logo

Andhra News: ప్రియుడిని రెచ్చగొట్టి భర్తను చంపించిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించింది భార్య. అనంతరం దర్యాప్తు ఆపేయాలని ఆమె పదే పదే కోరడంతో అనుమానం వచ్చి పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెతో పాటు పలువురిని విచారించగా భర్తను చంపింది తామేనని వారు అంగీకరించారు.

Updated : 01 May 2022 12:04 IST


వివరాలు వెల్లడిస్తున్న అదనపు ఎస్పీ  అనిల్‌కుమార్, ముసుగు ధరించి నిల్చున్న నిందితులు

విజయనగరం నేరవార్తా విభాగం, పూసపాటిరేగ, న్యూస్‌టుడే: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించింది భార్య. అనంతరం దర్యాప్తు ఆపేయాలని ఆమె పదే పదే కోరడంతో అనుమానం వచ్చి పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెతో పాటు పలువురిని విచారించగా భర్తను చంపింది తామేనని వారు అంగీకరించారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి అదనపు ఎస్పీ అనిల్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. డెంకాడ మండలం డి.బాడువకు చెందిన డి.రామకృష్ణ (51) ఆటో నడుపుతూ వచ్చిన సొమ్మును మద్యం తాగేందుకు ఖర్చు చేసేవాడు. డబ్బులు లేకపోతే భార్య లక్ష్మిని అడిగేవాడు. ఆమె పైడిభీమవరంలోని ఫార్మా కంపెనీ క్యాంటీన్‌లో హెల్పర్‌గా పని చేస్తోంది. అదే కంపెనీలో సూపర్‌వైజర్‌గా చేస్తున్న పెద్ద తాడివాడకు చెందిన బి.దశకంఠేశ్వరరావుతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నారు. లక్ష్మి అవసరాలకు ఆయనే డబ్బులు సమకూర్చేవారు. ఏడాది కిందట ఈ విషయం రామకృష్ణకు తెలియడంతో ఇంట్లో ఘర్షణ జరిగింది. ఆయన అడ్డు తొలగించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. నిరాశ చెందిన లక్ష్మి బి.దశకంఠేశ్వరరావుతో వాగ్వాదానికి దిగింది. ఓ తాగుబోతుని చంపలేని నువ్వు దేనికి పనికొస్తావంటూ రెచ్చగొట్టింది. దీంతో ఆయన అదే కంపెనీలో పనిచేస్తున్న పూసపాటిరేగ మండలానికి చెందిన జి.శంకరరావు సహాయంతో ప్రణాళిక రచించారు.  
వంతెన పైనుంచి తోసేయాలని.. గత నెల 2న పేరాపురం సమీపంలో ఆటో నడుపుతున్న రామకృష్ణకు ఫోన్‌ చేసి మద్యం తాగేందుకు దశకంఠేశ్వరరావు పిలిచారు. రాత్రి 8 గంటల సమయంలో పిట్టపేట వైపు ఆటోలో వెళ్లి మద్యం తాగి తిరిగి పయనమయ్యారు. అనంతరం రామకృష్ణతో జి.శంకరరావు గొడవకు దిగి ఆటోలో నుంచి తోసేశాడు. రోడ్డుపై పడిన రామకృష్ణ తలకు తీవ్రగాయమవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు. మృతదేహాన్ని సీహెచ్‌ అగ్రహారం వద్ద పొలాల్లో పూడ్చాలనుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆటోలో మృతదేహాన్ని పెట్టుకుని నాతవలస వంతెన పైనుంచి కిందకు తోసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ద్విచక్రవాహనం రావడంతో రోడ్డుపైనే ఆటోను తిరగేసి పరారయ్యారు. అనంతరం రామకృష్ణ కుమార్తె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రక్రియను ఆపేయాలని లక్ష్మి పదేపదే పోలీసులను ఆశ్రయించడంతో అనుమానం వచ్చిన ఎస్‌ఐ జయంతి వారిని విచారించడంతో చంపింది తామేనని అంగీకరించారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ ఆర్‌.జయంతి, కానిస్టేబుల్‌ దామోదరరావు, సిబ్బందిని అదనపు ఎస్పీ పి.అనిల్‌కుమార్‌ అభినందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని