logo

పులివెందులలో ప్రజాస్వామ్యం అపహాస్యం!

సీఎం జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికలు ఎన్నడూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదు. వైకాపా మినహా ఇతర పార్టీల ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల్లో కూర్చోనివ్వడంలేదు.

Published : 05 May 2024 05:14 IST

తెదేపా ఏజెంట్లను లొంగదీసుకునే ఎత్తులు
లేదంటే ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్రలు
దాడులు, ఎదురు కేసులు పెట్టేందుకు యత్నాలు
50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో ఇదే వ్యవహారం

పులివెందుల

ఈనాడు, కడప: సీఎం జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికలు ఎన్నడూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగడంలేదు. వైకాపా మినహా ఇతర పార్టీల ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల్లో కూర్చోనివ్వడంలేదు. దౌర్జన్యంగా ఏకపక్షంగా పోలింగ్‌ జరిపించుకునే కుతంత్రాలు సాగిస్తారు. ఓటరు తన అభిప్రాయం మేరకు ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణం ఉండదు. వైకాపా నేతల గుప్పిట్లో పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయి. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ లింగాల గ్రామంలో తెదేపా ఏజెంట్లపై దాడి జరిగింది. గత అనుభవాలతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

  • పులివెందులలో వైకాపా మినహా ఇతర పార్టీలు స్వేచ్ఛగా ప్రచారం నిర్వహించుకునే పరిస్థితుల్లేవు. గతేడాది సెప్టెంబరు 8న తెదేపా అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా గండికోట ప్రాజెక్టు సందర్శించి పులివెందుల నుంచి అనంతపురం వెళుతుండగా అంబకపల్లెలో తెదేపా కార్యకర్త నాగరాజు బాణసంచా కాల్చారనే కారణంగా అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.
  • ఇటీవల పీసీసీ అధ్యక్షురాలు షర్మిల లింగాల గ్రామానికి ఎన్నికల ప్రచానికి వెళ్లిన సమయంలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వివేకా కుమార్తె సునీతకు అడ్డంకులు సృష్టించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు పలుసార్లు విజ్ఞప్తులు చేసినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.  
  • లింగాల మండలం లింగాల, తాతిరెడ్డిపల్లె, రామన్నూతనపల్లె, చిన్నకుండాల, అంబకంపల్లె, మురారిచింతల, కోమన్నుతుల, దిగువపల్లె, ఎగువపల్లెలో వైకాపా తప్ప ఇతర పార్టీల ఏజెంట్లను కూర్చోనివ్వడం లేదు. ఏజెంట్‌ ఫారాలు తీసుకొచ్చిన వ్యక్తిని ప్రలోభాలతో లోబర్చుకునే ప్రయత్నం చేస్తారు.
  • పులివెందుల మండలపరిధిలో పెద్ద రంగాపురం, ఎర్రగుడిపల్లె, నగిరిగుట్ల పోలింగ్‌ కేంద్రాలను గతంలో వైకాపా తమ స్వాధీనం చేసుకుని గుండాగిరితో ఎన్నికలు జరిపించారు. నాలుగు రోజుల కిందట పెద్ద రంగాపురం గ్రామానికి సునీత ఎన్నికల ప్రచారానికి వెళ్లగా వైకాపా మూకలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి.
  • సీఎం జగన్‌ స్వగ్రామం సింహాద్రిపురం మండలం బలపనూరులో ఏ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా  జరగడంలేదు. వైకాపా తప్ప ఇతరులు ఏజెంట్‌గా కూర్చోవడానికి లేదు. 2019 ఎన్నికల్లో  తెదేపా ఏజెంట్‌గా కూర్చున్న వ్యక్తి మోటారు పైపులు కత్తిరించి బోరులోకి పడిపోయేలా చేస్తామని హెచ్చరిస్తారు. దీంతో తెదేపా ఏజెంట్‌ ఉదయం 10 గంటల తర్వాత పోలింగ్‌ కేంద్రం నుంచి వెనక్కి వచ్చేశారు.
  • నియోజకవర్గంలో 2,29,687 మంది ఓటుహక్కును వినియోగించుకోవడానికి 301 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిలో 124 పోలింగ్‌ కేంద్రాలు అత్యంత సమస్యాత్మక, 118 వరకు సమస్యాత్మకమైనవిగా గుర్తించినప్పటికీ ప్రజాస్వామ్యయుత ఎన్నికలకు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో 14 నియోజక వర్గాల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు చర్యలు తీసుకోగా, ఇక్కడ లేకపోవడం గమనార్హం.
  • నియోజకవర్గంలో దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం గొడవలు జరుగుతున్నాయి. పోల్‌కాని ఓట్లను దొంగ ఓట్లుగా వేయడానికి వైకాపా ప్రయత్నించడం, తెదేపా ఏజెంట్లు అడ్డుకోవడం, ప్రతిగా దాడులు చేయడం షరామామూలుగా మారాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి అల్లర్లు చెలరేగడం జరుగుతోంది.
  • ప్రతిపక్షాల ఏజెంట్లను ముందుగానే గుర్తించి వారిని ప్రలోభాలకు గురిచేసేందుకు అన్ని రకాలు ఎత్తులు వేస్తారు. మొండిగా పోలింగ్‌ కేంద్రంలో కూర్చోవడానికి ప్రయత్నించే పక్షంలో వారి ఆస్తుల్ని ధ్వంసం చేయడం, కుటుంబ సభ్యుల్ని బెదిరించడం వంటి ఘటనలు గతంలో జరిగినా.. అడ్డుకునే దిశగా, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపిస్తామనే భరోసా ఇచ్చే ప్రయత్నాలు నియోజకవర్గంలో జరగలేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని