logo

అమ్మా స్కూలు వద్దకెళుతున్నాం...ఇదే ఆ చిన్నారుల చివరి మాట

అమ్మా స్కూలు వద్దకెళుతున్నాం.. అంటూ ఆ చిన్నారులు తమ తల్లులకు చెప్పారు. అవే.. ఆ మాతృమూర్తులకు వినిపించిన చివరి పలుకులయ్యాయి. పిల్లలిద్దరూ పెన్నా నదిలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. సిద్దవటం ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపిన

Updated : 18 Feb 2022 10:36 IST

నంద్యాల సతీష్‌ , నంద్యాల బాలాజీ (దాచిన చిత్రం)

సిద్దవటం, న్యూస్‌టుడే : అమ్మా స్కూలు వద్దకెళుతున్నాం.. అంటూ ఆ చిన్నారులు తమ తల్లులకు చెప్పారు. అవే.. ఆ మాతృమూర్తులకు వినిపించిన చివరి పలుకులయ్యాయి. పిల్లలిద్దరూ పెన్నా నదిలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లా సిద్దవటం ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సిద్దవటంలోని రత్నసభాపతి నగర్‌కు చెందిన నంద్యాల శ్రీరాములు, భార్య జ్యోతి అనే దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. శ్రీరాములు జీవనోపాధి నిమిత్తం మూడు నెలల కిందట గల్ఫ్‌ దేశానికి వెళ్లారు. వీరి బంధువైన శేఖర్‌, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. ఈయన స్థానికంగా కూలీచేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు.

శ్రీరాములు మొదటి కుమారుడు సతీష్‌(10), శేఖర్‌ రెండో కుమారుడు బాలాజీ (7) బుధవారం సాయంత్రం పాఠశాల వద్దకు వెళ్లి వస్తామని తల్లులకు చెప్పి చిన్న సైకిల్‌పై పెన్నా లోలెవెల్‌ కాజ్‌వే వద్దకు వెళ్లారు. రాత్రయినా వారు ఇళ్లకు చేరకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు అంతటా గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సతీష్‌ ఎగువపేటలోని ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి, బాలాజీ రెండో తరగతి చదువేవారు.పెన్నానది లోలెవెల్‌ కాజ్‌వేపై ఆ చిన్నారుల సైకిల్‌ ఉండడంతో నదిలో ఈతకు వెళ్లి గల్లంతై ఉంటారనే అనుమానంతో ఒంటిమిట్ట సీఐ రాజాప్రభాకర్‌, సిద్దవటం ఎస్సై మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈతగాళ్లు రాత్రి గాలింపు చేపట్టారు. నీటి మడుగులో చిక్కుకుని ఉన్న ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఈతగాళ్లు వల ద్వారా గురువారం వెలికితీశారు. మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీళ్లపర్యంతమయ్యారు. పంచనామా నిమిత్తం మృతదేహాలను కడప సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. విద్యార్థుల మృతికి సిద్దవటం బాధ్య ఎంఈవో వెంకటరామిరెడ్డి, కడప ఎంఈవో నారాయణ సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని