logo
Published : 01/12/2021 03:54 IST

హామీల విస్మరణ.. రైతుల ఆవేదన

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

పనులు పూర్తయిన నూతన సమీకృత కలెక్టరేట్‌ భనవం

ఇలా నూతన కలెక్టరేట్‌ భవనానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగున్నరేళ్ల కావస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. భూములు తీసుకున్న సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి, తీరా వాటిని విస్మరించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. మాకు కేటాయించిన లేఅవుట్‌లో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని, అమ్ముకుందామంటే కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పురపాలక, రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పరిపాలన వికేంద్రీకరణ, ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2016లో జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఆ వెంటనే జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే వికారాబాద్‌ ఎన్నెపల్లి రెవెన్యూ పరిధి 39 ఎకరాల భూములను భవన సముదాయానికి కేటాయించారు. ఇందులో భూములు ఇచ్చిన 39 కుటుంబాలకు 8 ఎకరాల్లో లే అవుట్‌ అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. పరిహారంగా ఒక్కో ఎకరానికి 400 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని ఇస్తామని, లే అవుట్‌ అభివృద్ధి బాధ్యత మాదే, పొరుగు సేవల ద్వారా ఉద్యోగం, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి పథకంలో ప్రాధాన్యం ఇస్తామని అప్పటి కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, తదితరులు హామీ ఇచ్చారు. దీంతో రైతులు సమ్మతించి తమ భూములను ఇవ్వడంతో  కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి రూ.45 కోట్లు కేటాయించారు. ఇప్పుడు నిర్మాణ వ్యయం రూ.60 కోట్లకు చేరిందని సమాచారం. పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా, బాధిత రైతు కుటుంబాలకు ఇస్తామన్నా లే అవుట్‌ పనులు మాత్రం ఇప్పటికి ప్రారంభానికి నోచుకోలేదు. దీనికి సంబంధించిన నిధులను పురపాలక సంఘం నుంచి కేటాయించాలని అప్పట్లో చెప్పారు. దాదాపు రూ.1.5 కోట్ల వరకు అవసరం ఉంటుందని అంచనా వేశారు. కేటాయింపుల్లో తాత్సారం చేసి, ప్రస్తుతం నిధులు లేవని చేతులెత్తేశారు. దీంతో లే అవుట్‌ అభివృద్ధి చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవన సముదాయానికి రూ. కోట్లు కేటాయించి, ఆ భూములు ఇచ్చిన మా గురించి పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొంటున్నారు.

అన్నదాతలకు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన లే అవుట్‌


 

ఇబ్బందులు లేకుండా చూస్తాం

నిఖిల, కలెక్టర్‌
కలెక్టరేట్‌ భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అంతకంటే ముందే లబ్ధిదారులకు ఇచ్చే లే అవుట్‌ అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని ప్రయత్నిస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వానికి నిధుల కేటాయింపుపై లేఖ రాశాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.


ఆదుకుంటామని, జాప్యం చేస్తున్నారు.: రాజు  

 

కలెక్టర్‌ కార్యాలయ నిర్మాణానికి 5.05 ఎకరాలు ఇచ్చాం. 2017లో భూములు తీసుకున్నపుడు, భూములు ఇచ్చిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని అప్పటి కలెక్టర్‌ హామీ ఇచ్చారు. భవన నిర్మాణంతోపాటే  ప్లాట్ల లేఅవుట్‌ను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. రైతు కుటుంబాల్లో విద్యార్హత ఉన్న ఒకరికి పొరుగు సేవల పద్ధతిలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నాలుగున్నరేళ్లు పూర్తయ్యింది. ఇప్పటికీ లేఅవుట్‌ అభివృద్ధికి నోచడంలేదు. ఉచిత రిజిస్ట్రేషన్‌ అని, మాతో రుసుం కట్టించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు వేరే చోట మూడు ఎకరాల పొలం ఇస్తామన్నారు. ఏ హామీ సక్రమంగా అమలు చేయడం లేదు. ఇదేమని అధికారులను అడిగితే, మీకు హామీ ఇచ్చిన వారిని అడగండి సమాధానం ఇస్తున్నారు.


మౌలిక సదుపాయాలు లేవు: భీమయ్య
మాకు కేటాయించిన భూమిని లే అవుట్‌గా అభివృద్ధి చేసి రహదారులు, భూగర్భ తాగు నీరు, డ్రైనేజీ, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క పని ప్రారంభించలేదు. ఎప్పుడు అడిగినా అదిగో, ఇదిగో అంటున్నారు తప్ప పురోగతి కనిపించడం లేదు. ఇల్లు కట్టుకోవాలన్నా ఎల్‌పీ నంబరు అవసరం అంటున్నారు.
 

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని