logo

బోరుమంటున్న జగన్‌ హామీ!

వ్యవసాయ ఉత్పాదకత పెంపులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయడంతో పాటు, మోటారు, పైపులు, విద్యుత్తు నియంత్రికలు ఏర్పాటు చేయిస్తామని సీఎం జగన్‌ గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు.

Published : 07 May 2024 06:04 IST

జలకళ పథకం కింద 7,811  
దరఖాస్తులు ఇప్పటివరకు తవ్వింది కేవలం 326 బోర్లే
ఎండిపోతున్న పంట పొలాలు, తోటలు
న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ

రాజంపేట మండలంలో బోరునీరు లేక ఎండిపోయిన అరటి తోటలు

వ్యవసాయ ఉత్పాదకత పెంపులో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బోర్లు వేయడంతో పాటు, మోటారు, పైపులు, విద్యుత్తు నియంత్రికలు ఏర్పాటు చేయిస్తామని సీఎం జగన్‌ గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 2020, సెప్టెంబరు 28న ‘వైఎస్‌ఆర్‌ జలకళ’ పేరుతో పథకాన్ని ఆయనే స్వయంగా ప్రారంభించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కొంత కాలానికి నిబంధన కొర్రీలు వేసి పథకాన్ని నీరుగార్చింది. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ఒరిగిందేమీ లేదని రైతులు పెదవి విరుస్తున్నారు.  

వైయస్‌ఆర్‌ జలకళ పథకం ప్రారంభ దశలో బోరు తవ్వకంతోపాటు విద్యుత్తు కనెక్షన్‌, పంపుసెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఎక్కవ నిధులు విద్యుత్తు కనెక్షన్‌కే అవుతుండటంతో కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. విద్యుత్తు సరఫరా, పంపుసెట్లు, వ్యయం పూర్తిగా రైతులే భరించాలని మెలిక పెట్టారు. దీంతో బోర్లు వేయడం వరకే పరిమితం చేశారు. విద్యుత్తు తీగలు, నియంత్రికలు అందుబాటులో ఉన్నాయని రైతులు చెబుతున్నా బోర్లు మాత్రం వేయడం లేదు. దీంతో ఈ పథకం ఉద్దేశం నీరుగారిపోయింది.

పథకం ప్రారంభ దశలో కొంత మంది రైతులకే అవకాశం ఇవ్వడంతో చాలా మంది కర్షకుల నుంచి వ్యతిరేకత రావడంతో దరఖాస్తు చేసుకునే వారందరికీ న్యాయం చేస్తామని చెప్పడంతో ఎక్కువ మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం కొంత మేర నిధులు మాత్రమే ఇస్తామని చెప్పడంతో వారంతా అయోమయంలో పడ్డారు. బోర్లు మాత్రమే వేయిస్తామని మోటారు, విద్యుత్తు కనెక్షన్‌ రైతులే ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ తరువాత బోర్లు వేసినా గుత్తేదారులకు నిధులు అందకపోవడంతో బోర్లు వేయించడం నిలిపివేశారు. రాజంపేట నియోజకర్గంలో 337 మంది రైతులు జలకళ పథకానికి దరఖాస్తులు చేసుకోగా ఒక్క బోరు వేసిన పాపాన పోలేదు.

ఆకేపాడులో ఆరటి తోటలు ఎండిపోవడంతో బోర్లు వేయించుకుంటున్న రైతులు


ప్రభుత్వం రైతులను ఆదుకోలేదు
- రాంమోహన్‌రాజు, రైతు, హస్తివారిపల్లి

భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. రైతులు సాగు చేసిన పంటలను వదిలేసే స్థితికి వచ్చాం. చాలా బోర్లు వేసినా నీరు రావడంలేదు. ఒక బోరు వేయాలంటే రూ.లక్ష ఖర్చవుతోంది. జలకళ పథకం కింద దరఖాస్తు చేసుకున్నా ఉపయోగం లేకుండాపోయింది. కనీసం బోర్లు వేసే ఖర్చయినా ప్రభుత్వం చూసుకుంటే మేము విద్యుత్తు కనెక్షన్‌ తీసుకుంటామని చెప్పినా అధికారులు స్పందించ లేదు


ఒక్కరికీ¨ లబ్ధి చేకూరలేదు
- నరసింహులు, రైతు, గుండాలపల్లి, రాజంపేట మండలం

మా గ్రామంలో ఎవరికీ జలకళ పథకం తెలియదు. అధికారులను సంప్రదించగా పంచాయతీకి రాలేదని చెప్పారు. అయిదేళ్లవుతున్నా పథకంతో ఒక్కరూ లబ్ధి పొందలేదు. నేను ఆరు బోర్లు వేయించాను నాకు దాదాపు రూ.ఆరు లక్షలు ఖర్చయింది. అధికారులు జలకళ ద్వారా బోర్లు వేయించి ఉంటే మాకు చాలా వరకు ఖర్చులు తగ్గడంతోపాటు నీరున్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించే అవకాశం ఉండేది.


జలకళ పథకం అమలు ఇలా...

రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులు : 7,811
తవ్వడానికి అనుమతులు ఇచ్చింది  : 5,510
బోర్లు వేయడానికి ఏపీడీ అనుమతి  : 931
బోర్లు వేసిన సంఖ్య   :     326
ఖర్చు చేసిన నగదు    :   రూ.1.59 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని