు.

సుబ్బరాయుడు, జమ్మలమడుగు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని