logo

Mekapati Goutham Reddy: నీ నవ్వు పదిలం.. నిను మరువం !

మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో జిల్లావాసులు శోకసంద్రంలో మునిగారు. విద్యావంతుడు, మృధుస్వభావి, స్నేహశీలి, వివాద రహితుడు, హుందాతనం కలిగిన వ్యక్తిగా పేరొందిన గౌతంరెడ్డి మరణవార్త ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలను దిగ్భ్రాంతికి గురి చేసింది.

Updated : 22 Feb 2022 09:26 IST

వివాదాలకు తావివ్వని రాజకీయ నేపథ్యం
గౌతంరెడ్డి మరణంతో శోకసంద్రంలో అభిమానులు

పార్టీలతో పనిలేదని.. ప్రగతే ముఖ్యమని.. విమర్శల కంటే వినమ్రతే మేలని.. ఎప్పుడొచ్చామన్నది కాదు.. ఎంత చేశామన్నదే కొలమానమని జిల్లా రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఓ యువ కిరణం కనుమరుగైంది. ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ప్రతి మాటలో, చేతలో.. నడతలో.. సమర్థుడిగా నిలిచి.. అందరి వాడిగా పేరు తెచ్చుకున్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణం హతాశులను చేసింది. ఆయన ఇక లేరని.. తిరిగి రాని లోకాలకు తరలారన్న విషయాన్ని జిల్లా ప్రజ నమ్మకలేకపోతోంది. శోకతప్త హృదయాలతో నివాళి అర్పించింది. 
ఈనాడు డిజిటల్, నెల్లూరు: నెల్లూరు (జడ్పీ),ఆత్మకూరు, సంగం, నాయుడుపేట, న్యూస్‌టుడే:  మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో జిల్లావాసులు శోకసంద్రంలో మునిగారు. విద్యావంతుడు, మృధుస్వభావి, స్నేహశీలి, వివాద రహితుడు, హుందాతనం కలిగిన వ్యక్తిగా పేరొందిన గౌతంరెడ్డి మరణవార్త ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలను దిగ్భ్రాంతికి గురి చేసింది. శాసనసభ్యుడిగా, మంత్రిగా సమర్థ పనితీరుతో అందరి మన్ననలు పొందిన ఆయన అకాల మరణం అందరినీ బాధించింది. విషయం తెలిసిన వెంటనే కొందరు హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లగా... మరికొందరు నెల్లూరు, బ్రాహ్మణపల్లిలోని ఆయన స్వగ్రామానికి పరుగులు తీశారు. ఏం జరిగింది? ఎలా జరిగిందంటూ ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రజల సందర్శనార్థం మంగళవారం ఉదయం గౌతంరెడ్డి పార్థివ దేహాన్ని నెల్లూరు డైకస్‌ రోడ్డు సమీపంలోని స్వగృహంలో ఉంచనుండటంతో.. అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత 23వతేదీ బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తారని భావించినా.. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఉదయగిరిలోని మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో  అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
మూగబోయిన జిల్లా .. మంత్రి మరణ వార్తతో జిల్లా కేంద్రం స్తంభించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర పార్టీల నాయకులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా.. నాయకులు, కార్యకర్తలు ఉద్వేగానికి గురయ్యారు. గౌతంరెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. పది మందిలో ఉన్నా.. ఆప్యాయంగా పేరుపెట్టి పిలుస్తారని ఒకరు.. రోడ్డుపై నడిచి వెళుతుంటే.. బండి ఆపి మరీ ఎక్కించుకుని వెళ్లే సంస్కారం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి చిత్రపటానికి నివాళులర్పించగా.. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన కార్యాలయం ఆవరణలో మౌనం పాటించి సంతాపం తెలిపారు. పార్టీలకు అతీతంగా తెదేపా, వైకాపా, జనసేన, వామపక్ష నాయకులు నివాళులర్పించారు. మేకపాటి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆత్మకూరులో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు వ΄సి బంద్‌ పాటించారు.  
స్వగ్రామం.. బ్రాహ్మణపల్లిలో 
మేకపాటి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. పనులకు వెళ్లేవారు వెనక్కు వచ్చి మరీ.. టీవీలకు అతుక్కుపోయారు. గ్రామాభివృద్ధికి మంత్రి చేసిన సేవలను, వారిపై ఆయన చూపించే ప్రేమను గుర్తు చేసుకున్నారు. అధ్వానంగా ఉన్న బీసీ వసతి గృహాన్ని రూ. 20 లక్షలతో మరమ్మతు చేయించడం.. విద్యుత్తు సమస్యలు తీర్చేందుకు గ్రామ సమీపంలో సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయడం వంటి వాటిపై చర్చించుకున్నారు.

పారిశ్రామికవృద్ధిలో కీలకపాత్ర

జిల్లా పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  సుమారు 13 భారీ, 646 చిన్న పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మేనకూరు పారిశ్రామిక వాడలో నీటి కొరత తీర్చేందుకు రూ.625 కోట్లతో కండలేరు జలాశయం నుంచి సరఫరా చేసే పనులు పురోగతిలో ఉన్నాయి. వీటికి వేగంగా అనుమతులు ఇప్పించడంలో తమదైన పాత్ర పోషించారు. కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్‌ భూసేకరణలో ప్రత్యేక చొరవ చూపారు. 
రాజకీయ శైలి వినూత్నం
గౌతంరెడ్డి రాజకీయ శైలి వినూత్నం. ప్రజలను, కార్యకర్తలను ఆకట్టుకోవడంతో పాటు మండలాల్లో పార్టీకి పటిష్ఠ నాయకత్వం ఏర్పడేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కక్ష సాధింపు రాజకీయాలకు దూరం. దీంతో సౌమ్యుడిగా, వ్యక్తిగత శత్రువులు లేని నాయకుడిగా గుర్తింపు పొందారు. నిత్యం ప్రజల్లో ఉంటూ మన్ననలు పొందారు. ఎన్నికల్లో పోటీ చేయకముందే 2013లో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
సోమశిల సమస్యలపై దృష్టి 

సోమశిల ప్రాజెక్టు ఆయకట్టులో కొన్ని కీలక సమస్యలు.. భూసేకరణ సమస్యలు అనేకం అపరిష్కృతంగానే ఉన్నాయి. వాటిపై ‘ఈనాడు’లో వచ్చిన కథనాలకు ఆయన స్పందించి వాటి పరిష్కారానికి జేసీ, జలవనరులు, అటవీశాఖ అధికారులతో ఓ కమిటీని నియమించారు.  రెండు దఫాలుగా సమీక్షించి పనుల వేగవంతానికి కృషి చేశారు. సోమశిల హైలెవల్‌ కాలువ రెండో దశ పనులను సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం, ఉత్తర కాలువ వెడల్పు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
సెజ్‌ ఏర్పాటు కల

ఆత్మకూరు.. మెట్టప్రాంతం. సరైన ఉపాధి అవకాశాలు లేక.. ఇక్కడి యువత వలస వెళుతున్న పరిస్థితి. దాన్ని మార్చాలన్న లక్ష్యంతో ఎస్‌ఎంఎంఈ సెజ్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల భూసేకరణకు సంబంధించిన గెజిట్‌ కూడా విడుదలైంది. దీన్ని సాకారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముందుకు సాగారు. రెండు సార్లు జాబ్‌ మేళా కూడా నిర్వహించారు.

మీ ఎమ్మెల్యేకు తెలుగొచ్చింది...

మంత్రి విద్యాభ్యాసం అంతా ఆంగ్ల మాధ్యమంలోనే సాగింది. తెలుగులో మాట్లాడటం కొంత కష్టమైనా ఆత్మకూరులోని ఓ కల్యాణ మండలంలో 2015లో నిర్వహించిన ముద్రా రుణ పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో నాడు ఎంపీగా ఉన్న తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి.. కుమారుడు, ఎమ్మెల్యేగా ఉన్న గౌతంరెడ్డి ఒకే వేదికను పంచుకున్నారు. ఆ క్రమంలో గౌతంరెడ్డి తెలుగు ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్న రాజమోహన్‌రెడ్డి.. అనంతరం ప్రసంగిస్తూ.. మీ ఎమ్మెల్యేకు తెలుగు బాగా వచ్చిందంటూ ప్రశంసించారు.
ఆరంభం.. వీడ్కోలు అక్కడే...

గౌతంరెడ్డి తొలి బహిరంగ సభ.. చివరగా ప్రజలతో కలసి మెలసి మాట్లాడటం సంగం మండలంలోనే జరగడం విధి విచిత్రం. ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టాలని నిర్ణయించిన తర్వాత.. ఆత్మకూరు నియోజకవర్గంలో తొలి కార్యక్రమం సంగంలో నిర్వహించారు. ఆఖరిసారి ఈ నెల తొమ్మిదో తేదీ చెన్నవరప్పాడుకు వెళుతూ తరుణవాయి జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని 24 గంటల్లో తన సొంత నిధులతో పరిష్కరించారు.
కల సాకారం కాకుండానే..

టైక్స్‌టైల్‌ రంగంపై ఉన్నత విద్యను అభ్యసించిన గౌతంరెడ్డికి.. సంగంలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలన్నది కోరిక. 2014 ఎన్నికల ప్రచారంలోనూ దీనిపై హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే.. 2019లో మంగళగిరిలో జరగాల్సిన జాతీయ చేనేత దినోత్సవాన్ని సంగంలో నిర్వహించారు. తన కుమార్తె కూడా సంగంలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలని చెప్పినట్లు పలు సందర్భాల్లో ప్రస్తావించారు.

కావలిలో కొవ్వొత్తులతో నివాళి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని